అసుర.. అసుర.. భూబకాసుర!

ఐదేళ్ల కిందట.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రంటే ఔననుకున్నారు ఆంధ్రాజనం! ఐదేళ్ల తర్వాత.. అర్థమైంది నాటి జగనన్న యాత్ర కష్టాలు తెలుసుకోవటం కోసం కాదు కబ్జాలు పెట్టడానికని! 

Updated : 18 Apr 2024 16:52 IST

ఐదేళ్ల కిందట.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్రంటే ఔననుకున్నారు ఆంధ్రాజనం!
ఐదేళ్ల తర్వాత.. అర్థమైంది నాటి జగనన్న యాత్ర కష్టాలు తెలుసుకోవటం కోసం కాదు కబ్జాలు పెట్టడానికని!
ఖాళీ స్థలాల్లో జెండా పాతడమే ఎజెండాగా.. కంకణం కట్టుకుని... అన్న అను‘చోరులంతా’ ఏకమై... పప్పుబెల్లాల్లా నీకిది.. నాకది అంటూ పంచుకున్నారు... అధికారమే అండగా.. అప్పనంగా సర్కారు స్థలాల్ని భూంఫట్‌ అన్నారు... ప్రైవేటు స్థలాలనూ పంచాయతీల పేరుతో స్వాహా చేశారు!

మహాభారతంలో ఉన్నది ఒక్కడే బకాసురుడు. మాయావి జగన్‌ రాజ్యంలోనేమో ఊరికొక బకాసురుడు! తడవకు బండెడు అన్నం, రెండు దున్నపోతులు, ఒక మనిషిని తిని తేన్చేవాడు నాటి బకాసురుడు. జగనన్న ఆశీస్సులతో జనం భూములను లెక్కపెట్టలేనంతగా మింగేసి బ్రేవ్‌మంటున్నారు నేటి వైకాపాసురులు. ‘‘రాష్ట్ర ప్రజలందరికీ తోడుగా ఉంటా’’ అని నమ్మకంగా అబద్ధాలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం కుర్చీలో కుర్చోగానే ముసుగు తీసేసిన జగన్‌- కబ్జాలరాయుళ్లకు కొంగు బంగారమయ్యారు.

భూమేతల్లో పెద్దతలకాయలు

రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతోందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొసలి కన్నీళ్లు కార్చారు జగన్‌. నిజానికి ఆయన సీఎం అయ్యాకే  ల్యాండ్‌ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఆ క్రమంలో విశాఖపట్నం చుట్టుపక్కల ఎన్నెన్ని భూములు వైకాపా ప్రేతగణాల పొట్టలోకి పోయాయో లెక్కేలేదు. విశాఖలో వైకాపా మూలవిరాట్టు కనుసన్నల్లో సాగిన భూబాగోతాల విలువ దాదాపు రూ.7,950 కోట్లు. ఆ అక్రమ వ్యవహారాల్లో రూ.1600 కోట్లు పెద్దతలకాయ జేబులో పడినట్లు చెబుతారు. స్థలాల స్వాహాయణంలో విశాఖ వైకాపా ప్రజాప్రతినిధి శైలే వేరు. రూ.500 కోట్ల విలువైన భూమిలో భారీ ప్రాజెక్టును చేపట్టిన ఆయన- సంబంధిత భూయజమానుల నెత్తిన చెయ్యిపెట్టారు. 15 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో రెండువేల ఫ్లాట్లు నిర్మిస్తున్న ఆ ప్రజాప్రతినిధి- భూయజమానులకు ఇస్తోంది కేవలం 14,400 చదరపు అడుగులు! యాజమాన్య హక్కుల్లోని లొసుగులను తనకు వాటంగా మార్చుకుని అతి ఖరీదైన భూములను జగన్‌ పార్టీ బడానేత గుటుక్కుమనిపించారు. విశాఖలోనే రుషికొండ ఒమ్మివానిపాలెంలో వందల కోట్ల రూపాయల విలువైన 18 ఎకరాలను వైకాపా నేతాసురులు ఆక్రమించారు. బంగారం లాంటి భూములను బోగస్‌ కాగితాలతో కబ్జా చేసే ముఠాలకూ జగన్‌ పార్టీ పాలుపోసింది. ఒంగోలులో అలాంటి ఓ ముఠా పాలబడినట్లు తెలిసిన స్థలాల విలువే రూ.200 కోట్ల వరకు ఉంది. భూములను మింగేసే భూతాల పాలనకు ప్రాణప్రతిష్ఠ చేసిన జగన్‌ కారణంగా గడచిన అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దోపిడీ పర్వాలెన్నో నిరాటంకంగా సాగిపోయాయి.


భూచోళ్లు బాబోయ్‌!

జగన్‌కు స్వతహాగా స్వార్థ ప్రయోజనాల యావే ఎక్కువ. దానికి తగినట్లే దుర్గుణాల్లో తనకు సరిజోడులైన వారికి నియోజకవర్గాలను రాసిచ్చారాయన. వాళ్లందరూ ఎక్కడికక్కడ బందిపోట్లుగా అవతరించి- ప్రజల ఆస్తులు, సహజ వనరులు, ఖాళీ జాగాలను వీలైనంతగా కొల్లగొట్టారు. పొద్దుపొద్దునే ‘గుడ్‌మార్నింగ్‌’ అంటూ రోడ్డెక్కే ఓ వైకాపా నేతాశ్రీ- అచ్చుగుద్దిన అధర్మమూర్తి. అనుభవదారులకు పదీ పరకా ఇచ్చి రూ.కోట్ల విలువైన ఎసైన్డ్‌ భూములను ఆయన భోంచేస్తుంటారు. ఆ రకంగా 300 ఎకరాలను సొంతం చేసుకున్నారు. సోలార్‌ ప్లాంటు ఏర్పాటుకు 106 ఎకరాలను సేకరించి ఒక కంపెనీకి అప్పగించింది గత ప్రభుత్వం. రాజ్యాధికారం జగన్‌ పార్టీ చేతికి చిక్కాక ఆ నియోజకవర్గ రారాజు దృష్టి ఆ భూములపై పడింది. కంపెనీ ప్రతినిధులను బెదిరించి మరీ రూ.100 కోట్లకు పైగా విలువైన స్థలాలను రూ.3.18 కోట్లకు కొట్టేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్‌ పార్టీ జాతిరత్నం ఇంకొకరు ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారుల నుంచి కమీషన్లు, విల్లాలతోపాటు పేదల భూములను గుంజుకోవడంలో ఆయన సాటిలేని మేటి తోపు! అక్రమార్కులపై అవ్యాజ ప్రేమానురాగాలను కురిపించే జగన్‌ పుణ్యమా అని అయిదేళ్లలో రూ.500 కోట్ల ఆస్తులను వెనకేసుకున్నారు ఆ నాయకులుంగారు. రోత బూతులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వంటి ఓ ప్రజాప్రతినిధి ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సొంత నియోజకవర్గంలో ఎకరాల కొద్దీ భూములను, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆయన ఆక్రమించుకున్నారు. పక్క నియోజకవర్గంలో కొండలను పొడికొట్టి కోట్లు వెనకేసుకున్నారు. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఒకరు భూఆక్రమణల్లో ఘనాపాఠి అని రాజంపేట మండలవాసులు ఇటీవలే కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. మందపల్లె రెవెన్యూ గ్రామంలో 100 ఎకరాలను ఆయన దిగమింగేశారని, మరోచోట సర్కారీ భూమిని సొంత ఎస్టేట్‌గా మార్చుకున్నారని జనం గళమెత్తారు.


హిరణ్యాక్షుడి వారసులు

జగన్‌ మార్క్‌ పరిపాలన అంటే- నేలతల్లిని చెరబట్టిన హిరణ్యాక్షుడి వారసుల స్వైరవిహారమే! జగన్‌ విధేయుల అండదండలతో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాల పాలయ్యాయి. అక్కడ రూ.150-170 కోట్ల విలువైన సర్కారీ జాగాలను పప్పుబెల్లాలా ఆరగించారు వైకాపా నేతలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులమంటూ కొద్దినెలల క్రితం కొందరు వచ్చి నెల్లూరులోని చైతన్య కాలనీ పార్క్‌ మీద పడ్డారు. రూ.12 కోట్ల విలువైన పార్క్‌ జాగాను దిగమింగడానికి వాళ్లు తప్పుడు పత్రాలూ తయారు చేశారు. తిరుపతి జిల్లాలో సెజ్‌ భూములను దర్జాగా తన పరం చేసుకున్నారొక జగన్‌ అంతేవాసి. శ్రీకాకుళం జిల్లా లోహరిబందలో యాభై ఎకరాల సర్కారీ స్థలాన్ని వైకాపా రాబందులు తన్నుకెళ్లిపోయాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల జాగాల్లోనూ జగన్‌ భక్తగణం పాగావేసింది. వినుకొండ వైకాపా ఎమ్మెల్యే ఎండీగా ఉన్న ఒక సంస్థ, మరో కంపెనీ కలిసి 175 ఎకరాల ఎసైన్డ్‌ భూములను ఆక్రమించాయని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆక్రమించుకున్న స్థలాలను బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.50కోట్లు తీసుకున్నారని కోర్టులో విచారణ సందర్భంగా పిటీషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. స్పందించిన హైకోర్టు- వైకాపా ఎమ్మెల్యేతో సహా మరికొందరికి నిరుడు నోటీసులిచ్చింది. జగన్‌ పార్టీ భూదందాల ప్రేరణతోనేమో రాష్ట్రంలోని ఒక ఉన్నతాధికారి సైతం ‘భూ’చోడి అవతారమెత్తారు. విశాఖ నగర శివార్లలో సాధారణ రైతులను నయానాభయానా దారికి తెచ్చుకుని రూ.2వేల కోట్లకు పైగా విలువైన భూములను కారుచవగ్గా కొట్టేశారాయన!


దేవుడి భూములా... దోచేయ్‌!

దేవాలయ భూములనూ జగన్‌ అనుచరగణాలు భారీగా దిగమింగేశాయి. పల్నాడులో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ మాన్యం భూముల్లో క్వార్జ్‌ ఖనిజాన్ని ఓ ఎమ్మెల్యే కొల్లగొట్టారు. దాదాపు 50వేల టన్నుల ఖనిజాన్ని తవ్వుకుని రూ.50 కోట్లకు పైగా ఆర్జించారు. గుడివాడలో రూ.20 కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమి కబ్జాకు వైకాపా నేతలు తెగబడ్డారు. ‘‘అన్న చెప్పారు. మేం షెడ్డు వేసుకుంటున్నాం. మీకు చేతనైంది చేసుకోండి’’ అంటూ అడ్డొచ్చిన వారిని బెదిరించారు. ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాలస్వామి, శ్రీవల్లీ భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన 70 ఎకరాలు పెద్దల పరమయ్యాయి. రూ.120 కోట్లకు పైగా విలువైన ఆ స్థలాలను ఆక్రమించుకుని, రిజిస్ట్రేషన్లు చేయించుకుని, ఏకంగా భవంతులే కట్టేసుకున్నారు. ‘‘గుడినీ గుడిలో లింగాన్నీ మింగేస్తున్నారు’’ అంటూ విపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ గుండెలు బాదుకున్నారు. ఆయన మాటలను తూ.చ.తప్పకుండా పాటించి సర్వం స్వాహాచేసింది వైకాపా ప్రబుద్ధులే. తాడేపల్లిగూడెం బాల వేంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కబ్జాచేసిన జగన్‌ పార్టీ నేత- అందులో వాణిజ్య సముదాయం నిర్మించారు. దేవాలయ స్థలంలోని ఆ అక్రమ కట్టడంలోనే జగన్‌ ప్రభుత్వ మద్యం దుకాణాన్ని పెట్టారు. ఇంతకంటే మహాపాపం ఉంటుందా?


దళితుల ఆస్తులూ కబ్జా!

‘నా ఎస్సీలు...’ అంటూ దళితులపై ఎక్కడి లేని ప్రేమను ఒలకబోస్తుంటారు జగన్‌. ఆయన పార్టీ పెద్దమనుషులేమో ఊళ్లలో దళితుల భూములను యమదర్జాగా కాజేస్తుంటారు. అయిదేళ్లుగా ఇదే వరస! తిరుపతికి సమీపంలో పాతిక మంది దళితులకు చెందిన రూ.10 కోట్ల విలువైన భూములను జగన్‌ పార్టీ నేతలు గుప్పిట పట్టారు. అన్నమయ్య జిల్లా మందడంలో దళితుల అనుభవంలో ఉన్న దాదాపు వంద ఎకరాలను వైకాపా పెత్తందారులు కైవసం చేసేసుకున్నారు. తెర ముందు ఒక స్థిరాస్తి వ్యాపారి... తెర వెనక ముగ్గురు ప్రజాప్రతినిధులు... ఆ నలుగురూ కలిసి కర్నూలు శివారులోని మునగాలపాడులో రూ.200 కోట్ల విలువైన భూమికి టెండర్‌ పెట్టారు. జాతీయ రహదారికి దగ్గర్లోని ఆ రెండొందల ఎకరాలను వందేళ్లుగా దళితులు సాగుచేసుకుంటున్నారు. వారి నుంచి ఆ భూములను గుంజుకోవడానికి ప్రజాప్రతినిధుల సాయంతో స్థిరాస్తి వ్యాపారి పథక రచన చేశారు. గుంటూరు జిల్లా అనమర్లపూడిలో దళితులకు చెందిన రూ.15 కోట్ల విలువైన భూములను జగన్‌ పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు స్వాహాచేశారు. ‘జీర్ణం.. జీర్ణం.. జగనన్న దయతో సర్వం జీర్ణం’ అనుకుంటూ వైకాపా నేతలు ఊరూరా ఇలాగే పేట్రేగిపోయారు.

కొండలు, గుట్టలు, కాల్వగట్లు, జలవనరులు... దేన్నీ విడిచిపెట్టకుండా ఆక్రమణలకు పాల్పడ్డారు. చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరగని స్థాయిలో జగన్‌ ఏలుబడిలో భూదోపిడీ చోటుచేసుకుంది. కానీ, ఆయన ఏమో రాష్ట్రానికి తాను చేసినంత మేలు మరెవరూ చేయలేదంటూ గప్పాలు కొడుతున్నారు. కానీ, నోటికి నెత్తురు అంటించుకున్న తోడేలు వచ్చి ‘నేను శాకాహారిని’ అంటే ఎవరు నమ్ముతారు?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని