మీరిచ్చిన హామీలు మరిచారా సారూ..?

శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్రను సోమవారం గోపాలమిత్రలు అడ్డుకొని నిరసన తెలిపారు. గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్‌ను నిలదీశారు.

Published : 02 Apr 2024 03:31 IST

సీఎం బస్సుయాత్రను అడ్డుకున్న గోపాలమిత్రలు
సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

తాడిమర్రి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్రను సోమవారం గోపాలమిత్రలు అడ్డుకొని నిరసన తెలిపారు. గతంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్‌ను నిలదీశారు. బత్తలపల్లి వద్ద గోపాలమిత్రల సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో సీఎం బస్సును నిలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని కోరినా పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో గోపాలమిత్రలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సీఎం బస్సుకు వారంతా అడ్డుగా వెళ్లారు. గమనించిన సీఎం వారిని తన వద్దకు పిలిచారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, విలేకరులు చూస్తున్నారని చెప్పి సంఘం నాయకులు వెంకటేశ్‌, ఓబులేశును మాత్రమే బస్సు లోపలికి పిలిచారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌కు గుర్తు చేసినట్లు వెంకటేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2,500 గోపాలమిత్రలు ఉన్నారని, అయిదేళ్లుగా వారికి అన్యాయం జరిగిందని సీఎం వద్ద వాపోయినట్లు చెప్పారు. సమస్యపై వినతిపత్రం స్వీకరించిన అనంతరం జగన్‌ రామాపురం బస్టాప్‌ వద్ద తమను దింపేసి వెళ్లినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని