ప్రభుత్వ ఉద్యోగులా?.. వైకాపా నాయకులా?

‘ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాం’ ఇది వైకాపా నాయకులో.. మంత్రులో.. ప్రజాప్రతినిధులో చేసిన ప్రకటన కాదు.

Updated : 02 Apr 2024 09:00 IST

కోడ్‌ ఉన్నా వైకాపాకు మద్దతుగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశాలు
ఇదే బాటలో మరికొందరు ‘ఉద్యోగ’ నేతలు
ప్రతిపక్షాలపై సలహాదారు చంద్రశేఖరరెడ్డి విమర్శలు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం

ఈనాడు, అమరావతి: ‘ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ‘మన ప్రభుత్వం- మన ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాం’ ఇది వైకాపా నాయకులో.. మంత్రులో.. ప్రజాప్రతినిధులో చేసిన ప్రకటన కాదు. ప్రజా ధనాన్ని జీతంగా తీసుకుంటూ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆన్‌డ్యూటీ సదుపాయం పొందుతున్న వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్‌కు ముందు చేసిన ప్రచారం. ఎన్నికల కోడ్‌ వచ్చినా ఆయన ప్రచారాన్ని ఆపలేదు. బరితెగించి బహిరంగంగా ప్రచారం చేస్తున్నా ఎన్నికల కమిషన్‌ మౌనం వహిస్తోంది. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఆదివారం బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులతో ఆ సంఘ నాయకుడు చంద్రయ్యతో కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. ఉద్యోగ సంఘం నాయకులు రాజకీయాల్లో పోటీ చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రయత్నించవచ్చు. కానీ, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపకులపతులు, ప్రొఫెసర్లు ప్రజల పన్నుల డబ్బును జీతాలుగా తీసుకుంటూ వైకాపాకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ ఎన్జీవోను ముందుపెట్టి..

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శివారెడ్డి, పురుషోత్తంనాయుడు కొత్తగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక గత ఫిబ్రవరిలో జరిగింది. నెల రోజులు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్‌ సమయంలో సన్మాన కార్యక్రమాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి హాజరు కావాలని వ్యూహం రచించారు. అయితే, మాజీ అధ్యక్షులను ఆహ్వానిస్తే అందరినీ పిలవాలనే డిమాండ్‌ రావడంతో ఆయన కొంత తగ్గారు. ఉద్యోగులతో సమావేశమైనప్పుడు ఏం మాట్లాడాలనే స్క్రిప్టు మాత్రం ఆయన నుంచే ఏపీ ఎన్జీవో నేతలకు వస్తున్నట్లు విమర్శలున్నాయి. ఉద్యమాలతో ఎన్నో సాధించామని, జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులను ప్రభుత్వం చెల్లించిందంటూ నాయకులు సన్మాన కార్యక్రమాల్లో చెబుతూ వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప సమావేశాలు పూర్తికాగా.. మంగళవారం గుంటూరు, విజయవాడ సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తున్నారు. రాత్రికి విందు ఉందంటూ ఇప్పటికే సమాచారాన్ని ఉద్యోగులకు పంపారు. వైకాపా అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ తతంగం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఈ సన్మానాలపై కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు.  ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి పురుషోత్తంనాయుడి కుమారుడు శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకుడిగా కొనసాగుతున్నారు.

సలహాదారా? వైకాపా నాయకుడా?

ఎన్నికల సంఘం కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలోని సచివాలయం నాలుగో బ్లాక్‌లో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి మార్చి 26న విలేకర్ల సమావేశం పెట్టి రాజకీయ విమర్శలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లపై విమర్శలు చేశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేయిస్తే ఆ నెపాన్ని తెదేపాపైకి నెట్టేలా ఆదివారంనాడు కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వైకాపా అధికార ప్రతినిధిలా ప్రకటన విడుదల చేశారు.పెన్షన్‌తోపాటు..సలహాదారుగా జీతభత్యాలు తీసుకుంటూ వైకాపా నాయకుడిగా ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు.

ఆర్థిక లబ్ధి కోసమేనా?

హైదరాబాద్‌లోని ఏపీ ఎన్జీవో హోంను గతంలో విక్రయించారు. ఈ అమ్మకంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో వైకాపాలో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న సలహాదారు మద్దతుతో చంద్రశేఖరరెడ్డి భారీగా లబ్ధి పొందినట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఈయన హైదరాబాద్‌లో రూ.4.50 కోట్లతో ఇల్లు కొనడం, రూ.90లక్షలతో ఖరీదైన ఆడి కారు కొనడంపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘సకల శాఖల మంత్రి’ ద్వారా ఇన్ని ప్రయోజనాలు పొందినందుకు చంద్రశేఖరరెడ్డి వైకాపాకు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి ఏపీలో ఏపీ ఎన్జీవో సంఘం గచ్చిబౌలి హౌసింగ్‌ సొసైటీలో జరిగిన అక్రమాల్లోనూ చంద్రశేఖరరెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో ఈయనపై కేసు నమోదైంది. ఈ కేసును తిరగ తోడకుండా ఉండేందుకు వైకాపా సహాయం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఎన్నికల కోడ్‌ రాక ముందూ అదే తీరు..

మార్చి 7న చిత్తూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. గత పాలకులు ఎవరూ చేయనంత మేలు జగన్‌ చేశారని, ఆయనకే ఉద్యోగులు మద్దతు పలకాలంటూ ఈ సమావేశంలో ఆయన జగన్‌ భజన చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలోనూ వైకాపాకు మద్దతు తెలపాలంటూ ప్రకటన చేశారు. గత నెల 8న అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులారా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచండి!’ అంటూ ఏకంగా కరపత్రాలను విడుదల చేశారు. గత నెల 10న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ర్యాలీ, అనంతరం ఆయన ఉద్యోగులను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారు.

  • జేఎన్‌టీయూ-కాకినాడలో జనవరి 30న వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘జగనన్న కాలేజీ క్యాప్టెన్స్‌’ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఇక్కడి వీసీ ప్రసాదరాజు సెనేట్‌ హాల్‌ను ఇచ్చారు. సీఎం చిత్రంతో ఉన్న టీషర్టులను విద్యార్థులకు పంచి, వారితో జగన్‌కు జై కొట్టించారు. వైకాపా ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు కరపత్రాలు పంచిపెట్టారు. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వైకాపా నాయకుల చిత్రాలు ఉన్నాయి. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
  • జేఎన్‌టీయూ, కాకినాడలో ఫిబ్రవరి 9న వైకాపా అనుకూల ప్రచార సభ నిర్వహించారు. వక్తలు వైకాపా భజన చేశారు. ఈ సమావేశానికి మందిరం అందించడంతోపాటు వీసీ ప్రసాదరాజు వక్తగా పాల్గొన్నారు.
  • విశాఖపట్నంలో ఫిబ్రవరి 5న ‘ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ’ పేరుతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆంధ్ర వర్సిటీ ఆచార్య షారోన్‌రాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలు కొందరు కళ్లుండీ చూడలేని ధృతరాష్ట్రులు.. చదువంటే గౌరవం లేని వ్యక్తులకు కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఆంధ్ర వర్సిటీ నుంచి 50మంది విద్యార్థులను తరలించారు.

ఏపీ సివిల్‌ సర్వీసుల ప్రవర్తన నియమావళి ఏం చెబుతోంది?

  • పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, ఏదైనా స్థానిక అథారిటీ లేదా సంస్థకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రచారం చేయరాదు. తన పలుకుబడిని ఉపయోగించరాదు
  • ఏ ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ ఉద్యమం, కార్యకలాపాలలో పాల్గొనకూడదు. సహాయం చేయకూడదు

బరి తెగిస్తున్నారు..

  • రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సివిల్‌ సర్వీసుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి యథేచ్చగా వైకాపా తరఫున ప్రచారం చేస్తున్నారు. సంఘం నాయకుడిగా ఆన్‌డ్యూటీ సదుపాయం వాడుకుంటూ.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ వైకాపాకు ఓటు వేయాలని, జగన్‌ను మరోసారి గెలిపించాలని బరితెగించి ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ఆదివారం ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.
  • ఎన్నికల కోడ్‌ సమయంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు సన్మానం పేరుతో ప్రత్యేకంగా ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తెరవెనుక ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఇటీవల విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్జీవో హోంలో మంగళవారం విజయవాడ, గుంటూరు జిల్లాల సీఆర్‌డీఏ పరిధిలోని ఉద్యోగులతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
  • ప్రభుత్వ సలహాదారుగా పని చేస్తున్న చంద్రశేఖరరెడ్డి పదవీవిరమణ చేసిన ఉద్యోగి. ఈయన ప్రజల సొమ్ము నుంచి పెన్షన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారుగా జీతభత్యాలు తీసుకుంటున్నారు. సివిల్‌ సర్వీసుల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి వైకాపా అధికార ప్రతినిధిలా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని