కరెంట్‌లోనూ కోట్లాట

క్విడ్‌ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది.

Published : 04 Apr 2024 05:32 IST

రూ.7,830 కోట్లు దోచిపెట్టేలా జగన్నాటకం
యాక్సిస్‌ ఎనర్జీతో పీపీఏకు అనుమతించిన ఫలితం
ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం 21 పీపీఏలు
గతంలోకంటే అధిక ధర చెల్లించేలా ప్రతిపాదన
మార్కెట్‌తో పోలిస్తే.. యూనిట్‌కు 73 పైసలు అదనం
బిడ్డింగ్‌ లేకుండా పవన విద్యుత్‌ తీసుకునేలా నిర్ణయం

ఈనాడు, అమరావతి: క్విడ్‌ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలను కోర్టుకు వెళ్లేలా చేసింది. అందులో కొన్ని సంస్థలతోనే ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోబోతోంది. ఇదీ జగన్నాటకంలో ఒక భాగం. ప్రకృతి వనరులను దోచుకోవడం ఎలాగో తెలిసిన జగన్‌.. గాలినీ తన దోపిడీ కోసం వదల్లేదు. విద్యుత్‌ ప్రాజెక్టుల పీపీఏలను తనకు దగ్గరి కంపెనీతో కుదుర్చుకోవడానికి జగన్‌ ఇదే తీరు అనుసరించారు. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి విద్యుత్‌ తీసుకునేలా ఒప్పందాలు కుదుర్చుకోడానికి జగన్‌ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పీపీఏ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ ఆమోదానికి విద్యుత్‌ సంస్థలు పంపాయి. అధిక ధరకు విద్యుత్‌ తీసుకునేలా పీపీఏ కుదుర్చుకోవడంతోపాటు ఆ సంస్థకు పన్నుల మినహాయింపుల ద్వారా 25 ఏళ్లలో రూ.7,830 కోట్ల భారీ ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చబోతోంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ పీపీఏ ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి పంపడం విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా ఈ భారం వినియోగదారులపై పడనుంది. యూనిట్‌ రూ.2.80 చొప్పున తీసుకోవడానికి 2019లో యాక్సిస్‌ సంస్థతో 21 పీపీఏలు కుదుర్చుకునేలా జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత యూనిట్‌ ధర ఎక్కువగా ఉందని ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. మూడేళ్ల తర్వాత అదే సంస్థతో పీపీఏ కుదుర్చుకోవడానికి ఏపీఈఆర్‌సీ అనుమతి కోరింది. అప్పట్లో పీపీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన ఎందుకు తిరస్కరించినట్లు? ఎన్నికలకు కొద్ది నెలల ముందు యాక్సిస్‌ సంస్థకు స్కీం ఇంప్లిమెంటేషన్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌ఐఏ) ప్రకారం అన్ని ప్రయోజనాలు కల్పించాలంటూ ప్రభుత్వం ఎందుకు అనుమతించిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పోనీ.. గతంలో ప్రతిపాదించిన ధర కంటే తగ్గించి పీపీఏ చేసుకుంటుందా? అంటే అదీ కాదు. ఆ ధరకంటే యూనిట్‌కు అదనంగా 44 పైసలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం యాక్సిస్‌ సంస్థకు యూనిట్‌కు రూ.3.24 చొప్పున పీపీఏ వ్యవధి 25 ఏళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది.

ధరలోనూ తిరకాసు

పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన బిడ్డింగ్‌లలో యూనిట్‌ ధర సగటున రూ.3.25 నుంచి రూ.3.40 మధ్య ఉంది. ఈ ధరలను దృష్టిలో ఉంచుకుని యాక్సిస్‌ సంస్థ నుంచి యూనిట్‌ రూ.3.30కి తీసుకునేలా టారిఫ్‌ను నిర్దేశించాలని పీపీఏ ప్రతిపాదనల్లో ఇంధన శాఖ పేర్కొంది. 2022లో దేశంలో వివిధ బిడ్డింగ్‌ల్లో వేసిన ధరలను దృష్టిలో ఉంచుకుని యూనిట్‌కు రూ.3.24 చొప్పున తీసుకోవడానికి అనుమతించాలని కోరింది. ఆ ఏడాది పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు నిర్వహించిన బిడ్డింగ్‌లో గరిష్ఠంగా యూనిట్‌కు రూ.2.90 చొప్పున మాత్రమే ధర ఉంది. గతంలో తిరస్కరించిన పీపీఏలను తెరపైకి తీసుకురావడమే విమర్శలకు తావిస్తే.. యూనిట్‌ ధరను నిర్దేశించే విషయంలోనూ యాక్సిస్‌ సంస్థకు అయాచిత లబ్ధి చేకూర్చేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. బ్యాటరీ స్టోరేజీ అవకాశమున్న యూనిట్లకు నిర్దేశించిన టారిఫ్‌ ఆధారంగా యాక్సిస్‌ సంస్థ నుంచి తీసుకునే విద్యుత్‌కు అధిక ధర చెల్లించేలా జగన్‌ ప్రభుత్వం తెరవెనుక వ్యూహాన్ని అమలుచేసింది.

  • 2018లో కేంద్ర సంస్థ సెకి 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్వహించిన బిడ్డింగ్‌లో.. శ్రీజన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ 250 మెగావాట్లు, స్ప్రింగ్‌ ఎనర్జీ 300 మెగావాట్లు, బీఎల్‌పీ ఎనర్జీ 280 మెగావాట్లు, బేతమ్‌ విండ్‌ ఎనర్జీ 200 మెగావాట్ల ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. ఆ సంస్థలతో యూనిట్‌ రూ.2.51 చొప్పున విద్యుత్‌ విక్రయ ఒప్పందాన్ని సెకి కుదుర్చుకుంది. పాత ధరతో పోలిస్తే యూనిట్‌కు 73 పైసల చొప్పున జగన్‌ ప్రభుత్వం ఎక్కువ చెల్లిస్తున్నట్లే.
  • ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ రూ.3.24 చొప్పున తీసుకునేలా ప్రతిపాదిస్తే విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 62 ప్రకారం క్యాపిటల్‌ కాస్ట్‌ను నిర్దేశించాలని యాక్సిస్‌.. ఏపీఈఆర్‌సీని కోరింది. ఈ ప్రకారం యూనిట్‌కు కనీసం రూ.5 చొప్పున ధర నిర్దేశించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆ మొత్తానికి అంగీకరిస్తే ప్రజలపై భారం పెరగనుంది.

యాక్సిస్‌కు అదనపు లబ్ధి..రూ.7,300 కోట్లు!

యాక్సిస్‌ నుంచి 850 మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేలా పీపీఏ ప్రతిపాదన ప్రకారం.. ఏటా సుమారు 1,700 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారం పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో తీసుకోబోయే విద్యుత్‌ 42,500 ఎంయూలు. మార్కెట్‌ ధరలతో పోలిస్తే యూనిట్‌కు అదనంగా 73 పైసలు చెల్లించినట్లు భావిస్తే ఏటా రూ.124.10 కోట్ల వంతున 25 ఏళ్లలో పడబోయే అదనపు భారం రూ.3,102.5 కోట్లు. దశలవారీగా మిగిలిన 1,150 మెగావాట్ల ప్రాజెక్టులతో పీపీఏలు కుదుర్చుకుంటే ఏటా మరో రూ.167.90 కోట్ల చొప్పున పీపీఏ వ్యవధిలో మరో రూ.4,197.50 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది.


ఒకరికి ఒకలా.. యాక్సిస్‌కు మరోలా నిబంధనలు?

గ్రీన్‌కో సంస్థ కర్నూలులో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు 2018లో అప్పటి ప్రభుత్వం అనుమతించింది. 2,750 మెగావాట్ల సౌర, పవన, పీఎస్పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాన్ని అప్పట్లోనే కుదుర్చుకుంది. ఆ సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఎలాంటి పీపీఏ కుదుర్చుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వమిచ్చిన అనుమతులను కొనసాగిస్తూనే గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద మొదటి 25ఏళ్ల పాటు మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున, తర్వాత రూ.2 లక్షల చొప్పున చెల్లించాలని కోరింది. సంస్థ ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున 28 ఏళ్లు చెల్లించాలని పేర్కొంది. ప్రాజెక్టు కోసం సేకరించే 4,766 ఎకరాల కోసం.. ఎకరా రూ.రెండున్నర లక్షల చొప్పున గత ప్రభుత్వం నిర్దేశించిన ధరను సవరించి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని 2020 జూన్‌ 13న ఉత్తర్వులిచ్చింది.

ఇదే సమయంలో కేవలం ఎంవోయూ కుదుర్చుకున్న యాక్సిస్‌ ఉత్పత్తి చేసే విద్యుత్‌ తీసుకునేలా పీపీఏ కుదుర్చుకోవడం ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతోపాటు గ్రీన్‌టాక్స్‌ కింద మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున, సైట్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద ఎకరాకు రూ.50వేల వంతున చెల్లించాల్సిన మొత్తానికి మినహాయింపు ఇచ్చింది. పీపీఏ వ్యవధి 25 ఏళ్లలో గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద రూ.500 కోట్లు (2 వేల మెగావాట్ల ప్రాజెక్టులపై), సైట్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలు రూ.30 కోట్లు కలిపి మొత్తం రూ.530 కోట్ల ప్రయోజనాన్ని పరోక్షంగా కల్పించింది. యాక్సిస్‌ సంస్థతో మూడేళ్ల కిందట వద్దనుకున్న పీపీఏలు.. జగన్‌ ప్రభుత్వానికి ఇప్పుడు ముద్దుగా అనిపించాయి.


బిడ్డింగ్‌ ఎందుకు నిర్వహించడం లేదు?

ఆర్‌పీపీవో ఆబ్లిగేషన్‌కు మించి ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్‌ ఒప్పందాలు ఉన్నాయి. ఈ ప్రకారం పాత ఒప్పందాలను రద్దు చేసి బిడ్డింగ్‌లో ఎంపికైన ప్రాజెక్టులనుంచే విద్యుత్‌ కొనాలి. దీనివల్ల సంస్థల మధ్య పోటీతో తక్కువ ధరకు విద్యుత్‌ వచ్చే అవకాశం ఉండేది. ఆ నిబంధనలకు విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యాక్సిస్‌ సంస్థ నుంచి కొనుగోలుకు ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండానే ప్రభుత్వం అనుమతించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని