అధికార పార్టీ నేతల ఉక్కిరిబిక్కిరి

ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులు, సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంతో వారిచ్చిన హామీలు నెరవేర్చలేదని నిలదీస్తున్నారు.

Published : 04 Apr 2024 04:15 IST

ఎన్నికల ప్రచారంలో సమస్యలపై ప్రజల నిలదీత

గుడివాడ(నెహ్రూచౌక్‌), న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులు, సిటింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంతో వారిచ్చిన హామీలు నెరవేర్చలేదని నిలదీస్తున్నారు. తాగునీటి కొరత, అధ్వాన రహదారులు తదితర సమస్యల పరిష్కారం ఎక్కడని నిలదీస్తున్నారు. వారికి సమాధానాలు చెప్పలేక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గుడ్‌మెన్‌పేటలో ఎమ్మెల్యే కొడాలి నానికి మంగళవారం రాత్రి అలాంటి పరిస్థితే ఎదురైంది. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, జనవరి నుంచి తిప్పిస్తున్నారని స్థానిక దళిత మహిళలు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే నాని ఆర్డీవో పద్మావతికి ఫోన్‌ చేసి, పాత తేదీలతో పట్టాలు ఇచ్చేయొచ్చుగా అని చెప్పగా, కోడ్‌ ఉన్నందున ఇవ్వలేమని ఆమె బదులిచ్చారు. ఏం లేదమ్మా? ఏదోలా చూడండి.. పార్టీ తరఫున మేం పంచుతాంగా అని అన్నప్పటికీ ఆర్డీవో అంగీకరించలేదు. దీంతో ఆయన కలెక్టర్‌ను మీరే పంపించేశారుగా అని వెటకారంగా అన్నారు. పట్టాల విషయంలో మహిళలు ఎంతకీ తగ్గకపోవడంతో ఆయన నేలపై కూర్చొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానికులు రహదారుల దుస్థితిని ప్రస్తావించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొయ్యలగూడెం మండలం కుంతలగూడెంలో అడ్డుకున్నారు. తమ గ్రామంలో నిర్మిస్తామన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏమైందని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో ప్రచారానికి వచ్చిన కొవ్వూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావును రోడ్ల దుస్థితిపై ఓ మహిళ నిలదీసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని