సంక్షిప్త వార్తలు(9)

సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని గురువారం నుంచి ఉదయం 7 గంటల నుంచే చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశించారు.

Updated : 04 Apr 2024 06:02 IST

నేటి నుంచి ఉదయం  7 గంటల నుంచే పంపిణీ

ఈనాడు, అమరావతి: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని గురువారం నుంచి ఉదయం 7 గంటల నుంచే చేపట్టాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశించారు. వడగాడ్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం 25.66 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, మంచాన ఉన్న వారికి ఇళ్ల వద్దే తప్పనిసరిగా పంపిణీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌లో నారాయణ విద్యార్థుల ప్రతిభ

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని నేషనల్‌ స్పేస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ నీల్‌ స్పేస్‌ సెటిల్‌మెంట్‌ కాంటెస్ట్‌ 2024లో తమ విద్యార్థులు సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు డా.పి.సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వేల విద్యాసంస్థలు పాల్గొనే సైన్స్‌ ప్రాజెక్టుల్లో మొదటి స్థానంలో 2, రెండో స్థానంలో 5, మూడో స్థానంలో 7 ప్రాజెక్టులు తమ విద్యార్థులవేనని పేర్కొన్నారు. మొత్తం 34 ప్రాజెక్టుల్లో విజయకేతనం ఎగువేసినట్లు వివరించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటెస్ట్‌లో శ్రీచైతన్య విద్యార్థుల హవా

అమెరికాలోని ఎన్‌ఎస్‌ఎస్‌ స్పేస్‌ కాంటెస్ట్‌ 2024లో మొత్తం మూడు క్యాష్‌ అవార్డుల్లో 2 శ్రీచైతన్య విద్యార్థులు వరుసగా రెండో సంవత్సరం కూడా పొందినట్లు విద్యాసంస్థల డైరెక్టర్‌ సీమ బుధవారం తెలిపారు. సుమారు 28కుపైగా దేశాల నుంచి విద్యార్థులు పాల్గొన్న పోటీలో ప్రపంచ మొదటి ప్రైజ్‌-7 ప్రాజెక్టులు, రెండో ప్రైజ్‌- 11, మూడో ప్రైజ్‌- 15, ప్రోత్సాహక- 29 కలిపి మొత్తం 62 ప్రాజెక్టులు విజయం సాధించినట్లు పేర్కొన్నారు.


మధ్యాహ్న భోజనం చిక్కీల బకాయి రూ.52 కోట్లు

ఈనాడు, అమరావతి: మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీల బిల్లులను గత ఏడాది అక్టోబరు నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదు. కోడిగుడ్లు, చిక్కీలకు కలిపి ఫిబ్రవరి నెల వరకు రూ.189 కోట్ల బకాయిలు పేరుకుపోగా ఇందులో చిక్కీల బకాయి రూ.52.44 కోట్లుగా ఉంది. బకాయిలు చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా ఉండటం లేదని గుత్తేదార్లు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.


కృష్ణా ట్రైబ్యునల్‌ కేసు మే 8కి వాయిదా

ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌కు కొత్త విధివిధానాలను నిర్దేశిస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మే 8వ తేదీకి వాయిదా పడింది. మార్చి 13వ తేదీన 20వ నెంబర్‌లో లిస్ట్‌ అయిన కేసు ప్రస్తుతం 142వ నెంబర్‌కు వెళ్లిపోయిన నేపథ్యంలో త్వరగా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్త జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం ముందు బుధవారం ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టినందున పిటిషన్‌కున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా విచారణ తేదీ ఇవ్వాలని కోరారు. ఈ వాదనలను తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ తోసిపుచ్చారు. ఇది వరకే ఈ విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకొని, ట్రైబ్యునల్‌ ముందు జరిగే వాదనల్లో ఏపీ ప్రభుత్వం పాల్గొనవచ్చని చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకూ వాళ్లు సమస్యలకు సంబంధించిన స్టేట్‌మెంట్స్‌ కూడా దాఖలు చేయలేదని నివేదించారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌.. పిటిషన్‌ను మే లేదా జులైలో వింటామని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరగా అందుకు అవకాశం లేదని చెప్పి మే 8వ తేదీకి వాయిదా వేశారు.


త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయండి
కృష్ణాబోర్డుకు ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ఈ నెల 4న జరగాల్సి ఉన్న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ మేరకు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని కోరారు. ఇప్పటికే తెలంగాణకు కేటాయించిన నీళ్ల కన్నా ఎక్కువగా ఉమ్మడి జలాశయాల నుంచి వినియోగించుకున్నందున ఇక మీదట వారు నీళ్లు వాడుకోకుండా చూడాలని కూడా ఆ లేఖలో కోరారు. సాగర్‌ కుడి కాలువకు ఏప్రిల్‌ 8 నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని 11 రోజుల పాటు విడుదల చేయాలని కూడా ఈఎన్‌సీ కోరారు.


‘అభివృద్ధితో సంక్షేమం - సుపరిపాలనకు సవాళ్లు’ అంశంపై చర్చాగోష్ఠి 6న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఆధ్వర్యంలో ‘అభివృద్ధితో సంక్షేమం - సుపరిపాలనకు సవాళ్లు’ అనే అంశంపై ఈనెల 6న చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో జరగనున్న గోష్ఠికి ప్రధాన వక్తగా ప్రముఖ ఆర్థికవేత్త, ఎకనమిక్‌, పొలిటికల్‌ వీక్లీ ఎడిటర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ హాజరుకానున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి, సీఎఫ్‌డీ ఉపాధ్యక్షుడు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, పూర్వ ఎస్‌ఈసీ, సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ప్రసంగిస్తారని ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.


బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రావిరాల మహేశ్‌కుమార్‌ బుధవారం వెల్లడించారు. జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 35,629 మంది హాజరయ్యారని తెలిపారు. అంబేడ్కర్‌ గురుకులాల్లో బాలికలకు 9,280, బాలురకు 4,280 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ఖర్చుకు మార్గదర్శకాల విడుదల

ఈనాడు, అమరావతి: 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. శాసనసభలో ఆమోదించిన మొత్తాలకు మించి  తొలి నాలుగు నెలల్లో ఏ ప్రభుత్వ శాఖ కూడా ఖర్చు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ఉండిపోయిన బిల్లులను కొత్త ఆర్థిక సంవత్సరంలోకి బదిలీ చేయాలని కూడా పేర్కొన్నారు.


జూనియర్‌ కళాశాలలకు వేసవి సెలవులు మే 31వరకు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. కళాశాలలు జూన్‌ ఒకటి నుంచి పునఃప్రారంభమవుతాయని ప్రకటించింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి వేసవి సెలవులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. వేసవి సెలవుల్లో కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్‌ ఆదేశించారు. ప్రవేశాలకు బోర్డు ఎలాంటి షెడ్యూల్‌ విడుదల చేయకపోయినా కొన్ని ప్రైవేటు కళాశాలలు ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని