నంద్యాల జిల్లాలో చనిపోయిన అధికారికి పోలింగ్‌ విధులు

నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో కలెక్టర్‌ నిర్ణయాలు అనుమానాస్పదంగా మారాయి. అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధుల కేటాయింపులో నిబంధనలు పక్కనపెట్టి అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 03 Apr 2024 05:59 IST

మండల అధికారికి జిల్లా స్థాయి అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు
ఎన్నికల వేళ కూడా సొంత జిల్లాలో అదే పదవిలో కొనసాగింపు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో కలెక్టర్‌ నిర్ణయాలు అనుమానాస్పదంగా మారాయి. అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధుల కేటాయింపులో నిబంధనలు పక్కనపెట్టి అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి పరిశీలన బృందాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్స్‌లో గెజిటెడ్‌ అధికారులకు బదులు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, వెలుగు ఏపీవో, ఏపీఎంలను నియమించడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఆ వివాదం కొనసాగుతుండగానే మరోవైపు నోడల్‌ అధికారులుగా స్థానికులను నియమించడంపై విమర్శలు వెలువెత్తాయి. కొందరు ప్రజాప్రతినిధుల బంధువులను పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షకులుగా నియమించడంతోపాటు కొన్ని చోట్ల సొంత మండలాల బాధ్యతలు అప్పగించారు.

ఆయా ప్రజాప్రతినిధుల సిఫార్సులతోనే ఈ నియామకాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం, బనగానపల్లి, డోన్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ అధికారుల నియామక జాబితా కూడా తప్పులతడకగా ఉండటం గమనార్హం. సాధారణంగా డివిజన్‌, మండల స్థాయి అధికారులను ఎన్నికల పర్యవేక్షణ అధికారులుగా.. దిగువ స్థాయి సిబ్బందిని పోలింగ్‌ అధికారులు, సహాయ అధికారులుగా నియమిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఆర్డీవో, తహసీల్దార్‌ స్థాయి అధికారులను, చనిపోయినవారిని కూడా పోలింగ్‌ అధికారులుగా నియమిస్తూ జాబితా వెలువడడం కలకలకం రేపింది. 

  • జిల్లాలోని ఉయ్యాలవాడ మండల డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కానీ, ఆయన్ను పోలింగ్‌ అధికారిగా నియమించారు.
  • నంద్యాల ఆర్డీవో మల్లికార్జునరెడ్డి ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తుండగా ఆయన్ను పోలింగ్‌ అధికారిగా మార్చి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
  • ఆత్మకూరు ఆర్డీవో దాసు నందికొట్కూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా పని చేస్తుండగా, ఆయన్ను పోలింగ్‌ అధికారిగా మార్చారు.
  • మండల ఎన్నికల అధికారిగా ఉన్న నంద్యాల తహసీల్దార్‌ చంద్రశేఖరరెడ్డిని పీవోగా నియమించారు. ఇదే కార్యాలయంలో రీసర్వే డీటీగా పనిచేస్తున్న నాగరాజును ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోలింగ్‌ అధికారిగా నియమించారు. నంద్యాలలోనే సర్వేయర్‌గా పని చేస్తున్న సహదేవుణ్ని కూడా పీవోగా వేశారు. జిల్లాలో చాలామంది తహసీల్దార్లు, డీటీలను పోలింగ్‌ అధికారులుగా నియమించారు.
  • ఒక మండల అధికారిణికి కొంతకాలం కిందట జిల్లా స్థాయి అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె సొంత జిల్లా నంద్యాలే. జిల్లాకు చెందిన ఆ అధికారిని ఎన్నికల సమయంలోనూ అదే పదవిలో కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని