వారి సంగతి సరే.. వీరి మాటేంటి?

రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే వారు ఆ పోస్టుల్లో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కాదన్న అభిప్రాయం కలుగుతోంది.

Updated : 03 Apr 2024 06:58 IST

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న సీఎస్‌, డీజీపీ, నిఘా విభాగాధిపతి, విజిలెన్స్‌ చీఫ్‌
సీఎంఓ చెప్పినట్టల్లా ఆడుతున్న సెర్ప్‌ సీఈఓ
ఈసీ చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్షాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే వారు ఆ పోస్టుల్లో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కాదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆ అధికారుల్ని ఎన్నికల సంఘం వెంటనే ఆ పోస్టుల నుంచి తప్పించాలని, లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవన్న డిమాండ్‌లు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రయోజనాలను రక్షించడమే పరమావధిగా పనిచేస్తున్న ఆ అధికారులు తమ హోదాను, అధికారాల్ని ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజిలెన్స్‌ విభాగాధిపతి కొల్లి రఘునాథరెడ్డి, డీఆర్‌ఐ చీఫ్‌ రాజేశ్వర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ వంటివారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు, వివిధ సంఘాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. ఈ అధికారుల చర్యలూ వాటికి ఊతమిచ్చేలా ఉన్నాయి. వీరిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం (ఈసీ) మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారపార్టీకి కొమ్ముకాయడమే సీఎస్‌ ఎజెండా

సీఎస్‌ జవహర్‌రెడ్డికి అధికార పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సీఎస్‌గా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. వాలంటీర్లలో అత్యధికులు అధికారపార్టీ కార్యకర్తలని తెలిసినా, వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని విపక్షాల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. పింఛన్లు సహా ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిన తర్వాత, సీఎస్‌గా స్పందించి ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి... వైకాపా ఆడుతున్న రాజకీయ క్రీడకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందు ప్రభుత్వ పెద్దలు అస్మదీయుల కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెడుతున్నా సీఎస్‌గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న భావన ఉంది. ఇలాంటి అధికారి సీఎస్‌గా ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశించలేమని, ఎన్నికల సంఘం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

వైకాపా ఆగడాలకు అండాదండా..!

డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని... ఆయనకంటే సీనియర్లు అయిన 10-12 మంది అధికారుల్ని పక్కనబెట్టి జగన్‌ అందలమెక్కించారు. ఆయన ఇప్పటికీ ఇన్‌ఛార్జి డీజీపీనే. పోలీసు అధికారుల్లో చాలా మంది అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటే దాని వెనుక రాజేంద్రనాథరెడ్డి పాత్ర చాలా ఉందన్న ఆరోపణలున్నాయి. విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపైనా కేసులు పెట్టి వేధించడం వంటివి ఆయన హయాంలో కోకొల్లలుగా జరిగాయి. అధికార పార్టీ నాయకుల హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు తెదేపాలోని ఎంత పెద్ద నాయకులు వచ్చినా ఆయన కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. విపక్ష నాయకులు, ఉద్యోగ, ప్రజాసంఘాల వారు ఏదైనా నిరసనకు పిలుపునిస్తే ముందు రోజు రాత్రే వారందరినీ గృహనిర్బంధం చేసేస్తారు. అదే వైకాపా శ్రేణులు ఎంతగా పేట్రేగిపోతున్నా కేసులుండవు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక వైకాపా నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ సార్వత్రిక ఎన్నికలనూ పోలీసుల అండతో వైకాపా  ఏకపక్షంగా మార్చేసే ప్రమాదం ఉంది. డీజీపీని మార్చితేనే ఆ పార్టీ ఆగడాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని పలువురు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నీ తానై నడిపిస్తున్న అధికారి ధనుంజయరెడ్డి. సీఎం జగన్‌కు ఆంతరంగికుడు. ఆయన మొత్తం అధికార యంత్రాంగాన్ని కంటి చూపుతో శాసిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని నిర్ణయించడం, నాయకుల మధ్య సమన్వయం వంటి కీలక బాధ్యతలన్నీ ఆయనే చూస్తారు. బిల్లులు ఎవరికి చెల్లించాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. అలాంటి అధికారిని ఎన్నికల సమయంలో అంత కీలక స్థానంలో ఎన్నికల సంఘం ఎలా కొనసాగిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఎంత ప్రకంపనలు సృష్టిస్తోందో చూస్తున్నాం.

అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు

నైపుణ్యాభివృద్ధి కేసులో తెదేపా అధినేత చంద్రబాబును నంద్యాలకు వెళ్లి అరెస్టు చేసిన తర్వాత అప్పటికి నిఘా విభాగం ఐజీగా ఉన్ని కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతిగా జగన్‌ ప్రభుత్వం నియమించింది. ఐజీ హోదా కలిగిన రఘురామరెడ్డికి ఏకంగా డీజీ ర్యాంకు పోస్టు ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్‌కు రఘురామరెడ్డే నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైకాపాకు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ పోస్టు ఇచ్చారనే విమర్శలున్నాయి. మొత్తం అన్ని శాఖలలో విజిలెన్స్‌ అధికారాలు తనకే కట్టబెట్టాలంటూ ఆయన ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదాస్పదమైంది. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధినేతగా కూడా ఆయనే ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి, తెదేపా నేత నారాయణ ఇల్లు, కార్యాలయాల్లో దాడులు చేసింది ఈ విభాగమే. వైకాపా పెద్దలతో అంతగా అంటకాగే అధికారుల్ని అంత కీలక స్థానాల్లో ఉంచితే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం (డీఆర్‌ఐ) చీఫ్‌గా ఉన్న రాజేశ్వర్‌రెడ్డి అడుగడుగునా స్వామి భక్తి చాటుకుంటున్నారన్న విమర్శలున్నాయి. విపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాజేశ్వర్‌రెడ్డి వంటి వ్యక్తి ఆ పోస్టులో ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవని, ఆయనను తప్పించాలన్న డిమాండ్‌లు పెరుగుతున్నాయి.

 ఐఏఎస్‌ అధికారి వ్యవహరించాల్సింది ఇలాగేనా?

సెర్ప్‌ సీఈఓగా పనిచేస్తున్న మురళీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డికి కావలసిన వ్యక్తి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఉత్తర్వులు రాకముందే వాలంటీర్ల ద్వారానే పింఛను పంపిణీ జరుగుతుందని అత్యుత్సాహంతో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛను పంపిణీ చేయించగలమని మెజారిటీ జిల్లా కలెక్టర్లే చెప్పినా అది సాధ్యం కాదని తేల్చేశారు. మొత్తం నెపాన్ని విపక్షాలపై నెట్టేసే ప్రయత్నానికి ఆయన సహకరించారన్న ఆరోపణలున్నాయి. సెర్ప్‌లో సుమారు 28 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మురళీధర్‌రెడ్డి వంటి అధికారి అంత కీలకమైన పోస్ట్‌లో ఉంటే ఎన్నికల్లో ప్రభావితం చేయరన్న నమ్మకమేముందని విపక్షాలంటున్నాయి. 

  • రాష్ట్రంలో కొనుగోళ్లు, పంపిణీ, విక్రయాలు మొత్తం ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ సంస్థకు ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడు. దీంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులు మద్యాన్ని ఏరులై పారించే అవకాశం ఉందని  విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
  • ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణలకు ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలే వేదం. ఎన్నికల సమయంలో  ‘మొదట వచ్చినవారికి మొదట చెల్లింపు’ విధానాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందినవారికి రూ.వేలల్లో పెండింగ్‌ బిల్లులు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఫిర్యాదుల వెల్లువ

‘‘ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆ పోస్ట్‌ల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. వారిని వెంటనే బదిలీ చేయాలి’’ అని రాష్ట్రానికి చెందిన కొందరు ‘ఛేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ’ వెబ్‌సైట్‌ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల పిటిషన్‌ పెట్టారు. మంగళవారం సాయంత్రం వరకు ఈ డిమాండ్‌కు 2,449 మంది ఆన్‌లైన్‌లో మద్దతు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని