వేటు పడింది!

ఎన్నికల సంఘం ఎట్టకేలకు జూలు విదిల్చింది. రాష్ట్రంలోని ఒక ఐజీ, ముగ్గురు కలెక్టర్లు, అయిదుగురు ఎస్పీల పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Published : 03 Apr 2024 06:11 IST

కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజబాబు, గౌతమి,లక్ష్మీశలపై వేటు
గుంటూరు రేంజి ఐజీ పాలరాజుపై చర్యలు
ప్రకాశం, పల్నాడు, చిత్తూరు,అనంతపురం, నెల్లూరు ఎస్పీలు బదిలీ
వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై ఈసీ చర్యలు

ఈనాడు-అమరావతి: ఎన్నికల సంఘం ఎట్టకేలకు జూలు విదిల్చింది. రాష్ట్రంలోని ఒక ఐజీ, ముగ్గురు కలెక్టర్లు, అయిదుగురు ఎస్పీల పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాతో అంటకాగుతూ.. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులపై విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం వీరిపై ఎట్టకేలకు చర్యలు తీసుకుంది.

కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజబాబు, ఎం.గౌతమి, డా.లక్ష్మీశ, గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, వై.రవిశంకరరెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్‌ అన్బురాజన్‌, కె.తిరుమలేశ్వరరెడ్డిలను తక్షణమే బదిలీ చేయాలని మంగళవారం ఆదేశాలిచ్చింది. వీరంతా బాధ్యతలను తమ తర్వాత స్థానాల్లో ఉన్న అధికారులకు అప్పగించేసి వెంటనే విధుల నుంచి రిలీవ్‌ కావాలని పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వీరికి ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. బదిలీ వేటుకు గురైన వారి స్థానంలో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ముగ్గురేసి చొప్పున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లతో మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా ప్యానెల్‌ జాబితాను తమకు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని