పండుటాకులపై పగ

ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు.

Updated : 04 Apr 2024 10:06 IST

పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తున్న యంత్రాంగం
మండుటెండల్లో అభాగ్యుల ఆపసోపాలు
సర్కారు కర్కశ నిర్ణయాలు.. ఆపై విపక్షాలపై అపనిందలు
వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం
చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి

ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది! వైకాపా వికృత రాజకీయ క్రీడలో ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ వంతు పాత్ర సమర్థంగా పోషించారు. వృద్ధులు మండుటెండల్లో పింఛను కోసం పడిగాపులు కాచేలా చేశారు. వారు ఇబ్బందులు పడుతుంటే.. నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు. ఎన్ని విమర్శలు వచ్చినా బేఖాతరు చేస్తూ ప్రజల ప్రయోజనాలకంటే అధికార పార్టీతో అంటకాగడమే ముఖ్యమని చాటిచెప్పారు. నిజంగా తలచుకుంటే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 1, 2 రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేసేంత విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ అడుగు వేయలేదు. ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తున్న అధికారులు.. వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల పింఛనుదారులను సచివాలయాల వద్దకు రప్పించారు. వారికి కష్టనష్టాలు పెట్టి మానవత్వం లేకుండా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగానికి సారథిగా, ఎన్నికల సమయంలోనైనా ప్రజాప్రయోజనాలే పరమావధిగా పనిచేయాల్సిన సీఎస్‌ జవహర్‌రెడ్డి అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తే ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డి, శశిభూషణ్‌కుమార్‌ వంటి అధికారుల గురించి చెప్పాల్సిన పనేలేదు! తమ పంతం నెగ్గించుకోవడానికి బడుగు జీవులను బలిపశువులను చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగారు. నెపం మొత్తాన్ని విపక్షాలపైకి నెట్టేసి ప్రజల దృష్టిలో వారిని దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. తెదేపాపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే.ఉన్నతాధికారులు ఒక పార్టీకి  కొమ్ముకాస్తుంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తుండటమేంటి? అధికారంలో ఉన్న పార్టీ ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి విపక్షాలపై బురదజల్లుతుంటే ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా సీఎస్‌కు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? వైకాపాపై అభిమానాన్ని చాటుకోవడానికి ఏమాత్రం వెనకాడని అధికారులను అవే పోస్టుల్లో కొనసాగిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎలా జరుగుతాయి? అన్న ప్రశ్నలు వివిధ వర్గాలనుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేసి వారిపై విద్వేషాన్ని రేకెత్తించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర పన్నడం, దీనికి ఉన్నతాధికారులు సహకరించడం ఓటర్లను ప్రభావితం చేయడమేనని.. ఎన్నికల సంఘం తక్షణం స్పందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేకపోతే రాబోయే 40 రోజుల్లో మరిన్ని అరాచకాలు చూడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సినిమా హాళ్లు, మద్యం దుకాణాల వద్ద డ్యూటీలు వేసినప్పుడేమైంది?

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కక్షగట్టిన జగన్‌ ప్రభుత్వం ఆయన నటించిన భీమ్లానాయక్‌ సినిమా టిక్కెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతించలేదు. సరికదా.. థియేటర్ల యాజమాన్యాలు ఎక్కడ ధరలు పెంచేస్తాయోనని రెవెన్యూ అధికారులతో నిఘా పెట్టించింది. వారికి థియేటర్ల వద్ద డ్యూటీలు వేసింది. దేశంలో ఎక్కడా చూడనట్టు మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ పెద్దలు తానా అంటే తందానా అనే ఉన్నతాధికారులు.. వారికి అవసరమైనప్పుడు ఉద్యోగులను ఎలాంటి పనులకైనా వాడేస్తారు. కానీ అభాగ్యులకు పింఛన్లు ఇచ్చేందుకు మాత్రం సరిపడా ఉద్యోగులు లేరని చెబుతున్నారు. 1.27 లక్షల మంది వార్డు, గ్రామసచివాలయాల ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వేసవి, ఎన్నికల దృష్ట్యా వారిపై అంత పని ఒత్తిడేమీ లేనప్పటికీ వారితో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయించేందుకు ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. సచివాలయాల్లోని వ్యవసాయ, అనుబంధ రంగాల ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, వార్డు కార్యదర్శులు తీరిక లేకుండా ఉన్నారని.. వారికి పింఛన్ల పంపిణీ అప్పగించలేమనే వింత వాదన తెరపైకి తెచ్చారు. సీఎస్‌ సహా ఉన్నతాధికారులంతా ప్రతి దశలోను పింఛనుదారులను సచివాలయాలకు రప్పించి ఎలా ఇబ్బంది పెట్టాలి? విపక్షాల్ని దోషులుగా ఎలా నిలబెట్టాలి? తద్వారా అధికార వైకాపాకు ఎలా మేలు చేయాలని ఆలోచించారే తప్ప ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంచేందుకున్న అవకాశాలపై దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి.

అధికారులకు చీమకుట్టినట్టూ లేదా?

ఎన్నికల్లో లబ్ధి కోసం వైకాపా నాయకులు ఎంతకైనా దిగజారుతారని పింఛన్ల పంపిణీ వ్యవహారంతో మరోసారి రుజువైంది. మరి అధికారులకు ఏమైంది? ఓటర్లను ప్రభావితం చేస్తున్న వాలంటీర్లను నియంత్రించాల్సిన బాధ్యతను సీఎస్‌ సహా మిగతా అధికారులు విస్మరించడం వల్లే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. వాలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. ఎన్నికల సంఘం ఆదేశాల స్ఫూర్తిని అర్థం చేసుకుని ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా నిర్వహించేందుకు వ్యవస్థలను కట్టుదిట్టం చేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకుల్లా వ్యవహరించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమేనని సర్వీసులో చాలా జూనియర్లయిన జిల్లా కలెక్టర్లే చెబుతుంటే.. సీనియారిటీ కలిగి పదవీ విరమణకు దగ్గరలో ఉన్న సీఎస్‌ వంటి సీనియర్‌ అధికారులకేమైంది? రాష్ట్రంలో 65.92 లక్షల మంది పింఛనుదారులుంటే వారిలో 34.18 లక్షల మంది వృద్ధులే! అన్ని లక్షల మంది ఎండల్లో మాడిపోయే పరిస్థితి కల్పించిన ఉన్నతాధికారులకు మనస్సాక్షి ఉందా? మానవత్వమన్న పదానికి వారికి అర్థం తెలుసా? అన్న విమర్శలు వస్తున్నాయి. బుధవారం పింఛన్ల పంపిణీ తొలి రోజు వృద్ధులు అనేక ఇబ్బందులుపడ్డా దిద్దుబాటు చర్యలు లేవు. రాష్ట్రంలో గురువారం 130 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 250 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థ హెచ్చరికలనే బేఖాతరు చేస్తూ పంపిణీని కొనసాగించేందుకు అధికారులు మొండిపట్టుతోనే వ్యవహరిస్తున్నారు. అందుకే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలివ్వాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.


వైకాపా వారు.. ఉదయాన్నే వృద్ధులు, నడవలేని వారి ఇళ్లకు వెళ్లి నల్ల జెండాలు చేతుల్లో పెట్టారు.. వారిని మంచాలు, వీల్‌ఛైర్లపై ఉంచి సచివాలయానికి వెళ్తున్నామంటూ... ఊరేగింపుగా తీసుకెళ్లారు. వీడియోలు తీశారు. ఊరూపేరూ లేని ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయడానికి ప్రయత్నించారు.


వృద్ధుల్ని, అనారోగ్యంతో ఉన్నవారిని మంచాలపై ఊరేగిస్తూ...

జగన్‌ ప్రభుత్వం ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయలేదు సరికదా.. బుధవారం ఉదయం నుంచి వైకాపా కార్యకర్తలు, నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ నాటకానికి తెరతీసింది. మంచంపై నుంచి లేవలేని వృద్ధులు, చక్రాల కుర్చీల నుంచి కదల్లేని దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, నడవలేని వాళ్లను మంచాలపై ఉంచి వైకాపా నాయకులు, కార్యకర్తలే రోడ్లపైకి తీసుకొచ్చారు. వాళ్లను ఊరేగిస్తున్నట్లు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని వీళ్ల కష్టాలకు ప్రతిపక్ష తెదేపానే కారణమంటూ రోజంతా దుష్ప్రచారం కొనసాగించారు. జగన్‌ అనుకూల మీడియాలో వాటిని పదేపదే చూపిస్తూ గోబెల్స్‌ ప్రచారం చేశారు. ‘సచివాలయాల వద్దకు వెళ్లి పింఛను లబ్ధిదారులు పడుతున్న కష్టాల్ని ఫొటోలు, వీడియోలు తీసి వాటిని మీ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేయండి’ అంటూ వైకాపా సోషల్‌ మీడియా విభాగం.. వాట్సప్‌ గ్రూపుల్లో తమ శ్రేణులందరికీ ఆదేశాలిచ్చి మరీ ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తెగబడింది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానపడినవారు, వీల్‌ఛైర్‌కే పరిమితమైన వారికి ఇంటి దగ్గరే పింఛను ఇవ్వాలని నిబంధన ఉన్నా... వారందర్నీ రోడ్లపైకి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేసిన పాపం వైకాపాదే. మరోవైపు మండుటెండుల్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సచివాలయాల వద్దకు నడుచుకుంటూ వెళ్లి, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ తగిన సదుపాయాల్లేక సొమ్మసిల్లి పడిపోయారు. కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం ఈ నేరాలకు పాల్పడ్డ వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టడాన్ని చూస్తే ఊసరవెల్లులూ సిగ్గుతో తలదించుకుంటాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని