సంక్షిప్త వార్తలు(8)

ఎండలు ముదరడంతో భాగ్యనగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు.  వాహనాలతో కిక్కిరిసిపోయే హైదరాబాద్‌లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

Published : 02 Apr 2024 05:15 IST

‘మండే’ ఎండలు

ఎండలు ముదరడంతో భాగ్యనగర ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు.  వాహనాలతో కిక్కిరిసిపోయే హైదరాబాద్‌లో దారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రోడ్లన్నీ ఇలా బోసిపోయి కనిపించాయి.

ఈనాడు, హైదరాబాద్‌


ఈసీ ఆదేశాలను సాకుగా చూపి పెన్షనర్ల ఉసురుపోసుకోవద్దు: బాలకోటయ్య

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను సాకుగా చూపి లక్షలాది మంది పెన్షనర్ల ఉసురుపోసుకోవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాలంటీర్ల తొలగింపుతో పెన్షన్‌దారుల్లో నెలకొన్న ఆందోళనను అధికారులు తొలగించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. ‘వాలంటీర్లు లేకపోయినా సచివాలయ, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా పింఛన్లు ఇవ్వొచ్చు. రాష్ట్రంలోని సచివాలయాల్లో 1.35లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి 50 మందికి అందించినా రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చు. తీవ్ర ఎండల నేపథ్యంలో వృద్ధులు కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిలబడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ అందించాలి’ అని డిమాండు చేశారు.


పింఛన్లపై ప్రభుత్వ వైఖరి సరికాదు

సీఎస్‌, ఈసీలకు లేఖ రాసిన పెన్షనర్ల సంక్షేమ సంఘం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం ఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరిస్తుందని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్‌ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సోమవారం లేఖ రాశారు. ఇది ప్రతిపక్షాలపై నిందలు వేసే ప్రయత్నమేనని లేఖలో మండిపడ్డారు. సీఎస్‌, ఈసీలు తమ విచక్షణాధికారాన్ని వినియోగించి ఇంటివద్దనే పింఛను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


గురుకుల పరీక్ష దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌-2024, ఏపీఆర్‌జేసీ, డీసీ సెట్‌’ పరీక్షల దరఖాస్తు గడువును ఈనెల 5వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌, డిగ్రీ మొదటి సంవత్సరాల్లోని సీట్లతో పాటు 5,6,7,8 తరగతుల్లో మిగిలివున్న ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.


ఏపీ పీజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

విశాఖపట్నం(ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీసెట్‌-2024 నోటిఫికేషన్‌ను.. సెట్‌ ఛైర్మన్‌, ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సోమవారం విడుదల చేశారు. మే 4 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు స్వీకరించి, జూన్‌ 10 నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


కేఏ పాల్‌ వ్యాజ్యంపై ముగిసిన వాదనలు

ఈనాడు, అమరావతి: ప్రజాశాంతి పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ తీర్పును రిజర్వు వేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ సందర్భంగా కేఏ పాల్‌ నేరుగా వాదనలు వినిపించారు. తన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోకుండా ఎన్నికల సంఘం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 10 లోపు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది అనినాష్‌ దేశాయ్‌ కోర్టుకు నివేదించారు.


వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి

విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయించుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్లా ఆసక్తి కలిగేలా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విజయవాడలోని లయోలా కళాశాలలో నిర్వహించిన ‘వ్యాయామ ఉపాధ్యాయులకు మాడ్యుల్‌ రూపకల్పన’ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ‘పీఎంశ్రీ పథకానికి ఎంపికైన పాఠశాలను క్రీడా శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులను గుర్తించి.. వారిని జిల్లా క్రీడా బ్రాండ్‌ అంబాసిడర్లుగా ప్రోత్సహిస్తాం’ అని తెలిపారు.


మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ విశాఖ నగరంలో సోమవారం జరిగిన ఆయన సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. వధూవరులు భానుప్రకాశ్‌, సౌజన్యలను ఆశీర్వదించారు. న్యాయమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని