ఆర్టీసీ ఉద్యోగిపై కర్రలతో పోలీసుల దాడి

విధులకు వెళ్తున్న ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగిపై పోలీసులు కర్రలతో విరుచుకుపడ్డారు.. వారి దాడిలో ఆయనకు దవడ విరగడంతో నోటినుంచి తీవ్ర రక్తస్రావమైంది.

Updated : 01 Apr 2024 06:09 IST

దవడ విరగడంతో నోటి నుంచి తీవ్ర రక్తస్రావం
న్యాయం చేయాలని స్టేషన్‌ వద్ద బాధితుడి బైఠాయింపు

మందస, న్యూస్‌టుడే: విధులకు వెళ్తున్న ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగిపై పోలీసులు కర్రలతో విరుచుకుపడ్డారు.. వారి దాడిలో ఆయనకు దవడ విరగడంతో నోటినుంచి తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ధారగా కారుతుండగానే.. ఆయన పోలీసుస్టేషన్‌కు చేరుకొని, న్యాయం చేయాలని బైఠాయించారు. తనపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం గౌడుగురంటి గ్రామానికి చెందిన వగాడి దేవరాజు పలాస ఆర్టీసీ డిపోలో పొరుగు సేవల కింద డ్రైవరు/కండక్టరుగా పని చేస్తున్నారు. విధులకు వెళ్లేందుకు ఆదివారం తెల్లవారుజామున ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కురడాలు కూడలి వద్ద నలుగురు పోలీసులు ఆయన్ను ఆపే ప్రయత్నం చేస్తూ.. కర్రలతో కొట్టారు. పైదవడ విరగడంతో తీవ్ర గాయమైంది.

బాధితుడు నోటి నుంచి రక్తం కారుతుండగానే మందస పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బైఠాయించారు. పోలీసులు బాధితుడిని హరిపురం ఆసుపత్రిలో చేర్పించారు. నాటుసారా అక్రమ రవాణాపై అందిన సమాచారంతో కానిస్టేబుళ్లు ఎస్‌.రవికుమార్‌, కృష్ణ, సంతు, కేశవరావులు అటుగా వెళ్తున్న దేవరాజును ఆపారని ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు. ఆయన వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు అడ్డుపడ్డారని.. దీంతో దేవరాజు, రవికుమార్‌ల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశామన్నారు. నలుగురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వెల్లడించారు.

తెదేపాలో చేరానని  కొట్టించారు..

దాడి ఘటనపై బాధితుడు దేవరాజు మాట్లాడుతూ.. ‘నేను ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెదేపాలో చేరా. అప్పటి నుంచి తిరిగి వైకాపాలోకి రావాలని.. లేకుంటే చంపేస్తామని బుడార్శింగి సర్పంచి సురేష్‌కుమార్‌ పాణిగ్రాహి తరచూ బెదిరిస్తున్నారు. అతని ప్రోద్బలంతోనే పోలీసులు నాపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ‘మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడైన సురేష్‌ పాణిగ్రాహి మంత్రిలాగే వ్యవహరిస్తున్నారు. పాణిగ్రాహి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని బాధితుడు స్పష్టంగా చెబుతున్నారు. ఇంతకన్నా రుజువులు ఇంకేం కావాలి? పోలీసులు బాధ్యతగా వ్యవహరించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని