పాదగయ క్షేత్రాన్ని సందర్శించిన పవన్‌ కల్యాణ్‌

కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సందర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో బసచేసిన ఆయన రెండోరోజైన ఆదివారం ఉదయం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రత్యేకపూజలు చేశారు.

Published : 01 Apr 2024 05:04 IST

ఈనాడు-కాకినాడ, న్యూస్‌టుడే-పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సందర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో బసచేసిన ఆయన రెండోరోజైన ఆదివారం ఉదయం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రత్యేకపూజలు చేశారు. తొలుత విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. దత్తాత్రేయస్వామి, కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతిక అమ్మవారికి పూజలు చేశారు. అష్టోత్తర కుంకుమార్చన చేసి అమ్మవారికి పట్టుచీర సమర్పించారు. శక్తిపీఠంలో శ్రీచక్రాన్ని తాకి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభుడికి పూజలు చేసి, పట్టువస్త్రాలు సమర్పించారు. పాదగయ ప్రాంగణంలోని ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి నారికేళం ముడుపులు కట్టారు. శక్తిపీఠం, శ్రీపాదవల్లభుడి చరిత్రను అర్చకులు పవన్‌కల్యాణ్‌కు వివరించి ఆశీర్వదించారు. పవన్‌కల్యాణ్‌తోపాటు కాకినాడ లోక్‌సభ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఇతర నాయకులు ఆలయాల సందర్శనలో పాల్గొన్నారు.

జన నీరాజనం: పవన్‌ కల్యాణ్‌ కుమారపురంలోని హోటల్‌ గోకులం గ్రాండ్‌లో రాత్రి బస చేశారు. ఆదివారం ఉదయం అక్కడినుంచి వాహన శ్రేణితో పాదగయ క్షేత్రానికి బయల్దేరారు. అప్పటికే పెద్దఎత్తున నిరీక్షిస్తున్న శ్రేణులు జేజేలు కొడుతూ జనసేనాని వెంట కదిలాయి. పిఠాపురంలో దారిపొడవునా నీరాజనాలు పలికాయి.


ఎన్నికల పర్యవేక్షణకు జనసేన రాష్ట్ర కమిటీ నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఎన్నికల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. కమిటీలో మహేందర్‌రెడ్డి (పార్టీ ఉపాధ్యక్షుడు), హరిప్రసాద్‌ (అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి), వేములపాటి అజయ్‌కుమార్‌ (పార్టీ అధికార ప్రతినిధి), మర్రెడ్డి శ్రీనివాస్‌ (అనపర్తి ఇన్‌ఛార్జి), ప్రొఫెసర్‌ శరత్‌కుమార్‌ (పార్టీ అధికార ప్రతినిధి)లు సభ్యులుగా ఉన్నారు. పార్టీ పోటీచేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సమన్వయం, ప్రచార వ్యవహారాల నుంచి పోల్‌, బూత్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. మర్రెడ్డి శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు చూడనున్నారు. ఈ మేరకు పిఠాపురంలో కమిటీ సభ్యులతో పవన్‌ ఆదివారం సమావేశమై దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని