అనుకున్నట్లే చేసింది

ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది.

Updated : 03 Apr 2024 05:23 IST

గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం
నేటి నుంచి ఆరో తేదీ వరకు అందజేత
దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం, వీల్‌ఛైర్‌పై ఉన్న వారికే ఇంటి వద్ద
మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే
సర్కారు ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని.. వీరిలో కొందరికి వేర్వేరు విధులు ఉన్నాయని.. ఇలా పలు కారణాలు చూపించి చివరకు పింఛనర్లను గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించేలా చేస్తోంది. ఈ మేరకు బుధవారం నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను ఇవ్వాలంటూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వులో పేర్కొంది. పింఛన్ల పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) సీఈవో గతనెల 31న  జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించి.. దాని స్థానంలో ఈ నెలతోపాటు మే, జూన్‌ నెలల్లోనూ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలిచ్చింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేపట్టరాదంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఈ సర్క్యులర్‌ జారీ చేసినట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వారికి మాత్రమే ఇళ్ల వద్ద పంపిణీ

గ్రామ సచివాలయాలకు దూరంగా ఉండే ఆవాసాలు (హాబిటేషన్స్‌), అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం వంటి జిల్లాల్లోని సచివాలయాలకు దూరంగా ఉన్న ఆవాసాల్లోని పింఛనుదార్లకు.. సమీప ప్రభుత్వ కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీకి కలెక్టర్లు ఏర్పాటుచేయాలి. ఈ పింఛన్ల పంపిణీపై తగిన ప్రచారం కల్పించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.

  •  పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విధులు నిర్వహించాలి.
  • సచివాలయాలకు వచ్చే పింఛనుదార్లకు నీడ కల్పించడం, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు అందుబాటులో ఉంచే బాధ్యత గ్రామపంచాయతీలదే. వీటికయ్యే ఖర్చులకు పంచాయతీ సాధారణ నిధిని వెచ్చించాలి. తదనుగుణంగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలనివ్వాలి.
  • బ్యాంకులనుంచి పింఛను సొమ్ము డ్రా చేసి గ్రామ సచివాలయాలకు తీసుకెళ్లేందుకు వీలుగా పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ, విద్యా కార్యదర్శులకు ఎంపీడీవోలు, పట్టణాల్లోని వార్డు అడ్మినిస్ట్రేటివ్‌, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు మున్సిపల్‌ కమిషనర్లు అధీకృత లేఖలు ఇవ్వాలి. బ్యాంకుల్లో డ్రా చేసిన సొమ్మును పింఛన్ల పంపిణీ విధుల్లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అందజేయాలి. పింఛన్ల సొమ్మును బుధవారం నుంచి బ్యాంకుల్లో డ్రా చేసేలా ఆర్థికశాఖ ఏర్పాట్లు చేసింది. వెంటనే పింఛన్ల పంపిణీని ప్రారంభించి ఆరో తేదీ నాటికి పూర్తి చేయాలి.
  • కొందరు పింఛనర్లకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేసే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది.. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఇచ్చే అధీకృత లేఖలను వెంట తీసుకెళ్లాలి. ఈ ప్రతులను సంబంధిత ఎన్నికల అధికారులకూ పంపాలి.
  • ప్రతిరోజూ పింఛన్లు పంపిణీ అయ్యాక మిగిలిన సొమ్మును వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ (డబ్ల్యూఈఏ), వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీకి అప్పగించాలి. వీళ్లు ఈ వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు తెలియజేయాలి.
  • గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరికీ లాగిన్లు అందజేయాలి. వారు తమ మొబైళ్లలో పింఛను పంపిణీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • పింఛనుదార్ల జాబితా సిబ్బందికి అందిస్తారు. ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ డివైజ్‌లను ఆ సిబ్బందికి డిజిటల్‌ అసిస్టెంట్లు అందజేస్తారు.
  • పింఛన్ల పంపిణీ విధానాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీలు వివరించాలి.
  •  ఆధార్‌ ఆధారిత పింఛను పంపిణీ కుదరకపోతే రియల్‌టైమ్‌ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌బీఐఎస్‌) విధానంలో పంచాలి.
  • పింఛన్లు పంపిణీ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ప్రచారం చేయకూడదు.
  • ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం.. అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

వాలంటీర్లులా.. సిబ్బంది లేరట!

రెండు రోజుల కిందట కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పింఛనుదార్లు అందరికీ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంచడం సాధ్యం కాదని, వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛను సొమ్ము జమ చేసేందుకు ఇబ్బందులున్నాయని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

వాలంటీర్లు 2.66 లక్షల మంది ఉండగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.27 లక్షల మందే ఉన్నారని తెలిపారు. వీరిలో వైద్య సేవలందించే ఏఎన్‌ఎంలు, వార్డు ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది, వ్యవసాయ అనుబంధ సేవలందించే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య సహాయకులు 14,232 మంది, విద్యుత్‌ పనులు చేసే ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 6,754 మంది సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో కొందరు బూత్‌ స్థాయి అధికారుల విధులు నిర్వహిస్తుండటం, మరికొందరు ఎన్నికల సంబంధిత శిక్షణకు హాజరవుతున్నందున వీరితో ఏప్రిల్‌, మే నెలల్లో పింఛన్ల పంపిణీ కుదరబోదని తెలిపారు.
  • వీరందరినీ మినహాయిస్తే ఇంటింటికీ పింఛను పంపిణీచేసే సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, వాలంటీర్ల మాదిరి ఈ సిబ్బందికి పింఛనుదార్ల ఇళ్లు కచ్చితంగా తెలియక, పింఛను పంపిణీకి ఎక్కువ సమయం పట్టే అవకాశముందని పేర్కొన్నారు. ఇలాంటి జాప్యం ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని వివరించారు.
  • పింఛనుదార్లు అందరికీ తమ గ్రామ, వార్డు సచివాలయాలు ఎక్కడున్నాయో తెలుసని.. వారు తమ సౌలభ్యం మేరకు ఈ సచివాలయాలకు రావొచ్చని పేర్కొన్నారు.
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీకి ఉపయోగించుకోవచ్చని, అన్ని సచివాలయాల్లో ఐటీ హార్డ్‌వేర్‌, కనెక్టివిటీ అందుబాటులో ఉందని తెలిపారు.
  • పింఛన్ల పంపిణీ నేపథ్యంలో అక్కడి ఉద్యోగుల పని వేళలు పెంచొచ్చని, పింఛన్ల పంపిణీని సులభంగా పర్యవేక్షించే వీలుందని, ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే పరిష్కరించే వీలుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి మొగ్గు చూపినట్లు పేర్కొన్నారు.

డీబీటీ వల్ల అసాధ్యమే..

నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పింఛను జమ (డీబీటీ) చేసే విధానమూ సాధ్యం కాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. పింఛనుదార్లలో కొందరికి బ్యాంకు పాసుపుస్తకాలు లేకపోవడం, మరికొందరి బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోవడం, ఆ ఖాతాలకు ఆధార్‌ సీడింగ్‌ కాకపోవడంతోపాటు మరణించిన పింఛనుదార్లకూ పింఛను జమయ్యే అవకాశముందని తెలిపారు. మరోవైపు పింఛను పొందేవారంతా పేదవాళ్లు కావడం, వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు పింఛను సొమ్మును బ్యాంకులో డ్రా చేయడం సాధ్యం కాదని తేల్చినట్లు ఉత్తర్వులో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని