వివేకా కుమార్తె, అల్లుడికి హైకోర్టులో ఊరట

పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీమంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత, ఆమె భర్త నర్రెడ్డి  రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లకు హైకోర్టులో ఊరట లభించింది.

Published : 03 Apr 2024 05:09 IST

పులివెందుల పోలీసుల కేసులో చర్యలు నిలిపివేత

ఈనాడు, అమరావతి: పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీమంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత, ఆమె భర్త నర్రెడ్డి  రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్‌ ఫిర్యాదును పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్‌ యాంత్రిక ధోరణిలో   పోలీసులకు పంపించారని ఆక్షేపించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ అవసరమని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఒత్తిడి చేస్తున్నారని, సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2023 డిసెంబరు 8న కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని