సొంతూళ్లకు దూరమై.. బతుకు దైన్యమై!

Published : 02 Apr 2024 02:59 IST

వైకాపా దాడుల భయంతో ఊళ్లొదిలి పోయిన వందల కుటుంబాలు
నాలుగేళ్ల తర్వాత గ్రామాలకు చేరుకుంటున్న ‘వైకాపా బాధితులు’ 
పల్నాడు జిల్లాలో దయనీయ పరిస్థితి 

ఈనాడు, అమరావతి వైకాపా దాడుల భయంతో ఊళ్లు వదిలి వెళ్లిపోయిన పల్నాడువాసులు క్రమంగా సొంతూళ్లకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నేతలు పల్నాడు జిల్లాలో పలుచోట్ల తెదేపా నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అదేపనిగా దాడులకు తెగబడ్డారు. వెంటాడి, వేటాడి వేధించారు. దీంతో ఆయా గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, ఆస్తులు వదిలేసి కుటుంబాలకు కుటుంబాలే కట్టుబట్టలతో వెళ్లిపోయాయి. నాలుగున్నరేళ్లుగా వారంతా అజ్ఞాతవాసం గడిపారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎంతోమంది ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గుంటూరులో ‘వైకాపా బాధితుల శిబిరం’ నిర్వహించి కొందరికి ఆశ్రయం కల్పించింది. వారందరినీ సొంత గ్రామాలకు తీసుకువెళ్లడానికి తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా వారితోపాటు గ్రామాలకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరు గ్రామాలకు చేరుకున్నా మళ్లీ గొడవలు జరగడంతో వలస పోవలసివచ్చింది. వారి భూములను ఇతరులెవరూ కౌలుకు తీసుకోకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. నాలుగున్నరేళ్లలో వారంతా ఊరు కాని ఊరిలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ రావడం, ఆయా గ్రామాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో వలసపోయిన కుటుంబాలు ఒక్కొక్కటిగా సొంతూళ్లకు చేరుకుంటున్నాయి. వారికి బంధువులు, స్నేహితులు సాదరంగా స్వాగతం పలికి అక్కున చేర్చుకుంటున్నారు. వలస కాలంలో ఎన్ని కోల్పోయామో గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  • ఆగస్టు 29, 2023న వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో జరిగిన గొడవ కారణంగా తెదేపాకు చెందిన 37 కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి. వారు మార్చి 29న తిరిగి గ్రామానికి వచ్చారు.
  • మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వైకాపా నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకుని తెదేపా వారిపై దాడులు చేశారు. పోలీసులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాయడంతో గ్రామం నుంచి ముస్లిం మైనారిటీలు, బీసీలు వంద కుటుంబాల వారు వెళ్లిపోయారు. 60 కుటుంబాల వారు మార్చి 31న తిరిగివచ్చారు.
  • వెల్దుర్తి మండలం గుండ్లపాడులో 2022 జనవరిలో తెదేపా కార్యకర్త తోట చంద్రయ్యను వైకాపా నేతలు గొంతు కోసి హత్యచేశారు. తెదేపావారిపైనే ఎదురు కేసులు పెట్టడం, వైకాపా వారు వేధించడంతో 20 కుటుంబాల వారు గ్రామం విడిచి వెళ్లిపోయారు. శాంతిభద్రతల పేరుతో పోలీసులు వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటూ వచ్చారు. వారిలో 16 కుటుంబాలు సోమవారం గ్రామానికి చేరుకున్నాయి.

ప్రవాసంలోనే వందల కుటుంబాలు

పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో 60 కుటుంబాలు, ఆత్మకూరులో 70 కుటుంబాలు వైకాపా వారి దాడితో గ్రామాలు వదిలి వలస వెళ్లాయి. మాచర్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో కుటుంబాలు తరలిపోయాయి. గ్రామంలో బంధువులు ఎవరైనా చనిపోయినా రావడానికి కూడా పోలీసులు అనుమతించలేదు. శుభకార్యాలకు వచ్చినా పోలీసులు వారిని గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుని స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచే వెనక్కి పంపేసేవారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం వలస వెళ్లిన వారిని గ్రామానికి రప్పించేలా చూడాలి. వారంతా ఓటుహక్కు వినియోగించుకునేలా ఈసీ రక్షణ కల్పించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని