సంక్షిప్త వార్తలు (8)

పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Updated : 03 Apr 2024 04:51 IST

పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించడంపై పిల్‌
నేడు విచారించనున్న హైకోర్టు

ఈనాడు, అమరావతి: పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మార్చి 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. బుధవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛన్‌దారులు ఈ పిల్‌ దాఖలు చేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్‌ అందించేవారని.. తాజా ఉత్తర్వుల వల్ల వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవడం కష్టంగా మారిందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.


67 మంది వాలంటీర్ల సెల్‌ఫోన్లు పోయాయట..!

కొమ్మాది, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ కొంతమంది వాలంటీర్లు నిబంధనలను అతిక్రమించి వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో పింఛన్ల పంపిణీ కోసం వారికి ప్రభుత్వం అందించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఆ మేరకు విశాఖ నగరంలోని జోన్‌-2 పరిధిలోని 1547 మంది వాలంటీర్ల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియను మంగళవారం చేపట్టారు. అయితే వీరిలో 1480 మంది తమకు ఇచ్చిన సెల్‌ఫోన్లను తిరిగి ఇవ్వగా, 67 మంది తమ ఫోన్లు పోయాయని అధికారులకు చెప్పారు. ఆ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సంబంధిత పత్రం సమర్పించాలని జోనల్‌ కమిషనర్‌ సూచించడంతో సంబంధిత సచివాలయాల అడ్మిన్లు ఫిర్యాదు చేశారు. ఇంతకాలం సెల్‌ఫోన్లు పోయిన విషయం బయటపెట్టకుండా...ఇప్పుడు వెల్లడించడం చర్చనీయాంశమైంది.


వివాదాస్పదంగా డీటీల పదోన్నతుల ప్రక్రియ

ఈనాడు, అమరావతి: రెవెన్యూ శాఖలో ఉప తహసీల్దార్‌(డీటీ)ల పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. ఆ శాఖలో డైరెక్ట్‌ డీటీలకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి, పదోన్నతులు కల్పించేందుకు సీసీఎల్‌ఏ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అడ్‌హాక్‌ పదోన్నతులపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి షరతులు లేకుండా వాటిని ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని సీసీఎల్‌ఏ కోరుతోందన్నారు. దాంతో డైరెక్ట్‌ డీటీలకు అన్యాయం చేయాలని చూస్తోందని, జాయింట్‌ కలెక్టర్లు కావాల్సిన వారు తహసీల్దార్లుగానే పదవీవిరమణ అయ్యేలా చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో నేరుగా పదోన్నతులు ఇవ్వడానికి అవకాశం లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్‌ కమిటీకి కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ సీసీఎల్‌ఏ లేఖ రాసిందని పేర్కొన్నారు.


వివేకం సినిమాపై వివరాలు సమర్పించండి

ఈసీ, సీబీఎఫ్‌సీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: యూట్యూబ్‌, ఓటీటీలలో వివేకం సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం, ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ సెంట్రల్‌ బోర్డు(సీబీఎఫ్‌సీ)లను ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.


ఇంటర్‌ ప్రవేశాల ప్రచారం నిలిపివేత

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రచారం నిర్వహించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌ మెమో జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.


ఎన్నికల విధుల నుంచి దేవాదాయశాఖ అధికారులను మినహాయించాలి

ఈనాడు-అమరావతి: ఎన్నికల విధుల నుంచి దేవాదాయశాఖ అధికారులు, ఉద్యోగులను మినహాయించాలని కోరుతూ ఆ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉత్తరాయణ పుణ్యకాలం కావడం, వరుసగా ఉగాది, శ్రీరామనవమి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు ఉండటంతో.. అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిస్తే కష్టమవుతుందని తెలిపారు.

ఈ సమయంలో రికార్డు తనిఖీలా?

ఓవైపు జాతరలు, ఉత్సవాలు, పండుగలు ఉన్నాయని చెబుతున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులు.. ఇదే సమయంలో రికార్డుల తనిఖీ, ప్రాంతీయ స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న కొత్త అమావాస్య, 9న ఉగాది పండుగ ఉండగా.. 6వ తేదీన ద్వారకా తిరుమలలో ఏడు జిల్లాల అధికారులతో కమిషనర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడ ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌ ఆలయాలు, మఠాలు, ట్రస్టులకు చెందిన వివిధ రికార్డులు పరిశీలిస్తామని, వివరాలతో రావాలంటూ సమాచారం పంపారు.


ఏపీఎస్‌ఎస్‌డీసీకి ఐఎస్‌ఓ గుర్తింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)కు క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ విభాగంలో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించిందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు. గుర్తింపునకు సంబంధించిన 9001:2015 ధ్రువీకరణ పత్రాన్ని హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం తమకు అందజేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.


‘మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు చెల్లించేలా ఆదేశాలివ్వండి’

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు వెంటనే చెల్లించేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, బాజీ పఠాన్‌ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ అనుమతులు పొందినప్పటికీ ఆర్థికశాఖ కొర్రీలతో దాదాపు 1,200 మందికి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని మంగళవారం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘పాఠశాల విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా.. చిన్న కారణాలతో బిల్లులు ఆమోదించట్లేదు. గత సంవత్సరం పదో తరగతి పరీక్షల విధుల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు నేటికీ బకాయిలు చెల్లించలేదు’ అని కమిషనర్‌కు విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని