ఏపీకి ముగ్గురు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు

ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది.

Published : 03 Apr 2024 04:16 IST

సాధారణ వ్యవహారాల పర్యవేక్షణకు  రామ్మోహన్‌ మిశ్ర
శాంతిభద్రతల పరిశీలకుడిగా దీపక్‌ మిశ్ర,  వ్యయ పరిశీలనకు నీనా నిగం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. సాధారణ వ్యవహారాల పర్యవేక్షణకు 1987 బ్యాచ్‌ అస్సాం, మేఘాలయ కేడర్‌ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రామ్మోహన్‌ మిశ్ర, శాంతిభద్రతల వ్యవహారాల పర్యవేక్షణకు 1984 బ్యాచ్‌ ఏజీఎంయూటీ కేడర్‌ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌ మిశ్ర, ఎన్నికల వ్యయ పరిశీలనకు 1983 బ్యాచ్‌ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి నీనా నిగమ్‌లను నియమించింది. దీంతోపాటు ఏడు కోట్లకుపైగా జనాభా ఉన్న బిహార్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌తోపాటు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు ఈ ప్రత్యేక పర్యవేక్షకులను పంపింది. ఎన్నికల ప్రక్రియను సూక్ష్మంగా గమనించడానికి వీరిని నియమించినట్లు పేర్కొంది. ఎన్నికల సిబ్బంది, భద్రతాదళాల పనితీరు, ఓటింగ్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌, ఎన్నికల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ చర్యలను పర్యవేక్షించే కీలక బాధ్యతలను వీరికి అప్పగించింది. ఎన్నికల్లో  ధనబలాన్ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశాలకు ప్రత్యేక వ్యయ పరిశీలకులను పంపుతున్నట్లు ఈసీఐ తెలిపింది. ధనబలం, మద్యం, ఉచిత వస్తువుల పంపిణీ తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు పేర్కొంది.

ప్రత్యేక పరిశీలకుల బాధ్యతలు ఇవీ

1. ఈ ప్రత్యేక పరిశీలకులు రాష్ట్ర రాజధానిలో ఉంటారు. అవసరమైతే సున్నితమైన, సమన్వయం అవసరమైన ప్రాంతాలు, జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను గమనిస్తారు.
2. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలవారీగా మోహరించిన పరిశీలకుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి విశ్లేషిస్తారు.
3. అవసరమైన ప్రాంతాల్లో కిందిస్థాయి అధికారులతో కలిసి పరిస్థితులను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటారు.
4. ఎన్నికల పర్యవేక్షణలో పాల్గొంటున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రాంతీయ అధిపతులు, నోడల్‌ ఏజెన్సీల నుంచి వివరాలు తీసుకొని, సమన్వయం చేసుకుంటారు.
5. రాష్ట్రాల సరిహద్దులపై దృష్టిసారిస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులను రాష్ట్రంలోకి తీసుకురావడానికి వీలున్న సున్నితమైన సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెడతారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.
6. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇందుకోసం వివిధ సంస్థలతో సమన్వయం చేసుకుంటారు. నకిలీ వార్తలను కౌంటర్‌ చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరగడానికి పోలింగ్‌కు 72 గంటల ముందు జరిగే వ్యవహారాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు.
7. ఎన్నికల కమిషన్‌, జోనల్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు, ఇతర శాంతిభద్రతల నిర్వహణ సంస్థలు నిర్వహించే సమీక్షలు, సమావేశాల్లో పాలుపంచుకొని తమ అభిప్రాయాలు, గత అనుభవాలను పంచుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని