టమాట రైతుల వ్యథ తీరలేదు.. నేతన్నల జీవితాలు బాగు పడలేదు

‘‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. కరవు ప్రాంతమైన మదనపల్లెకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తాం. వేసవి జలాశయాలు పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం.’’

Updated : 02 Apr 2024 06:08 IST

అన్నమయ్య జిల్లాలో జగన్‌ హామీలన్నీ నీటిమూటలే
మరోసారి మోసగించేందుకు నేడు మదనపల్లెకు రాక
ఈనాడు-కడప, న్యూస్‌టుడే- మదనపల్లె పట్టణం, రాజంపేట గ్రామీణ


‘‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. కరవు ప్రాంతమైన మదనపల్లెకు కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేస్తాం. వేసవి జలాశయాలు పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం.’’

...2018లో మదనపల్లె పట్టణంలో పర్యటిస్తూ జగన్‌ ఇచ్చిన హామీలివి.


ప్రస్తుత పరిస్థితి చూస్తే గత అయిదేళ్లలో ఏవీ పూర్తి కాలేదు. ప్రతిపక్ష నేతగా అనేక హామీలిచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మాటే మర్చిపోయారు. తెదేపా హయాంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి కాల్వ పనులు 85%  పూర్తి చేసినా.. మిగిలిన కొద్దిపాటి పనులనూ జగన్‌ పూర్తి చేయలేకపోయారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అనుసంధానంలో భాగంగా పుంగనూరు బ్రాంచ్‌ కాల్వకు సమాంతరంగా మరొకటి తవ్వించి.. వైయస్‌ఆర్‌ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి నీటిని తీసుకొస్తానని నమ్మించి, నట్టేటా ముంచేశారు. రూ.4,373 కోట్లతో టెండర్లు పిలిచి పనుల్ని తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీకి కట్టబెట్టారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో కాలేటివాగు, అన్నమయ్యలో ముదివేడు, చిత్తూరులో ఆవులపల్లి, నేతిగుట్లపల్లెలో జలాశయాల నిర్మాణం చేపట్టి, అనుమతి లేని కారణంగా ఎన్‌జీటీ అభ్యంతరం తెలపడంతో పనులు నిలిపివేశారు. ఎన్‌జీటీ భారీ జరిమానా విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. కాలేటివాడు రిజర్వాయర్‌ పైపులైను టన్నెల్‌ తవ్వకం 5 కి.మీ మేర చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటికీ కేవలం కిలోమీటరు వరకు పూర్తి చేశారు. అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. అటు టన్నెల్‌.. ఇటు మూడు రిజర్వాయర్ల పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు పడకేసింది. తాజాగా మళ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి ప్రజల్ని మోసగించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

నేతన్నల జీవితాలను చిదిమేసిన జగన్‌

గత ఎన్నికల ముందు మదనపల్లెకు వచ్చిన జగన్‌.. చేనేత రంగం అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. నీరుగట్టువారిపల్లెలో మెగా క్లస్టర్‌ ఏర్పాటుతో పాటు ఇక్కడ తయారు చేసిన పట్టు చీరలకు బ్రాండ్‌ ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామన్నారు. వర్క్‌షెడ్ల మంజూరు, చేనేత భవన్‌ నిర్మాణం, బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాల అందజేత వంటి ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. వైకాపా అధికారంలోకి రాకముందు నీరుగట్టువారిపల్లెలో 15 వేలకు పైగా ఉన్న చేనేత మగ్గాలు నేడు 5 వేలకు తగ్గిపోయాయి. ఉపాధి లేక కొందరు నేతన్నలు దినసరి కూలీలుగా మారిపోయారు. కుటుంబ పోషణ భారమై మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద ఇస్తున్న రూ.24 వేలు ఎటూ సరిపోవడం లేదు.


మదనపల్లె.. తాగునీటికి తల్లడిల్లె

మదనపల్లె పట్టణంలోని 1.80 లక్షల మంది జనాభాకు రోజుకు 15 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా మూడోవంతు కూడా సరఫరా చేయడం లేదు. పట్టణంలోని 260 బోరుబావుల్లో సగానికి పైగా వాటిల్లో నీరు రావడం లేదు. తెదేపా పాలనలో అమృత్‌ పథకం కింద తాగునీటి సరఫరా కోసం రూ.49 కోట్లు వెచ్చించి ఈఎల్‌ఎస్‌ఆర్‌, జీఎల్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు నిర్మించి, భూగర్భంలో పైపులైన్లు ఏర్పాటు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ ఆపేసి.. ఈ పథకాన్ని నీరుగార్చేసింది.


టమాట గుజ్జు పరిశ్రమలేవి?

‘టమాట రైతులను ఆదుకోవడానికి రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే దిగుబడులు కొనుగోలు చేస్తుంది. టమాట గుజ్జు పరిశ్రమలతో పాటు విత్తన పరిశోధన కేంద్రం నెలకొల్పుతాం’ అని ఎన్నికల ప్రచారంలో జగన్‌ గొప్పలు చెప్పారు. గత అయిదేళ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఇక్కడి రైతులు టమాట పంట సాగు చేస్తున్నారు. వైకాపా హయాంలో గిట్టుబాటు ధర లేక నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.


వరద బాధితుల గోడు పట్టని జగన్‌

‘గూడు కోల్పోయిన బాధితులకు మూడు నెలల్లో ఇళ్లు కట్టి తాళాలిస్తాం. పంట పొలాలు ముంపునకు గురికాకుండా రక్షణ గోడ నిర్మిస్తాం. పొలాల్లో ఇసుక మేటలు తొలగిస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతాం’ అని 2021 డిసెంబరు 3న అన్నమయ్య జలాశయం కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో వీధిన పడిన బాధితులను పరామర్శిస్తూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీలీవి. ఆ తరువాత వారి గోడు అరణ్యరోదనగానే మిగిలిపోయింది. బాధితుల కోసం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరు, మందపల్లి, తొగురుపేట, రామచంద్రాపురం గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో అత్యధికం పునాదుల దశలోనే ఉన్నాయి. 488 ఇళ్ల నిర్మాణం తలపెట్టగా కేవలం 28 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు.

రెండున్నరేళ్లుగా బాధితులు గుడారాల్లో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. పొలాల రక్షణకు చేపట్టిన గోడ నిర్మాణంలో ఆదిలోనే నాణ్యత లోపాలు బయటపడ్డాయి. పొలాల్లో ఇసుక మేటలు చాలా వరకు రైతులే తొలగించుకున్నారు. ఏడాదిలోపే ప్రాజెక్టు కట్టితీరుతామని ప్రగల్భాలు పలికిన జగన్‌కు ఆ గోడే పట్టకుండా పోయింది. ప్రజల్ని నమ్మించేందుకు రూ.787.19 కోట్ల అంచనాతో టెండరు పిలిచి.. హడావుడి చేసి వదిలేశారు. చిల్లర వేస్తున్నట్లుగా కేవలం రూ.22.19 లక్షల కేటాయింపులతో సరిపెట్టారు. ఈ మొత్తం అంచనాల తయారీకే సరిపోదని అధికారులు వాపోతున్నారు. సీఎం నిర్లక్ష్య వైఖరితో ఇప్పుడు సాగునీరు అందక పంట పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని