జగన్‌ అనుయాయులకు రూ.వేల కోట్లు

జగన్‌ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్‌ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు.

Published : 04 Apr 2024 05:24 IST

ఖజానా ఖాళీ... పేదలు బలి
మార్చి 30, 31 తేదీల్లో రూ.7,200 కోట్లు పెద్దలకు
పెన్షన్లకు కావాల్సింది రూ.1,900 కోట్లే
పెద్దల కోసం పేదలకు కష్టాలు

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వం రూ.వేల కోట్లను తన పెత్తందారీ అనుయాయులకు పంచేసి పేదలకు పెన్షన్‌ సొమ్ము లేకుండా ఖజానా ఖాళీ చేసేసింది. ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితరులకు పెన్షన్లు పంచవలసి ఉన్నా అందుకు తగ్గట్టుగా నిధులు సర్దుబాటు చేయలేదు. చేతిలో ఉన్న రూ.వేల కోట్లను జగన్‌ ప్రభుత్వానికి అనుకూలమైన బడా గుత్తేదారులకు, ఇతరులకు బిల్లుల రూపంలో పంచేశారు. ఇలా పంచే క్రమంలోనూ ఆర్థిక నిబంధనలను సైతం వైకాపా ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పెన్షన్లు పంచలేకపోయింది. నిధులను సర్దుబాటు చేయలేక బుధవారం (3వ తేదీన) కూడా పూర్తిస్థాయిలో పింఛన్లు పంచలేకపోయింది. ఆయా పంచాయతీలకు అవసరమైన నిధులను జగన్‌ ప్రభుత్వం బుధవారం కూడా ఇవ్వలేకపోయింది. దీంతో పెన్షన్ల కోసం గ్రామ సచివాలయాలకు వెళ్లిన వృద్ధులు, దివ్యాంగులు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

పెద్దల కోసమే..

సాధారణంగా మాసాంతంలో (చివరి రెండు రోజుల్లో) ఆర్థికశాఖ పెన్షన్ల కోసం నిధులను సెర్ప్‌ అధికారులకు బదిలీ చేస్తుంది. ఆ సొమ్మును పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు గ్రామాలకు బదిలీ చేస్తారు. జగన్‌ ప్రభుత్వం ఉన్న డబ్బును పెన్షన్లకు సర్దుబాటు చేయకుండా ఆర్థిక సంవత్సరం ముగుస్తోందన్న కారణంగా తమకు అనుకూలంగా ఉండే పెద్దగుత్తేదారులకు ఆ సొమ్మును పంచేసింది. అందుకోసమే బ్యాంకులకు సెలవులు అని ముందే చెప్పి ఏప్రిల్‌ 3 వరకు పెన్షన్లు అందబోవని ప్రకటించింది. 2022లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్న తరుణంలో ముందే ఏర్పాట్లు చేసుకుని ఆ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీనే పెన్షన్లు పంచారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉన్న సొమ్మును బడాబాబులకు పంచేశారు. మార్చి 30న ప్రభుత్వం ఏకంగా రూ.6,000 కోట్లు బిల్లుల రూపంలో చెల్లించింది. ఆ రోజు పెన్షన్ల కోసం సొమ్ము బదిలీ చేయలేదు. మార్చి 31న మరో రూ.1,200 కోట్లు కూడా పెద్దలకే చెల్లించింది. ఈ బిల్లుల చెల్లింపుల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పేదలకు మాత్రం బుధవారం సాయంత్రం వరకూ కూడా పూర్తిస్థాయిలో పెన్షన్లు అందలేదు.

పేదల కన్నా పెత్తందారులే ముఖ్యమా?

ముఖ్యమంత్రి జగన్‌ నోరు విప్పితే చాలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం అని అంటుంటారు. తాను పేదల పక్షమని చెబుతుంటారు. కానీ అసలు సమయం వచ్చేసరికి తాను పెత్తందారుల పక్షమే అని తాజా ఉదంతంతో నిరూపించుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇష్టమైన వారికి బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు తక్కువ. అందుకే ఉన్న నిధులన్నీ, తన అనుయాయులకు పందేరం చేసేశారు. నెలాఖరులో చివరి రెండు రోజుల్లో రూ.7,200 కోట్లు ఇలా చెల్లిస్తే.. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత దాదాపు రూ.14 వేల కోట్లు ఇష్టారీతిన సీఎం జగన్‌ పెత్తందారులైన తన అనుచరులకు బిల్లుల రూపంలో ఇప్పించేశారు. సాధారణంగా ఏ కుటుంబమైనా అవసరాలకు తగ్గట్టుగా ఉన్న నిధులను ఎలా ఖర్చు చేయాలో ప్రణాళిక రూపొందించుకుంటుంది. ఏప్రిల్‌ 1న సామాజిక పెన్షన్ల కోసం సుమారు రూ.1,900 కోట్లు చెల్లించాలన్న సంగతి జగన్‌ ప్రభుత్వానికి తెలుసు. ఈ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నెలాఖరులో వచ్చిన సొమ్మును దాచి పెన్షన్ల కోసం వెచ్చించి ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని