దళితుడ్ని చంపిన నువ్వు.. అంబేడ్కర్‌కు దండేస్తావా?

‘దళిత డ్రైవర్ని చంపి.. డోర్‌ డెలివరీ చేసి.. ఇప్పుడు ఓట్ల కోసం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా..? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దు’ అంటూ దళితులు ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Published : 02 Apr 2024 03:35 IST

ఎమ్మెల్సీ అనంతబాబును చుట్టుముట్టి నిలదీస్తూ.. తరిమేసిన దళితులు
వైకాపా అభ్యర్థులు వరుపుల సుబ్బారావు, చలమలశెట్టి సునీల్‌కు చేదు అనుభవం
ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రచారంలో భంగపాటు..
విగ్రహం అపవిత్రం అయ్యిందంటూ క్షీరాభిషేకం చేసిన స్థానికులు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ‘దళిత డ్రైవర్ని చంపి.. డోర్‌ డెలివరీ చేసి.. ఇప్పుడు ఓట్ల కోసం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి వస్తావా..? మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దు’ అంటూ దళితులు ఎమ్మెల్సీ అనంతబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు ప్రచారానికి వచ్చిన కాకినాడ జిల్లా వైకాపా ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను సైతం చుట్టుముట్టారు. వాహనాన్ని చుట్టుముట్టి దళితులు హెచ్చరించడంతో చేసేది లేక ముగ్గురూ వాహనంలో వెళిపోయారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైకాపా అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు గత కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం లోక్‌సభ అభ్యర్థి సునీల్‌ కూడా పాల్గొన్నారు. ధర్మవరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైకాపాలోని ఓ వర్గంతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి.. అదే ప్రాంగణం నుంచి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇది వివాదస్పదమైంది.

వెంటాడి.. వెంబడించి... తరిమేశారు...

సోమవారం సాయంత్రం అనంతబాబు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన విషయం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. దళిత యువకులు, స్థానికులు ఒకచోట చేరి నిలదీద్దామనుకునే సరికి అనంతబాబు ప్రసంగాన్ని ముగించుకుని పక్క వీధిలోకి వెళ్లారు. దళితులంతా నినాదాలు చేసుకుంటూ అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరారు. ఈలోగా ప్రచారం ముగించుకుని వాహనం వద్దకు అనంతబాబు, సుబ్బారావు, సునీల్‌ చేరడంతో వారిని నిలదీశారు. దళితుడ్ని చంపిన నువ్వు అంబేడ్కర్‌కు దండేయడానికి సిగ్గులేదా అంటూ నిలదీశారు. ఇక్కడినుంచి వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని స్థానికులు హెచ్చరించారు. దీంతో ఎదురుతిరిగిన అనంతబాబు మీరేం చెయ్యలేరంటూ గద్దించడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు... వాహనాన్ని చుట్టుముట్టడానికి సిద్ధమవడంతో అనంతబాబుతోపాటు మిగిలిన ఇద్దరు వైకాపా నాయకులు చేసేదిలేక వాహనం ఎక్కి ఉడాయించారు. దీంతో అనంతబాబుకు, వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంబేడ్కర్‌కు క్షీరాభిషేకం

అనంతబాబు దండవేయడంతో అంబేడ్కర్‌ విగ్రహం అపవిత్రం అయ్యిందంటూ స్థానికులు అంబేడ్కర్‌ విగ్రహానికి సోమవారం రాత్రి క్షీరాభిషేకం చేశారు. అనంతబాబు వేసిన దండను తెంపేసి.. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవిష్యత్తులో దళిత వాడల్లో అడుగుపెడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో వైకాపాలో రెండు వర్గాలు ఉన్నాయి. తొలుత ఒక వర్గంతో కలిసి వెళ్లి అనంతబాబు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం ప్రచారంలోకి వెళ్లారు. తిరిగి వస్తూ రెండో వర్గంతో అదే విగ్రహానికి దండవేయడానికి సిద్ధమవుతుండగా స్థానికుల నుంచి ఈ ప్రతిఘటన ఎదురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని