సర్వమతాల పట్ల సమ బాధ్యత

‘రాజకీయ పార్టీ అధినేతగా సర్వ మతాలు, సర్వ ధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను. అన్ని మతాలు, ధర్మాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నా’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Published : 03 Apr 2024 05:14 IST

పిఠాపురంలోని చర్చి, దర్గాల్లో పవన్‌కల్యాణ్‌ ప్రార్థనలు

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, పిఠాపురం: ‘రాజకీయ పార్టీ అధినేతగా సర్వ మతాలు, సర్వ ధర్మాల పట్ల సమాన బాధ్యతతో వ్యవహరిస్తాను. అన్ని మతాలు, ధర్మాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నా’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చారిత్రక ఆంధ్ర బాప్టిస్టు సెంటినరీ చర్చిని, యు.కొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్‌ బీబీ దర్గా (బంగారు పాపమ్మ)ను మంగళవారం ఆయన సందర్శించి ప్రార్థనలు చేశారు. ‘నా దేశం నాకు సర్వ మతాల పట్ల సమాన విశ్వాసం కలిగి ఉండడాన్ని నేర్పింది. సర్వ మతాలు, ధర్మాలకు గౌరవం ఇచ్చే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. ఏ మతం కూడా చెడు చెయ్యమని చెప్పదు.. దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు.. మనుషులంతా ఒక్కటే. అందరూ మానవత్వంతో మెలగాలి’ అని పవన్‌ కల్యాణ్‌ కాంక్షించారు.

చర్చిలో క్రైస్తవ మత పెద్దలు పవన్‌ కల్యాణ్‌ విజయం కోరుతూ ప్రార్థనలు చేసి, ఆశీర్వాదాలు అందించారు. ‘తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును’ అనే బైబిల్‌లో వాక్యం తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా పవన్‌ అన్నారు. ప్రార్థనల్లో కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలోని ప్రసిద్ధ బషీర్‌ బీబీ దర్గాలో పవన్‌ కల్యాణ్‌ ప్రార్థనలు చేశారు. అక్కడి మత పెద్దలు ఆయనను పవిత్ర వస్త్ర్రంతో సత్కరించారు. ఉర్సు దగ్గర కొబ్బరికాయ కొట్టి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జనసేన నాయకులతోపాటు, దర్గా ముజావర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని