అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ ప్రగతి గర్వకారణం

అంతరిక్ష పరిశోధనల్లో ప్రగతి సాధించిన ప్రపంచంలోని తొలి అయిదు దేశాల్లో భారత్‌ ఉండటం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని ఇస్రో పూర్వ సంచాలకుడు డాక్టర్‌ జోశ్యుల అచ్యుత కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 02 Apr 2024 05:18 IST

ఇస్రో పూర్వ సంచాలకుడు డాక్టర్‌ జోశ్యుల అచ్యుత కమలాకర్‌
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాల సదస్సు

ఈనాడు-అమరావతి: అంతరిక్ష పరిశోధనల్లో ప్రగతి సాధించిన ప్రపంచంలోని తొలి అయిదు దేశాల్లో భారత్‌ ఉండటం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని ఇస్రో పూర్వ సంచాలకుడు డాక్టర్‌ జోశ్యుల అచ్యుత కమలాకర్‌ పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం, ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య అంతర్జాల సమావేశంలో కమలాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో సాగించిన ప్రయోగాల్లో అనేక విజయాలు సాధించిందన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశం భారత్‌ అని గుర్తుచేశారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రాచీన భారతీయ విషయాలను ప్రపంచంలోని ఇతర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉందన్నారు. విజ్ఞానశాస్త్ర వ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయడంతో పాటు యువతలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. ఎన్నో వేల సంవత్సరాల కిందటే ఖగోళ, గణిత, విజ్ఞాన, ఆయుర్వేద, వృక్ష, శిల్ప, కాల శాస్త్రాలకు భారతదేశం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. విజ్ఞాన గనిగా విరాజిల్లిన భారత్‌ మూలాలపై ఎంతో పరిశోధన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని