జనం ఓట్లకు వెంపర్లాట.. జలకష్టాల దాటవేత!

గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకాల్లో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) ప్రధానమైనవి. అందుకే రాష్ట్రంలోని దాదాపు 4,000 ఆవాస ప్రాంతాల్లో ఉంటున్న లక్షల కుటుంబాలకు రోజూ తాగునీటిని సరఫరా చేయడానికి 591 పథకాలను నిర్మించారు.

Updated : 01 Apr 2024 06:11 IST

ప్రజల క‘న్నీళ్లు’ పట్టించుకోని వైకాపా ప్రభుత్వం
591 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు తిలోదకాలు
ఏడాదికి రూ.500 కోట్లు ఇవ్వడానికీ చేతులు రాని జగన్‌
వందల గ్రామాల్లో దాహార్తితో అల్లాడుతున్న ప్రజలు
ఇదేనా పేదల సర్కారు అంటే?
ఈనాడు, అమరావతి

ఆచరణవాది అధికారంలో ఉంటే... ప్రభుత్వ వ్యవస్థలన్నీ వేటి పని అవి చేస్తాయి... ప్రజలకు ఉపాధి దొరుకుతుంది... యువతకు ఉద్యోగాలూ లభిస్తాయి... సాగు, తాగునీటి సరఫరాకు ఢోకా ఉండదు...  అదే, విధ్వంసకవాది చేతికి పగ్గాలు చిక్కితే... అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది... గుక్కెడు నీటికీ గుక్కపట్టాల్సిన దుస్థితి వస్తుంది... రాష్ట్రంలో ఐదేళ్ల జగన్‌ పాలనే దీనికి సాక్ష్యంగా నిలిచింది..!

గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకాల్లో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) ప్రధానమైనవి. అందుకే రాష్ట్రంలోని దాదాపు 4,000 ఆవాస ప్రాంతాల్లో ఉంటున్న లక్షల కుటుంబాలకు రోజూ తాగునీటిని సరఫరా చేయడానికి 591 పథకాలను నిర్మించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ... అవసరమైనచోట మరమ్మతులు చేస్తూ ఉంటే చక్కగా పనిచేస్తాయి. ఈ బాధ్యతలను గుత్తేదారు సంస్థలకు అప్పగించి, అవసరమైన నిధులను విడుదల చేస్తూ... వాటి పనితీరును పర్యవేక్షిస్తుంటే చాలు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది. మొత్తంగా ఆయా పథకాల నిర్వహణకు విద్యుత్‌ ఛార్జీలతో కలిపి ప్రతి సంవత్సరం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది.

తెదేపా ప్రభుత్వంలో ఏం జరిగేదంటే...!

తాగునీటి పథకాల నిర్వహణకు గత తెదేపా ప్రభుత్వంలో ఏటా రూ.500 కోట్లకు తక్కువ కాకుండా కేటాయించేవారు. జిల్లా పరిషత్‌ సాధారణ నిధుల నుంచి బిల్లులు చెల్లించేవారు. ఎక్కడైనా ఇంకా బకాయిలు ఉంటే... రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. దీంతో తాగునీటి పథకాల నిర్వహణలో ఇబ్బందులకు ఆస్కారం ఉండేదికాదు. మరమ్మతులు, పరికరాలు, పైపుల మార్పులు ఎప్పటికప్పుడు చేసేవారు. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటితే ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు.

జగన్‌ వచ్చాక నిర్వహణ వ్యవస్థకు తూట్లు

జగన్‌ సీఎం అయ్యాక... మొదటి రెండేళ్లపాటు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ సరిగానే సాగింది. జిల్లా పరిషత్తుల్లో నిధుల కొరత ఉంటే పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం నిధులనూ అందించారు. మూడో ఏడాది నుంచి పథకాల నిర్వహణ బాధ్యతను జిల్లా పరిషత్తులే చూసుకోవాలని చేతులెత్తేశారు. సొంత ఆదాయ వనరులు లేని జడ్పీలు ఇన్ని కోట్ల విలువైన పథకాలను ఎలా నిర్వహిస్తాయనే ధ్యాస లేకుండా నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్లుగా నిధులను కేటాయించడం లేదు. తెదేపా హయాంలో చేపట్టిన పలు పథకాలను సైతం పూర్తి చేయకుండా వదిలేశారు.

సర్కారు నిర్లక్ష్యంతో ఫిబ్రవరి నుంచే ఎద్దడి షురూ

జడ్పీల దగ్గర సొంత నిధులు లేవు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను జగన్‌ ప్రభుత్వం మళ్లించింది. ప్రజలకు తాగునీరు ఇవ్వడం ప్రభుత్వ విధి కాదన్నట్టుగా వ్యవహరించింది. మూడేళ్లుగా సొంత నిధులేమీ ఇవ్వలేదు. ఫలితంగా తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే గ్రామాల్లో నీటిఎద్దడి మొదలైంది. మార్చిలో తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జనం తాగునీటికి రోడ్డెక్కుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.1,280 కోట్ల పెండింగ్‌ బిల్లులున్నాయి. వీటిలో విద్యుత్‌ ఛార్జీల బకాయిలు రూ.900 కోట్లు, పథకాల నిర్వహణ చూసే గుత్తేదారులకు చెల్లించాల్సినవి రూ.380 కోట్లు. గుట్టల్లా పేరుకుపోయిన ఈ బిల్లులను నెలాఖరులోగా చెల్లించకుంటే... బాధ్యతల నుంచి తప్పుకొంటామంటూ కొన్ని జిల్లాల్లో గుత్తేదారులు స్థానిక అధికారులకు మౌఖికంగా తేల్చిచెప్పారు. దాంతో పథకాల నిర్వహణపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రికేమో జనం ఓట్లు తప్ప వారి జల కష్టాలు పట్టడం లేదు.


నాలుగు ఉమ్మడి జిల్లాలను పరిశీలిస్తే..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో

60 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో విద్యుత్‌ ఛార్జీల బకాయిలు రూ.148 కోట్లు, పథకాల నిర్వహణకు గుత్తేదారులకు మరో రూ.13 కోట్లు చెల్లించాలి. జిల్లా పరిషత్తులో నిధులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి ఉలుకూపలుకూ లేదు.

  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 51 తాగునీటి పథకాల నిర్వహణకు సంబంధించి రూ.30 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిలో విద్యుత్‌ ఛార్జీలకు రూ.25 కోట్లు, గుత్తేదారులకు రూ.5 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడంలేదు. గ్రామాలకు తాగునీరు సరిగా సరఫరా కావడంలేదు.
  • ఉమ్మడి విశాఖ జిల్లాలో 43 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలకు రూ.37 కోట్లు చెల్లించాలి. జిల్లా పరిషత్‌ నుంచి వచ్చే నిధులు ఏమూలకూ సరిపోవడం లేదు.
  • ఉమ్మడి విజయనగరం జిల్లాలో 33 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు ఏటా రూ.40 కోట్లు అవసరం. ఆర్థిక సంఘం నిధుల నుంచి సంవత్సరానికి రూ.15 నుంచి రూ.20 కోట్లు వెచ్చిస్తున్నారు. ఫలితంగా  బకాయిలు పెరిగిపోయాయి.

ఆ 16 గ్రామాలకు కన్నీరే మిగిలింది!

ఉమ్మడి నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని 16 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకం పనులు జగన్‌ ఉదాసీనత కారణంగా నిలిచిపోయాయి. ఈ పథకానికి సోమశిల నుంచి అర టీఎంసీ నీటిని కేటాయించారు. జక్కేపల్లిగూడూరు చెరువు సమీపంలో అప్పట్లోనే సర్వీస్‌ రిజర్వాయర్‌ తదితర పనులతోపాటు ప్రధాన పైపులైను నిర్మాణం పూర్తిచేశారు. వైకాపా ప్రభుత్వం గుత్తేదారుకు బిల్లులను ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

ఇదో 57 ఊళ్ల సమస్య

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని 55, పొందూరు మండలంలోని రెండు గ్రామాల్లో ఫ్లోరైడ్‌, కలుషిత భూగర్భ జలాల సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన సమగ్ర రక్షిత తాగునీటి పథకం నిర్వహణ లోపం ప్రజలకు శాపమవుతోంది. ఎచ్చెర్ల మండలంలోని 25 గ్రామాలకే అరకొరగా నీరు ఇస్తున్నారు. కొన్ని ఊళ్లకు ఆరు నెలలుగా సరఫరా నిలిచింది.

లక్ష్యం 32 గ్రామాలైతే ఇస్తోంది... ఒక్క దానికే!

ఉమ్మడి విజయనగరం జిల్లా సీతానగరం, బొబ్బిలి మండలాల్లోని 32 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు బగ్గందొరవలసలో ప్రారంభించిన తాగునీటి పథకం పనులు ఏళ్లుగా పూర్తవడం లేదు. పైపులైన్లు పూర్తి చేయకపోవడం, పనులు చేసినచోట రహదారుల విస్తరణ కోసం తవ్వేయడం వంటి కారణాలతో నీటి సరఫరాను బగ్గందొరవలస గ్రామానికే పరిమితం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని