పింఛనుదార్లకు పస్తులు.. సొంతవాళ్లకే బిల్లులు

వైకాపా ప్రభుత్వం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటోంది. తన అనుయాయులకే పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తోంది.

Published : 03 Apr 2024 05:07 IST

అనుయాయులకే రూ.వేల కోట్ల  బిల్లులు చెల్లించిన వైకాపా ప్రభుత్వం
తాజాగా రూ.4,000 కోట్ల అప్పు
ఆ సొమ్ముతోనే పెన్షన్లు,  ఉద్యోగుల జీతాలకు ఏర్పాట్లు 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటోంది. తన అనుయాయులకే పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తోంది. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఇతర ప్రాధాన్యాంశాలన్నింటినీ విస్మరించి ఎలాంటి నిబంధనలూ పాటించకుండా ఏకంగా రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసేసింది. ఎందరో గుత్తేదారులు, సరఫరాదారులు ఆర్థికశాఖ అధికారుల చుట్టూ తిరిగి విన్నవించుకున్నా, ఫిఫో(మొదట వచ్చిన బిల్లు మొదటే చెల్లించే విధానం) అనుసరించాలని కోరినా చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారిపోయింది. అధికార పార్టీ నాయకుల సొంత వ్యవహారాలకు, సొంత మనుషులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి నేతృత్వంలోనే ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ ప్రభుత్వ పెద్దలకు కావల్సినవారికే బిల్లులు చెల్లిస్తున్నారని గుత్తేదారులు మండిపడుతున్నారు. కార్పొరేషన్‌ ద్వారా రూ.4,000 కోట్ల అప్పులు తెచ్చి మరీ బిల్లులు చెల్లించేశారు. ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు ఈ అతిక్రమణలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఏ క్షణమైనా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వస్తే మళ్లీ తమ వారికి బిల్లుల చెల్లింపులు కష్టమవుతాయనే భావనతో త్వరత్వరగా ఈ కార్యక్రమం కానిచ్చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లించడం దీనికి నిదర్శనం. రేపు ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వంలో తమవారికి బిల్లుల చెల్లింపులు సాధ్యం కావేమోననే భయంతోనే ఇలా చేస్తున్నారని కొందరు గుత్తేదారులు పేర్కొంటున్నారు.

సామాజిక పెన్షన్లకు లేకుండానే..

పాత ప్రభుత్వ హయాంలో మొదట పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించేవరకు ఇతర బిల్లులు ఏమీ ఇచ్చేవారు కాదు. ప్రతి నెలా చివరి వారం నుంచే అన్ని ఇతర బిల్లులు నిలిపివేసేవారు. వైకాపా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఏప్రిల్‌ 1న సామాజిక పెన్షన్లు చెల్లించాలన్న సంగతి తెలుసు. లక్షల మంది పేదలు పెన్షన్ల కోసం ఎదురుచూస్తుంటారనీ తెలుసు. అందుకు తగ్గట్టుగా నెల చివర్లో వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు చేసుకుని ఇతర బిల్లులు పెండింగులో ఉంచుకోవచ్చు. వైకాపా ప్రభుత్వం సామాజిక పింఛన్లకు కూడా నిధులు కేటాయించకుండా అనుయాయులకు బిల్లుల చెల్లింపులకే ప్రాధాన్యమివ్వడం పేదల ప్రభుత్వమన్న వారి మాటలకు చేతలకు పొంతన లేదని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు పింఛను సొమ్ముల కోసం బహిరంగ మార్కెట్‌ రుణం కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ రుణం బుధవారం జమయిన తర్వాత సామాజిక పింఛన్లు మూడు రోజుల పాటు చెల్లించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని