కేసు ఉపసంహరించుకోవాలని మంత్రి రజిని భర్త బెదిరించారు

కిడ్నాప్‌ చేసిన వారిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజిని భర్త బెదిరించారని దళిత యువకుడు నరసింహారావు సోమవారం ఎస్పీ తుషార్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 02 Apr 2024 07:44 IST

కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి, కొట్టారు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన దళిత యువకుడు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కిడ్నాప్‌ చేసిన వారిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజిని భర్త బెదిరించారని దళిత యువకుడు నరసింహారావు సోమవారం ఎస్పీ తుషార్‌కు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ చేసిన వారిపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని వేడుకున్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. అనంతరం నరసింహరావు విలేకర్లతో మాట్లాడారు. ‘నేను, లాలాపేటకు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం తెలిసిన ఆమె సోదరుడు తరుణ్‌ మార్చి 30వ తేదీ రాత్రి నాకు ఫోన్‌ చేసి మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడు. నల్లపాడులోని ఓ హోటల్‌ వద్దకు వెళ్లగానే అయిదుగురు నన్ను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్‌ చేశారు. దీనిపై నా తల్లిదండ్రులు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో వచ్చిన అయిదుగురు నన్ను నల్లపాడురోడ్డులోని ఓ బార్‌ వెనక్కి తీసుకు వెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారు. ఆ తర్వాత కారులో కొట్టుకుంటూ మంగళగిరి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ ఓ ఖాళీస్థలంలో తీసుకెళ్లి నన్ను చంపేస్తామని బెదిరించారు. ఆ సమయంలో మంత్రి విడదల రజిని భర్తకు ఫోన్‌ చేసి మాట్లాడించారు. ఆయన నాతో మాట్లాడుతూ తరుణ్‌ వాళ్లు రూ.2 లక్షలు ఇస్తారు.. కేసు వెనక్కి తీసుకో.. లేకపోతే మీ కుటుంబసభ్యులను చంపేస్తారని బెదిరించారు. ఆ తర్వాత నన్ను గుంటూరు తీసుకువచ్చి విడిచిపెట్టారు’ అని తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కరీమ్‌ మాట్లాడుతూ నరసింహారావును కిడ్నాప్‌ చేసి చంపుతామని బెదిరించిన వారిని 36 గంటలు గడుస్తున్నా పోలీసులు అరెస్టు చేయలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని