వైకాపా శవ రాజకీయం

పండుటాకుల చావులతో లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది. మరికొన్నాళ్ల పాటు ప్రశాంతంగా బతకాల్సినవాళ్లను సైతం తన అధికార పీఠాన్ని కాపాడుకోవటం కోసం.. చనిపోయే దారుణ పరిస్థితులు కల్పించిన జగన్‌ గ్యాంగ్‌ ఆ నేరాన్ని ప్రతిపక్షాలకు అంటగడుతోంది.

Published : 04 Apr 2024 04:13 IST

తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్లు రాలేదని దుష్ప్రచారం
మండుటెండలో వృద్ధుల్ని మంచాలపై ఊరేగిస్తూ సచివాలయాలకు తీసుకెళ్లిన వైనం
ఎండదెబ్బకు తాళలేక చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి ప్రతిపక్షాలపై నీచరాజకీయం

ఈనాడు, అమరావతి: పండుటాకుల చావులతో లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది. మరికొన్నాళ్ల పాటు ప్రశాంతంగా బతకాల్సినవాళ్లను సైతం తన అధికార పీఠాన్ని కాపాడుకోవటం కోసం.. చనిపోయే దారుణ పరిస్థితులు కల్పించిన జగన్‌ గ్యాంగ్‌ ఆ నేరాన్ని ప్రతిపక్షాలకు అంటగడుతోంది. గత ఎన్నికల ముందు కోడికత్తి దాడి, బాబాయ్‌పై గొడ్డలి వేటుతో సానుభూతి నాటకాన్ని రక్తికట్టించి అప్పుడు అధికారంలో ఉన్న తెదేపాపై బురదచల్లిన జగన్‌.. అయిదేళ్ల తర్వాత మళ్లీ అదే కుతంత్రాన్ని, కుటిల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఆయన రాజకీయ స్వార్థానికి ఈసారి నిరుపేదలైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బలైపోతున్నారు. వారందరికీ ఇంటి వద్దకెళ్లి పింఛను పంపిణీ చేసేందుకు కావాల్సిన ప్రభుత్వ యంత్రాంగమున్నా.. లబ్ధిదారులంతా పింఛను కోసం గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే రావాలంటూ ప్రకటనలిచ్చి మంచం దిగలేని ముసలివారు, నాలుగడుగులు వేయలేని దివ్యాంగులు, ఆదరణ లేని మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు.. ఇలా లక్షలమంది నిస్సహాయులను మండుటెండల్లో రోడ్లపైకి వచ్చేలా చేసి వారి ఉసురు తీస్తున్నారు. ఆ పాపాన్ని ప్రతిపక్షానికి అంటగట్టేందుకు వైకాపా నాయకులు విషప్రచారానికి తెరలేపారు. 

అధికారం కోసం ఇంత దిగజారుడుతనమా?

వైకాపా నాయకులు బుధవారం వ్యవహరించిన తీరు చూస్తే అధికారం కోసం ఇంతలా దిగజారిపోవాలా? ఇన్ని నీచ రాజకీయాలకు పాల్పడాలా? అనిపించక మానదు. పింఛన్లను వాలంటీర్లతో పంపిణీ చేయించొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతే తప్ప ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వొద్దని చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇంకా అవసరం అనుకుంటే రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల ఉద్యోగుల్ని వినియోగించుకుని ఉంటే  ఈపాటికే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను పంపిణీ కనీసం 80 శాతం పూర్తయిపోయి ఉండేది. కానీ తొలి నుంచీ శవరాజకీయాన్నే తమ పేటెంట్‌ హక్కుగా మార్చుకున్న జగన్‌ అండ్‌ కో.. ఇంటి వద్దకు పింఛను పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు సచివాలయాల వద్దకు రావాల్సిందేనంటూ ప్రకటించారు. ఎన్నికల సంఘానికి తెదేపా ఫిర్యాదు చేయటం వల్లే ఇంటి వద్దకు పింఛను రావట్లేదంటూ రెండు రోజులుగా అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి తెదేపా అసలు ఫిర్యాదే చేయలేదు. పైగా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ జరిగేలా చూడాలని, 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి తెదేపా నాయకులు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు కూడా ఈ మేరకు లేఖ రాశారు.


ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే!

రాజకీయ దురుద్దేశంతో.. ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయని జగన్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల నలుగురు వృద్ధులు మృతి చెందారు. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం నెరబైలుకు చెందిన షేక్‌ అసంసాహెబ్‌ (75) పింఛను కోసం సచివాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం కావడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన కూర్చున్న చోటే సొమ్మసిల్లి కన్నుమూశారు. సూళ్లూరుపేటకు చెందిన ఈశ్వరవాక లలితమ్మ(56) వితంతు పింఛన్‌ కోసం వార్డు సచివాలయానికి వెళ్లగా పంపిణీ ఆలస్యమైంది. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన నల్లవీరంరెడ్డి రాజమ్మ (84) సచివాలయానికి పింఛను కోసం వెళుతూ కళ్లుతిరిగి పడిపోయారు. స్థానికులు ఇంటికి తీసుకెళ్లేటప్పటికే ఆమె కన్నుమూశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80) కూడా పింఛను కోసం మండుటెండలో రెండుసార్లు తిరిగి, ఇంటికి వచ్చాక ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వయోవృద్ధులకు ఇళ్ల వద్దే పింఛను ఇచ్చి ఉంటే వీరు చనిపోయి ఉండేవారా? దీన్ని ప్రభుత్వం చేసిన హత్య అనకపోతే మరేమనాలి? పైగా పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ ఆ మృతదేహం వద్ద వాలిపోయి శవరాజకీయాలు చేయాలని చూడడం దారుణం. అలాగే, రెండు రోజుల కిందట తిరుపతి జిల్లా వెంకటగిరిలో బొడిచర్ల వెంకటయ్య (80) అనే వృద్ధుడు సాధారణ మరణం చెందగా.. దానికి పింఛనుతో ముడిపెట్టి ప్రతిపక్ష తెదేపాపై బురద చల్లేందుకు వైకాపా నాయకులు కుటిలయత్నం చేశారు. తాము చెప్పినట్లు చెప్పాలంటూ మృతుడి కుటుంబీకులకు వైకాపా, నాయకులు, వాలంటీరు, సాక్షి విలేకరులు తర్ఫీదు ఇచ్చారు. ఇది శవరాజకీయం కాదా? ప్రతిపక్షంపై రాజకీయ దుష్ప్రచారం కోసం అవ్వాతాతల్ని ఇంతలా ఇబ్బంది పెట్టాలా? వారి ప్రాణాలతో చెలగాటమాడాలా? రాజకీయ స్వార్థం కోసం వృద్ధులు, దివ్యాంగులతో ఆటలాడుకోవటం మానవత్వమేనా? పైగా దాన్ని ప్రతిపక్షాలకు అంటగట్టటం ఇంకో వికృత రాజకీయ క్రీడ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని