మంచి జరిగి ఉంటే ఆదరించండి

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.

Published : 03 Apr 2024 06:11 IST

మదనపల్లె సభలో సీఎం జగన్‌
విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం

ఈనాడు, కడప- న్యూస్‌టుడే, రాయచోటి: ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెదేపా, జనసేన, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు తనపై ఐక్యంగా దాడి చేస్తున్నాయన్నారు. పేదలందరికీ అందాల్సిన పథకాలు, పింఛన్లకు చంద్రబాబు లాంటి వారు అడ్డుపడే అవకాశం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. గత 58 నెలల్లో 130 సార్లు వివిధ పథకాల లబ్ధిదారులకు ఖాతాలో డబ్బు వేశానని వెల్లడించారు.

జగనన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తేనే వాలంటీర్లు ప్రతి ఇంటికీ వచ్చి పథకాలు అందిస్తారని తెలిపారు. ఐదేళ్ల కాలంలో ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకున్నామని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించి ఉపాధి కల్పించామన్నారు. మరో 6 వారాల్లో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో పేదల పక్షాన, వారి భవిష్యత్తు కోసం గొప్ప గెలుపు కళ్లముందే కనిపిస్తుందోనని తెలిపారు. ‘‘మూడు రోజుల ముందు ఏం జరిగిందో చూశారుగా...అవ్వతాతలకు నెలనెలా ఒకటిన ఇచ్చే పింఛన్లను చంద్రబాబు ఆపించేశారు. అందరికీ సాయం చేసే వాలంటీరు వ్యవస్థనూ రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆలోచన చేయండి.. ఇదంతా పెత్తందారి భావజాలం కాదా?’’ అని విమర్శించారు. సభ ఆసాంతం విపక్షాలపై ఆరోపణలు, విమర్శలకే సీఎం ప్రాధాన్యమిచ్చారు. ప్రతిపక్షాలు విడివిడిగా రాలేక అధికారం కోసం గుంపులుగా జట్టుకట్టి అబద్ధాలతో వస్తున్నాయని విమర్శించారు.

పసలేని 1.15 గంటల ఉపన్యాసం

1.15 గంటల పాటు ప్రసంగించిన జగన్‌ ఎన్నికల పోరాటంలో తానొక్కడే మిగిలానని, ఇతర పార్టీలు గుంపులుగా, జెండాలు జత కట్టుకొని వస్తున్నాయంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నించారు. విమర్శలు.. ఆరోపణలు చేసినప్పుడల్లా.. తన గొప్పలు చెప్పుకొన్నప్పుడల్లా చేతులెత్తి మద్దతు పలకాలంటూ జనాన్ని కోరారు. ఒకట్రెండుసార్లు చేతులెత్తిన జనం.. ఆ తర్వాత ఎత్తకుండా వదిలేశారు. గత ఐదేళ్లలో ఈ అభివృద్ధి చేయగలిగానని చెప్పలేకపోయారు. అనంతరం అభ్యర్థులను పరిచయం చేశారు.

పోలీసులపై తిరగబడ్డ ప్రయాణికులు

బస్సు యాత్రకు వచ్చిన జనానికి మద్యం, బిర్యానీ పొట్లాలు పంపిణీ చేశారు. బహిరంగ సభకు 6 జిల్లాల నుంచి 1,020 ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడిపారు. సభకు వచ్చేవారికి రూ.500 నగదుతో పాటు మద్యం, బిర్యానీ పొట్లాలు అందించారు. సభలో కొందరు కర్ణాటక మద్యం  తాగుతూ కనిపించారు. మత్తులో కొందరు సభా ప్రాంగణంలోనే దొర్లారు. సభ వాహనాలతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు, మదనపల్లె మీదుగా బళ్లారికి వెళ్లే బస్సులను సీటీఎం దగ్గర పోలీసులు నిలిపేశారు. సిద్ధం సభకు వెళ్లే బస్సులను మాత్రం పట్టణంలోకి వెళ్లేందుకు అనుమతించారు. దీనిని గమనించిన ప్రయాణికులు పోలీసులపై తిరగబడ్డారు. తాము దూరప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా ఎందుకు మధ్యలోనే నిలిపేస్తున్నారని నిలదీశారు. నిరసన తీవ్రం కావడంతో పోలీసులు ఎట్టకేలకు 11 గంటల సమయంలో అనుమతించారు.

పెద్దిరెడ్డి ఇలాకాలో సీఎం బస్సు యాత్ర అట్టర్‌ ప్లాప్‌

ఈనాడు, చిత్తూరు: విద్యుత్‌, అటవీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా పుంగనూరులో సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది. మంగళవారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలంలోకి రాత్రి 9గంటలకు సీఎం యాత్ర ప్రవేశించింది. జనాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. సాయంత్రం 6గంటలకు జగన్‌ వస్తారని షెడ్యూల్‌లో పేర్కొనగా 3 గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికీ జనాలు పెద్దగా రాలేదు. జనాలెవరూ లేకపోవడం చూసి సీఎం ప్రసంగించకుండా బస్సులో నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లారు. చౌడేపల్లె, సోమలలో మాత్రం సీఎం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు. సోమల మండలంలో రాత్రి 10 గంటల సమయంలో చేరుకున్నారు. సదుం మండలం అమ్మగారిపల్లెకి చేరుకొని అక్కడ సీఎం బస చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని