కేజీబీవీ ప్రవేశాల పేరుతో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం

ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ఉద్యోగులతో వైకాపా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయించేందుకు సమగ్ర శిక్షా అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు.

Updated : 02 Apr 2024 06:07 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ఉద్యోగులతో వైకాపా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయించేందుకు సమగ్ర శిక్షా అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఎన్నికల కోడ్‌ సమయంలో ప్రవేశాల పేరుతో ఉపాధ్యాయినులను విద్యార్థినుల ఇళ్లకు పంపిస్తున్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ల్లో ప్రవేశాలు చేయించాలని ఉపాధ్యాయినులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటించి విద్యార్థులతో దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. ప్రవేశాలకు దరఖాస్తులు తగ్గితే మెమోలు ఇస్తామంటూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. విద్యార్థుల ప్రవేశాల కోసం వెళ్లిన సమయంలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఉపాధ్యాయినులు వివరించాల్సి ఉంటుంది. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలను ఓటర్లకు చెప్పించేందుకు ప్రవేశాలను వాడుకుంటున్నారు. కేజీబీవీల్లో అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒక్కరే ఉన్నవారు, మధ్యలో బడిమానేసిన అమ్మాయిలకు ప్రవేశాలు కల్పించాలి.

ఈ విభాగాల్లో విద్యార్థినులు లభించకపోవడంతో రెగ్యులర్‌గా బడికి వెళ్లే వారిని కేజీబీవీల్లో చేర్చుకుంటున్నారు. ఈ విద్యార్థినుల తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రభుత్వ కార్యక్రమాలు, కేజీబీవీల్లోని సదుపాయాలను వివరిస్తున్నారు. బడి మధ్యలో మానేసిన వారి జాబితాను ఇవ్వకుండా ఉపాధ్యాయినులే మండలాల్లో పర్యటించి, వారిని గుర్తించాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయినులు గ్రామాలన్నీ తిరగాల్సి వస్తోంది. కేజీబీవీల్లో ఆరు, ఇంటర్మీడియట్‌లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు అవకాశం ఉంది. ఒక్కో దాంట్లో 40చొప్పున 80 సీట్లు ఉండగా.. ఒక్కో సీటుకు మూడు చొప్పున దరఖాస్తులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. మరిన్ని గ్రామాలు, కుటుంబాలను ఉపాధ్యాయినులు కలిసేలా ఈ ప్రణాళికను అమలు చేస్తున్నారు.

జూన్‌లో ఇంటర్మీడియట్‌, పాఠశాలల తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఇంకా రెండు నెలలకుపైగా సమయం ఉంది. ఇలాంటప్పుడు ఇప్పుడు హడావుడిగా ఎందుకు ప్రవేశాలు చేస్తున్నారు? పదో తరగతి ఫలితాలు ఇంతవరకు రాలేదు. ఇప్పుడే ప్రవేశాలు రాసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రాథమిక స్థాయిలో బడి మానేస్తున్నవారు లేరని, వందశాతం మంది బడిలోనే ఉంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. అలాంటప్పుడు డ్రాపౌట్‌ విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు? అంటే పథకం ప్రకారమే ప్రభుత్వ కార్యక్రమాలను ఉపాధ్యాయినులతో ప్రచారం చేయించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం జూనియర్‌ లెక్చరర్లను ఇంటింటికి తిరగాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని