అభ్యర్థుల చరిత్రను తెలిపే ఫారం 26ను తెలుగులో అందుబాటులో ఉంచాలి

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అఫిడవిట్‌ (ఫారం-26)ను తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

Published : 03 Apr 2024 05:05 IST

ఆ మేరకు ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి
హైకోర్టులో పిల్‌ దాఖలు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అఫిడవిట్‌ (ఫారం-26)ను తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. ఒకవేళ అభ్యర్థులు అంగ్లంలో అఫిడవిట్‌ సమర్పిస్తే ఎన్నికల సంఘం దాన్ని తెలుగులోకి అనువదించి, పౌరులకు అందజేయాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షులు, అమ్మనుడి ఎడిటర్‌, మాచవరానికి చెందిన వైద్యుల సామల రమేశ్‌బాబు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి వివరాలను తెలుసుకునే హక్కు ఓటరుకు ఉంటుందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83 శాతం మంది ప్రజలు తెలుగును మాత్రమే అర్థం చేసుకోగలరన్నారు. ఈ నేపథ్యంలో ఫారం 26 ద్వారా ఇచ్చే సమాచారం తెలుగులో ఉండేలా చూడాలని ఎన్నికల సంఘానికి పలుమార్లు విన్నవించినా చర్యలు లేవన్నారు. తమిళనాడులో అభ్యర్థులు తమిళంలో ఫారం 26 సమర్పించడానికి వెసులుబాటు కల్పించారని గుర్తుచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లోనూ ఫారం 26 అఫిడవిట్‌ను ఆంగ్లం లేదా స్థానిక భాషలో సమర్పించొచ్చని పేర్కొన్నారన్నారు. ఏపీ విషయంలో ఫారం 26ను తెలుగులో ప్రచురించలేదన్నారు. తమ వివరాలన్నింటిని ప్రజలకు తెలుగులో పత్రికల ద్వారా వెల్లడించేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులను ఆదేశించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని