YS Jagan: సాక్షాత్తూ సీఎం దుష్ప్రచారం

వృద్ధులు, అసహాయులకు పింఛను పంపిణీలో ప్రభుత్వ చేతగానితనాన్ని సీఎం జగన్‌ ఏకంగా విపక్షాలపై నెట్టేశారు. అభాగ్యులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన బాధ్యతను విస్మరించారు.

Updated : 04 Apr 2024 08:01 IST

ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీరు వ్యవస్థను దూరం చేశాయని ఆరోపణ
చిత్తూరు జిల్లాలో సీఎం జగన్‌ ప్రసంగంలో కట్టుకథలు

ఈనాడు, చిత్తూరు: వృద్ధులు, అసహాయులకు పింఛను పంపిణీలో ప్రభుత్వ చేతగానితనాన్ని సీఎం జగన్‌ ఏకంగా విపక్షాలపై నెట్టేశారు. అభాగ్యులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన బాధ్యతను విస్మరించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సభలో ఆయన తన అమానవీయతను మరోసారి కప్పిపుచ్చుకున్నారు. ‘ప్రతినెలా ఒకటో తేదీన సెలవు, పండగ రోజైనా అవ్వాతాతల వద్దకు వెళ్లి వాలంటీర్లు పింఛన్లు ఇస్తూ వారి ముఖంలో చిరునవ్వు చూస్తున్నారు. మూడు రోజులుగా అవ్వాతాతలు పింఛన్ల కోసం పడుతున్న బాధలన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఈ పెద్దమనిషి చంద్రబాబు.. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి ఒత్తిడి తెచ్చి ఏకంగా వాలంటీరు అనే వాడు లేకుండా, ఆ వ్యవస్థే లేకుండా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నడవలేని వయసులో వృద్ధుల అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా? అని ప్రశ్నిస్తున్నా’ అని సీఎం జగన్‌ సభలో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకపోయినా చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా బుధవారం ఆయన చిత్తూరు జిల్లా సదుం మండలం అమ్మగారిపల్లె నుంచి పూతలపట్టు మండలం గోపాలకృష్ణాపురం వరకు రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం గోపాలకృష్ణాపురంలో బహిరంగ సభలో మాట్లాడారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్టు జగన్‌ ప్రసంగం సాగింది. జగనన్న వస్తే మళ్లీ వాలంటీరు నేరుగా మీ ఇంటికే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తాడని పేర్కొన్నారు. పూతలపట్టు కరవు ప్రాంతమని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌ ప్రస్తావించగా నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారన్న అంశాన్ని జగన్‌ కనీసం ప్రస్తావించలేదు. చిత్తూరు జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేస్తారనేది వెల్లడించలేదు. వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్‌ పరిచయం చేశారు. గంగాధరనెల్లూరు, నగరి, చిత్తూరు, కుప్పం, చంద్రగిరి నుంచి పోటీ చేయనున్న కృపాలక్ష్మి, రోజా, విజయానందరెడ్డి, భరత్‌, మోహిత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని