వాలంటీర్లూ... వైకాపా బాధితులే!

ఇంతకాలం ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే వైకాపా ప్రభుత్వ బాధితులు.. ఇప్పుడు వాలంటీర్లూ ఆ జాబితాలోకి చేరారు. అయిదేళ్లుగా వైకాపా సేవలో తరిస్తూ.. వారు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన వారందరినీ.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రచారœంలోకి దిగాలని వైకాపా ఒత్తిడి చేస్తోంది.

Updated : 02 Apr 2024 06:03 IST

ఇక ప్రభుత్వంలో పనిలేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం
ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు.. బెదిరింపులు
బయటపడుతున్న వైకాపా అసలు రంగు
2.56లక్షల మందిలో రాజీనామా చేసింది 6వేల లోపే

ఈనాడు, అమరావతి: ఇంతకాలం ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే వైకాపా ప్రభుత్వ బాధితులు.. ఇప్పుడు వాలంటీర్లూ ఆ జాబితాలోకి చేరారు. అయిదేళ్లుగా వైకాపా సేవలో తరిస్తూ.. వారు చెప్పిన పనులు చేస్తూ వచ్చిన వారందరినీ.. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రచారంలోకి దిగాలని వైకాపా ఒత్తిడి చేస్తోంది. వైకాపాకు వీర విధేయులైన కొందరు వాలంటీర్లు వెంటనే రాజీనామా చేస్తున్నా.. అధికశాతం మంది తాము అందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తాము ఎందుకు రాజీనామా చేయాలని నిలదీస్తున్నారు. దీంతో అధికారులతో చెప్పి వారిని తొలగిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల బెదిరింపులకూ దిగుతున్నారు. దీంతో ఇప్పుడు వాలంటీర్లు కూడా వైకాపా బాధితులుగా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.56లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 6వేల మంది రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు.

అంటే అధికశాతం వాలంటీర్లు రాజీనామాలకు వెనకాడుతున్నారు. వారిని కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్లాలని వైకాపా నేతల వ్యూహంగా ఉంది. వాలంటీర్ల పరిధిలోకి వచ్చే 50 ఇళ్లలో వారి ద్వారానే విష ప్రచారం చేయించి ఎన్నికల్లో గెలవాలని వైకాపా యోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటి వరకు వారికి వస్తున్న జీతానికి అదనంగా మరికొంత సొమ్ము చెల్లించడంతోపాటు.. అధికారంలోకి వస్తే మళ్లీ వాలంటీరు ఉద్యోగం ఇస్తామని చెప్పి వైకాపా అభ్యర్థులు ప్రలోభపెడుతున్నారు. చాలాచోట్ల వైకాపా అభ్యర్థులు బహిరంగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నా ఎన్నికల సంఘం చోద్యం చూడ్డానికే పరిమితమవుతోంది.

ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు.. పార్టీకి సేవలు

వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కోసం నియమించినా.. అనధికారికంగా ఇప్పటిదాకా వారితో వైకాపా ప్రచారమే చేయించారు. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం చెల్లిస్తూ.. పార్టీ  సేవకులుగా తయారు చేసుకున్నారు. వారికి పెద్ద పనేముంటుంది? వారంలో రెండు మూడు గంటలు పనిచేస్తే సరిపోతుందని చెబుతూనే.. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ పనులకు వినియోగించుకున్నారు. ఒక దశలో మీరిచ్చే రూ.5వేల జీతానికి ఈ పనులన్నీ చేయలేమంటూ కొందరు రాజీనామాలు చేయడంతోపాటు తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చిందంటే.. వారితో ఏ స్థాయిలో పని చేయించుకున్నారో అర్థమవుతోంది. ఆ తర్వాతా ఎంతమాత్రం తగ్గలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సర్వేలు చేయించారు. కులాల వారీగా ఓటర్ల వివరాలు సేకరించారు. పింఛను పంపిణీ ద్వారా.. మరింత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలనే వైకాపా కుట్రకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడంతో.. ఆ పార్టీ అసలు రంగు బయటపడింది. ఇక ప్రభుత్వంలో ఉండి చేసేదేంలేదంటూ.. వారందరితో రాజీనామాలు చేయించే వ్యూహాన్ని వైకాపా అమల్లోకి తెచ్చింది.

రాజీనామా చేయాలంటూ ఎంఎల్‌ఓల నుంచి ఆదేశాలు

వాలంటీర్లంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పనిచేస్తున్నారని ప్రభుత్వం ఇప్పటి వరకు సుద్దులు చెప్పింది. అయితే వారికి పనిని నిర్దేశించేదంతా ఐప్యాక్‌ బృందాలే. వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎప్పటికప్పుడు సందేశాలు ఇచ్చి.. సత్వరమే అమలయ్యేలా వైకాపా ఏర్పాటు చేసుకుంది. అంటే వీరు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు చెప్పే పనికంటే.. ఐప్యాక్‌ బృందం చెప్పే పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అంతా తెలిసినా అధికారులూ ఇన్నాళ్లూ కిమ్మనకుండా మౌనం వహించారు. ఇప్పుడు కూడా వాలంటీర్లంతా వెంటనే రాజీనామా చేయాలంటూ.. ఐప్యాక్‌ బృందంలోని ఎంఎల్‌ఓ(మండల లెవల్‌ ఆఫీసర్‌)ల ద్వారా వాలంటీర్ల మొబైల్‌ ఫోన్లకు ఆడియో సందేశాలు ఇప్పిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజుల కిందట దీనికి సంబంధించిన ఆడియో ఒకటి బయటకొచ్చింది. దీనిపై ఎన్నికల అధికారులు విచారణకు ఆదేశించారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంఎల్‌ఓలే.. రాజీనామాలకు ఒత్తిడి తేవడంతోపాటు, ఎక్కడెక్కడ ఎంతమంది రాజీనామాలు చేస్తున్నారు? ఎవరు మొండికేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం 682 మందితో మూకుమ్మడి రాజీనామాలు ఇప్పించారు. అందరూ ఒకే ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారు. అంటే వైకాపా నిర్దేశించిన విధంగానే రాజీనామాలు చేయిస్తున్నారని స్పష్టమవుతోంది. అత్యధికంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 1,500 మంది, తాడిపత్రిలో 300మంది, ప్రొద్దుటూరులో 67, అనకాపల్లి జిల్లా పరవాడమండలంలో 23, విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో 13, కర్నూలు జిల్లాలో 97మంది వాలంటీర్లతో రాజీనామాలు చేయించారు. జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నామని వారితోనే చెప్పిస్తున్నారు.

రాజీనామాలపై విచారణ చేపట్టాలి: కొల్లు

మచిలీపట్నం, న్యూస్‌టుడే: వాలంటీర్ల వ్యవస్థ నిజస్వరూపం వారి మూకుమ్మడి రాజీనామాల ద్వారా బహిర్గతమైందని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. బలవంతపు మూకుమ్మడి రాజీనామాలపై ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


సెల్‌ఫోన్ల ద్వారా సందేశాలు.. ప్రతిపక్షాలపై విషప్రచారం

వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం, జనసేన, భాజపాతోపాటు ఎన్నికల సంఘంపైనా వైకాపా ఇప్పటికే విషం చిమ్మే ప్రక్రియ ప్రారంభించింది. పలుచోట్ల పింఛనుదారుల సెల్‌ఫోన్లకు సందేశాలు పంపించే ప్రక్రియ మొదలు పెట్టింది. ‘ఆంటీ, అంకుల్‌.. నమస్కారం.. నేను మీ వాలంటీర్‌.. గత నాలుగేళ్లుగా ప్రతి నెలా మొదటి రోజు ఉదయం 6 గంటలకు మీ ఇంటి ఖర్చుల కోసం.. మీ పెద్ద కొడుకు.. మా జగనన్న ప్రేమతో పంపిన పింఛను డబ్బుల్ని మీకు అందించి మీ యోగక్షేమాలు చూసుకున్నాం. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, భాజపా కుట్రలతో ఎన్నికలయ్యే వరకు మీకు సేవ చేసుకోలేకపోతున్నాం. మండుటెండల్లో మిమ్మల్ని పింఛను డబ్బు కోసం నిలబెట్టాల్సి వస్తున్నందుకు బాధగా ఉంది. వారి కుట్రలను తిప్పికొట్టి మీరు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తారు. అప్పుడు మళ్లీ మీ సేవ చేసుకుంటాం’ అని రెండు రోజులుగా పలుచోట్ల పింఛనుదారులకు సందేశాలు పంపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని