తిమ్మిని ‘బొమ్మ’ను చేసి.. దర్జాగా బాదేసి!

ధరలు తగ్గిస్తాను... సేవలను మరింత నాణ్యంగా అందించేలా చూస్తానని జగన్‌ హామీ ఇచ్చారంటే అంతే సంగతులని ఐదేళ్ల ఆయన పాలనలో ప్రజలకు అనుభవమైంది.

Published : 01 Apr 2024 05:10 IST

9 లక్షల వినియోగదారులకు ‘సినిమా’ చూపించిన జగన్‌
ఫైబర్‌నెట్‌ ప్యాకేజీ ధరలు రెండుసార్లు పెంపు
గత ప్రభుత్వం రూ.250కే అందించిన సేవలకు రూ.599 వసూలు
ఏటా రూ.108 కోట్లను అదనంగా పిండుకున్న వైనం
పైగా సంస్థ పేరిటే ఇటీవల రూ.902 కోట్ల అప్పుల సేకరణ
ఈనాడు, అమరావతి

జగన్‌ ఐదేళ్ల పాలనలో సామాన్యుడికి వినోదమూ భారమైంది... అధికారంలోకి వచ్చిన వెంటనే ఫైబర్‌నెట్‌ ధరలు తగ్గిస్తామని చెప్పి... ప్యాకేజీల పేరిట అడ్డగోలుగా పెంచే‘సారు’!  అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త కనెక్షనూ ఇవ్వలేదు... భారీ డిమాండ్‌ ఉన్నా పట్టించుకోలేదు! చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు... నష్టాల్లో ఉన్న సంస్థనే కుదువపెట్టి... వందల కోట్ల రుణం మాత్రం తెచ్చుకున్నారు...!

రలు తగ్గిస్తాను... సేవలను మరింత నాణ్యంగా అందించేలా చూస్తానని జగన్‌ హామీ ఇచ్చారంటే అంతే సంగతులని ఐదేళ్ల ఆయన పాలనలో ప్రజలకు అనుభవమైంది. ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా రూ.150కే అన్ని ఛానళ్లతో కేబుల్‌ ప్రసారాలు అందిస్తామని పాదయాత్ర సందర్భంగా సాలూరులో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దాన్ని విస్మరించారు. పేదలు మోయలేనంతగా ప్యాకేజీల ధరలను పెంచి ‘బొమ్మ’ చూపించారు. ధరల పెంపు ద్వారా ఏటా రూ.108 కోట్ల చొప్పున అదనపు ఆదాయాన్ని పిండుకున్నారు. గత తెదేపా ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా కేబుల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా తొమ్మిది లక్షల మంది వినియోగదారులు కనెక్షన్లు తీసుకున్నారు. వారిపై భారం పడకుండా ఒక్కోటి రూ.4,400 ఖరీదైన ట్రిపుల్‌ప్లే బాక్సులను (కేబుల్‌, అపరిమిత నెట్‌, ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సేవలకు ఉపయోగపడే పరికరం) ఉచితంగా అందించింది. ఈ సేవలకు దాదాపు ఏడాదిన్నర కాలంపాటు ఎలాంటి రుసుం వసూలు చేయలేదు. ఆపరేటర్లు మాత్రం నిర్వహణ ఛార్జీల కింద నెలకు రూ.150 చొప్పున తీసుకున్నారు. అనంతరం ప్రతినెలా రూ.250 చొప్పున వసూలు చేస్తూ... అన్ని టీవీ ఛానళ్లతోపాటు అపరిమిత ఇంటర్నెట్‌ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తనకు అధికారం అప్పగిస్తే నెలకు రూ.150 మాత్రమే వసూలు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ చెప్పుకొచ్చారు. తీరా పీఠం ఎక్కాక స్వరం మార్చారు. ఆరు నెలల్లోనే కేబుల్‌ ఛార్జీలను అమాంతం పెంచేశారు. గత ప్రభుత్వ హయాంలో అందిన కేబుల్‌ సేవలను అదేస్థాయిలో... ప్రస్తుతం పొందాలంటే వినియోగదారులు ప్రతినెలా రూ.599 చెల్లించక తప్పని పరిస్థితి.


రాబడి కోసం మూడు ముక్కలు

దాయాన్ని పెంచుకోడానికి... గతంలో ఒకే ప్యాకేజీ కింద ఉన్న సేవలను జగన్‌ ప్రభుత్వం మూడు ముక్కలు చేసింది. రూ.599 ధరలో మొత్తం కేబుల్‌ సేవలను హోమ్‌ ప్రీమియం ప్యాకేజీగా, రూ.449 ధరలో ఛానళ్ల సంఖ్య తగ్గించి, నెలకు 300 జీబీ ఇంటర్నెట్‌తో హోమ్‌ ఎసెన్షియల్‌ ప్యాకేజీగా, రూ.350 ధరలో నాలుగు ప్రధాన తెలుగు ఛానళ్ల సంఖ్యను తగ్గించి, నెట్‌ను 150 జీబీకి పరిమితం చేసి బేసిక్‌ ప్యాకేజీగా తీసుకొచ్చింది. ప్రధాన తెలుగు ఛానళ్ల కోసం వినియోగదారులు మళ్లీ అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువగా పేదలు వినియోగించే బేసిక్‌ ప్యాకేజీ ధరను రెండుసార్లు రూ.50 చొప్పున పెంచింది.


అంతా కాలయాపన.. ఏదీ తపన?

ఫైబర్‌నెట్‌ సంస్థకు ప్రస్తుతం తొమ్మిది లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. సంస్థ అప్పులు, ప్రతినెలా చెల్లించాల్సిన వాయిదాలు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు పోను... ప్రతినెలా రూ.5 కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. వీటి నుంచి గట్టెక్కాలంటే మరో 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలి. ప్రజల నుంచి కూడా కనెక్షన్ల కోసం భారీ డిమాండ్‌ ఉన్నా... కొత్త బాక్సుల కొనుగోలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయలేదు. రెండుసార్లు మొక్కుబడిగా టెండర్లు పిలిచి... బాక్సుల కొనుగోలుకయ్యే ఖర్చును కేబుల్‌ ఆపరేటర్లు భరించాలని మెలిక పెట్టింది. దీంతో ఆపరేటర్లు ముందుకు రావడం లేదు. మొత్తానికి కాలయాపన చేస్తూ ఐదేళ్లూ గడిపేసింది.


సొంత వ్యాపారాలను ఇలాగే చేస్తారా?

సీఎం జగన్‌ స్వతహాగా కార్పొరేట్‌ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులు, బంధుగణానికి అనేక వ్యాపార సంస్థలున్నాయి. వారంతా అయిదేళ్ల కిందట ఉన్న వ్యాపారాలను విస్తరించకుండా వదిలేశారా? ఉన్నవే చాలన్నట్లుగా సరిపెట్టుకున్నారా? ఏ సంస్థ అయినా తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంది. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి శతథా ప్రయత్నిస్తుంది. కానీ, జగన్‌ ప్రభుత్వం ఆలోచనే వేరు. ఫైబర్‌నెట్‌ ఐదేళ్ల కిందట ఎలా ఉందో... అలాగే ఉండేలా చూసింది. కొత్తగా ఒక్క కనెక్షన్‌ ఇవ్వలేదు. కొత్త కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతోనే ఒక్క బాక్సును కూడా కొనలేదు. తెదేపా ప్రభుత్వం 2015లో అందించిన బాక్సులు క్రమంగా మరమ్మతులకు గురికావడం సహజం.
వాటి స్థానంలో కొత్తవి అమర్చడమో, మరమ్మతులు చేయించి ఇవ్వడమో చేయాలి.

ఈ రెండూ చేయకుండా ఫైబర్‌నెట్‌ సంస్థను మూలన పడేసేలా చేసింది. అది ప్రభుత్వ సంస్థ కాదన్నట్లే వ్యవహరించింది. ఫలితంగా చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సిన సుమారు లక్ష వరకు బాక్సులు మూలనపడ్డాయి. వాటిని బాగుచేసే దిక్కు లేదు. మరమ్మతుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కేంద్రాలనూ మూసేసింది.


కోలుకోలేని దెబ్బ కొట్టారు!

కార్పొరేషన్‌ ఏదైనా.. జగన్‌ అప్పులు తేవడానికే అన్నట్లుంది. వివిధ కార్పొరేషన్ల పేర్లతో రుణాలు తెచ్చిన సర్కారు... నష్టాల్లో ఉన్న ఫైబర్‌నెట్‌నూ వదల్లేదు. దానికున్న ఆస్తులను తాకట్టు పెట్టి రూ.350 కోట్లు, ప్రభుత్వ హామీతో రూ.552.70 కోట్లు... మొత్తం రూ.902.70 కోట్ల అప్పులు తెచ్చింది. ఇంకా అప్పులు సృష్టించడానికి సంస్థ పరపతి సరిపోక వదిలేసింది. ఎన్నికల ప్రకటన రావడానికి కొద్ది నెలల ముందే జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ఈ అప్పులు తెచ్చింది. వాటిని సీసీటీవీల నిర్వహణ పేరిట ఖాతాల నుంచి మళ్లించేసింది. రుణాల నుంచి సంస్థను గట్టెక్కించాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసి ఫైబర్‌నెట్‌ సంస్థకు కోలుకునే అవకాశం లేకుండా చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు