ఉన్నత ‘వ్యయ’ మండలి

ఉన్నత విద్యామండలి ఉన్నత వ్యయమండలిగా మారింది. ఎన్నికలకు ముందు ఉన్నతవిద్యలో సంస్కరణల పేరుతో నచ్చినవారికి నచ్చినట్లు ప్రాజెక్టులు కట్టబెట్టేస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ మంత్రి చెప్పారని విద్యార్థుల శిక్షణ పేరుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు ధారపోసింది.

Published : 02 Apr 2024 05:20 IST

సీఎం జగన్‌ విజయనగరం జిల్లా పర్యటన కోసం రూ.50 లక్షల చెల్లింపు
ఉత్తరాంధ్ర మంత్రి సిఫార్సుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు
లింక్డ్‌ఇన్‌ కోర్సుల పేరుతో రూ.7 కోట్లకు కౌన్సిల్‌ ఆమోదం
వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఛైర్మన్‌గా ఉన్న సంస్థకు రూ.15 లక్షలు
ఉన్నత విద్యామండలిలో ఇష్టారాజ్యంగా వ్యయాలు

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి ఉన్నత వ్యయమండలిగా మారింది. ఎన్నికలకు ముందు ఉన్నతవిద్యలో సంస్కరణల పేరుతో నచ్చినవారికి నచ్చినట్లు ప్రాజెక్టులు కట్టబెట్టేస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ మంత్రి చెప్పారని విద్యార్థుల శిక్షణ పేరుతో ఓ సంస్థకు రూ.50 లక్షలు ధారపోసింది. విచిత్రమేమిటంటే హైదరాబాద్‌లో ఉండే ఈ సంస్థ ఉన్నత విద్యామండలికి సమీపంలోని మిడ్‌వ్యాలీలో ఉంటున్నట్లు బిల్లు సమర్పించింది. విద్యార్థుల శిక్షణకు సైతం ఉన్నత విద్యామండలికి అనుకూలంగా ఉండే కళాశాలలనే ఎంపికచేశారు. దీంతో శిక్షణ జరిగిందా? లేదా అనేదానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వర్సిటీల సమాచారం కోసమని యాప్‌ రూపకల్పన, నిర్వహణకు రూ.99 లక్షలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంత చెల్లించేశారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ సంస్థకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఉన్నత విద్యామండలిలో కీలకంగా ఉండేవారు నామినేటెడ్‌ వ్యక్తులే కావడంతో వైకాపా విషయంలో స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. విజయనగరం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కోసం రూ.50లక్షలు ఉన్నత విద్యామండలి చెల్లించింది. ఆ జిల్లా కలెక్టర్‌ పేరుతో దీన్ని బదిలీ చేసింది. గతంలో దిల్లీలోని ఏపీభవన్‌లో ఉగాది ఉత్సవాలకు రూ.5 లక్షలు చెల్లించింది. ఉన్నత విద్యామండలి నిధుల వ్యయంపై అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై స్వామిభక్తి ప్రదర్శించేందుకు రాష్ట్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో రూ.40.31 కోట్లు డిపాజిట్‌ చేసింది.

ఈ కార్యక్రమాల పరిస్థితి ఏంటి?

విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకు చాట్‌బోట్‌ సర్వీసుకు రూ.45 లక్షలు, లక్ష లింక్డ్‌ఇన్‌ కోర్సుల లైసెన్సుల కోసం రూ.2.5 కోట్ల ప్రాజెక్టుకు గతేడాది నవంబరులో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఆమోదం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు కావడం లేదు. నిధుల వ్యయం కోసం కౌన్సిల్‌లో అనుమతులు తీసుకొని, కార్యక్రమాలు అమలు చేయకుండా ఏం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశానికి ముందు జరిగిన సమావేశంలోనూ రెండు లక్షల లింక్డ్‌ఇన్‌ కోర్సుల లైసెన్సుల కోసం రూ.4.8 కోట్లు అవసరమవుతుందని ప్రతిపాదించారు. ఉన్నతవిద్యలో డిజిటల్‌ ప్రమోషన్‌ కోసమంటూ రూ.22 లక్షలు ఖర్చుపెట్టారు. ఇది ఏం చేశారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలైనా.. కౌన్సిల్‌ సమావేశ ఎజెండా, మినిట్స్‌ను రహస్యంగా ఉంచడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదో విచిత్రం..

రాష్ట్ర పరిశోధన బోర్డును ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. దీంట్లో ఎలాంటి కార్యక్రమాలూ లేవు. కానీ, ఇక్కడ మూర్తి అనే వ్యక్తి కన్సల్టెంట్‌ పని చేస్తున్నట్లు చూపి రూ.50వేల జీతం చెల్లిస్తున్నారు. ఈయన ఎక్కడ పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో వైకాపా మద్దతుగా ప్రచారం చేసిన దినేష్‌కు ఉద్యోగం ఇచ్చిన ఉన్నత విద్యామండలి ఒక్క ఏడాదిలోనే రెండుసార్లు జీతం పెంచింది. గతేడాది జనవరి వరకు బిజినెస్‌ ఎనలిస్ట్‌గా దినేష్‌కు రూ.75వేల జీతం ఉండగా ఆయన హోదాను మార్చి, రూ.లక్షకు పెంచారు. తర్వాత రూ.1.25 లక్షలు చేశారు. మరోశాఖలో ఇంతకంటే ఎక్కువ జీతం ఇవ్వడంతో ఆయన డిసెంబరులో వెళ్లిపోయారు. ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న సుధీర్‌రెడ్డికి ఒక్కసారి జీతాన్ని రూ.25వేలు పెంచారు. ఈయనకు నెలకు రూ.1.50 లక్షల జీతం ఇస్తున్నారు. ఈయన గతంలో ఒక నెల సెలవుపై విదేశాలకు వెళ్లినా పూర్తి జీతం చెల్లించడంపై అనేక ఆరోపణలు వచ్చాయి.

  • వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఛైర్మన్‌గా కొనసాగుతున్న కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డుకు ఉన్నత విద్యామండలి రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చింది. ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చేందుకే దీన్ని ఏర్పాటుచేసినట్లు అప్పట్లో విమర్శలు వచ్చాయి. వాస్తవంగా ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉండగా ఉన్నత విద్యామండలి నుంచి తీసుకున్నారు.
  • కర్నూలులోని ఉర్దూ వర్సిటీకి రూ.50 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఎక్కడైనా వర్సిటీలకు నిధులు అప్పుగా ఇవ్వడం ఉంటుందా? జగన్‌ ప్రభుత్వంలో ఇలాంటివి కోకొల్లలు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు