జగన్‌.. ఇదేనా మీ విశ్వసనీయత?

2018లో చిత్తూరు పర్యటనలో పాడి రైతులకు న్యాయం చేస్తామని.. చెరకు రైతుల కష్టాలు తీరుస్తామని జగన్‌ హమీ ఇచ్చారు.

Updated : 03 Apr 2024 06:19 IST

పునరుద్ధరిస్తామన్న చక్కెర  కర్మాగారాలు అమ్మకానికి పెట్టారు
తెరిపిస్తామన్న విజయ డెయిరీ అమూల్‌కు అప్పగించారు
మాట తప్పిన మీరు క్షమాపణ చెబుతారా?
నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన
ఈనాడు-చిత్తూరు, తిరుపతి, అమరావతి

చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయతీ అనే పదాలు రావాలి. ఏ రాజకీయ నాయకుడైనా ఒక పని చేస్తానని చెప్పి చేయలేకపోతే.. తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తేవాలి. మోసం చేసేవాడు.. అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడిగా కావాలా? ఆలోచించుకోండి.

 ఆరేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిన మాటలివి.


2018లో చిత్తూరు పర్యటనలో పాడి రైతులకు న్యాయం చేస్తామని.. చెరకు రైతుల కష్టాలు తీరుస్తామని జగన్‌ హమీ ఇచ్చారు. అధికారంలో అయిదేళ్లున్నా నోటిమాటలే తప్ప ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. చిత్తూరు డెయిరీని తక్కువ ధరకే అమూల్‌కు కట్టబెట్టారు. చక్కెర కర్మాగారాల్ని అప్పనంగా అమ్మేసేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గానికి పులివెందులతో సమానంగా నిధులు కేటాయిస్తానని నమ్మించి మొండిచెయ్యి చూపారు. మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజల్ని మోసగించేందుకు బయలుదేరారు. బుధవారం చిత్తూరు జిల్లాలో ప్రచారం నిర్వహించనున్న ఆయన.. ప్రజలకు క్షమాపణ చెబుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రూ.వెయ్యి కోట్ల ఎస్వీ  చక్కెర కర్మాగారం అమ్మకానికి..

చక్కెర కర్మాగారాలను పునరుద్ధరించడమంటే.. జగన్‌ దృష్టిలో అమ్మకానికి పెట్టడమేనేమో! తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యంలో 167 ఎకరాల్లో ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర చక్కెర కర్మాగారం పరిధిలో 13 వేల మంది రైతులున్నారు. రేణిగుంట, వడమాలపేట, చంద్రగిరి, పుత్తూరు, నిండ్ర, నారాయణవనం, పిచ్చాటూరు, కార్వేటినగరం, విజయపురం మండలాల పరిధిలోని రైతులకు ఇందులో వాటాలున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో చెరకు పండించి.. క్రషింగ్‌ కోసం ఇక్కడికి తరలించేవారు. దీన్ని పునరుద్ధరిస్తామని పాదయాత్ర సమయంలో జగన్‌ చెప్పారు. రూ.150 కోట్లు కేటాయిస్తే.. మళ్లీ క్రషింగ్‌ ప్రారంభించవచ్చు. అయితే అధికారంలోకి వచ్చాక మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణపై అధ్యయనం పేరిట మంత్రుల కమిటీ నియమించారు. చివరికి పునరుద్ధరణ సాధ్యం కాదంటూ వారితోనే సిఫారసు చేయించి.. ప్రైవేటుకు అప్పగించే కుట్రకు తెరలేపారు. అందులో భాగంగా ఆస్తుల మదింపు చేపట్టారు. ఎకరా రూ.6 కోట్ల చొప్పున పరిశ్రమ పరిధిలోని భూముల విలువే రూ.1,002 కోట్లుగా ఉంది. యంత్రాలు, ఇతరత్రా కలిపితే ఇంకా ఎక్కువే. కొన్ని నెలల క్రితం ఆవరణలోని 880 చెట్లు తొలగించేలా తీర్మానం చేయించారు. రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ పరిశ్రమ అందుబాటులోకి రాకపోవడంతో.. రైతులు 45 కి.మీ దూరంలోని ఎస్‌ఆర్‌పురం మండలం శానకుప్పంలోని కర్మాగారానికి చెరకు తరలిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో టన్నుకు రూ.500 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. చిత్తూరులోని చక్కెర పరిశ్రమను కూడా తెరిపించకుండా అమ్మకానికి పెట్టారు. దీని పరిధిలో 80 ఎకరాల భూములు ఉన్నాయి. మార్కెట్‌ ధర ప్రకారం వీటి విలువ రూ.500 కోట్ల పైనే ఉంది.

అప్పులు తీర్చి.. ఆపై డెయిరీని కట్టబెట్టి

ఎన్నికల ముందు చిత్తూరు విజయ డెయిరీని తెరిపిస్తామంటూ చెప్పి రైతులను మోసం చేశారు. డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పుల్ని సర్కారు చెల్లించడమే కాకుండా.. ఏడాదికి రూ.కోటి లీజుపై 99 ఏళ్లకు అమూల్‌కు కట్టబెట్టింది. మదనపల్లెలోని ప్లాంట్‌ను కూడా ఇచ్చేసింది. డెయిరీకి సుమారు రూ.500 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. డెయిరీ నిర్వహణకు ప్రభుత్వం ఊతమిచ్చి ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్ష మంది పాడి రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేవారు. మరోవైపు పది నెలల్లో అమూల్‌ సంస్థ పాల సేకరణ ప్రారంభిస్తుందని చెప్పినా.. ఇప్పటికీ అతీగతీ లేదు.

కుప్పాన్ని పులివెందులలా చూడటమంటే ఇదేనా?

‘వై నాట్‌ కుప్పం’ అంటూ ప్రతిసారీ మాట్లాడే జగన్‌.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు సమానంగా కుప్పంను తీర్చిదిద్దుతానంటూ నియోజకవర్గ ప్రజల్ని నమ్మించారు. 2022 సెప్టెంబరు 23న కుప్పంలో జరిగిన బహిరంగ సభలో పురపాలిక అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేశానని గొప్పగా ప్రకటించారు. అదే రోజు శంకుస్థాపనలు చేశారు. నిధులొచ్చేశాయని మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం, నూతనంగా బోర్ల తవ్వకాలు, పైపులు, వీధి దీపాల ఏర్పాటు, సామాజిక భవనాల నిర్మాణం, ఉద్యానవనాలు, శ్మశానవాటిక అభివృద్ధి పనులు చేస్తామని అధికార పార్టీ నేతలు తెలిపారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్లే అధికారులను నిలదీశారు. కనీసం తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శివారు ప్రాంతాల్లో రహదారులు కూడా సరిగా లేవు. రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తానని చెప్పినా.. ఒక్క రూపాయీ ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని