ఫీజులను కళాశాలల ఖాతాల్లోనే వేయాలి

బోధన రుసుములను కళాశాలల ప్రిన్సిపాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయాలని ప్రైవేట్‌ విద్యా సంస్థల ఐకాస డిమాండ్‌ చేసింది.

Published : 03 Apr 2024 05:04 IST

ప్రైవేట్‌ విద్యా సంస్థల ఐకాస

ఈనాడు, అమరావతి: బోధన రుసుములను కళాశాలల ప్రిన్సిపాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయాలని ప్రైవేట్‌ విద్యా సంస్థల ఐకాస డిమాండ్‌ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థల సంఘాల నాయకులు సమావేశమై ఐకాస కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ‘పెండింగ్‌లో ఉన్న పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఫీజుల బకాయిలు మూడు నెలల్లో చెల్లించాలి. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల ధరలు నిర్ణయించాలి. జూనియర్‌, యూజీ, పీజీ కళాశాలలకు అయిదేళ్ల వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. పాఠశాలల అనుమతుల రెన్యువల్‌లో భవనం, మైదానం లీజుల ఒప్పంద డాక్యుమెంట్లను అనుమతించాలి. ప్రైవేట్‌ డీఈడీ కళాశాలలన్నింటికీ అనుమతులు ఇవ్వాలి. అన్ని వర్సిటీలకు ఉమ్మడి అనుబంధ గుర్తింపు ఫీజులు నిర్ణయించాలి. డిగ్రీలో యాజమాన్య కోటా తొలగించి, బోధన రుసుములు చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఐకాస కన్వీనర్‌గా పాపిరెడ్డి మదన్‌ మోహన్‌రెడ్డి, కో కన్వీనర్‌గా మోహన్‌రావు, ప్రాంతీయ సమన్వయకర్తలుగా భాస్కరరెడ్డి, రమణాజీలు ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని