ఏపీపీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోండి

ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు దాఖలయ్యాయి.

Published : 02 Apr 2024 03:41 IST

పలు పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదులు

పెదవాల్తేరు, కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, గుంటూరు నేరవార్తలు - న్యూస్‌టుడే: ఏపీపీఎస్సీ అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో సోమవారం ఫిర్యాదులు దాఖలయ్యాయి. 2018 గ్రూప్‌-1 పరీక్షల్లో రూ.250 కోట్ల మేర కుంభకోణం జరిగిందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ విశాఖ మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతంసవాంగ్‌, కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ప్రణవ్‌గోపాల్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుంటూరులో జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలుగు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణలు పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్‌ దూడిని కలిసి ఫిర్యాదు అందజేశారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ పరీక్షల డిజిటల్‌ మూల్యాంకనంలో ఓఎంఆర్‌ షీట్లు మార్చివేసి వైకాపా ప్రభుత్వం 169 పోస్టులు అమ్ముకుందని సాయికృష్ణ ఆరోపించారు. సీఎం, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ తదితరులు అవినీతికి పాల్పడ్డారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ జనరల్‌ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్‌ ఆరోపించారు. డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును రూ.2.50 కోట్లకు, డీఎస్పీ పోస్టును రూ.1.50 కోట్లకు అమ్ముకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు