పింఛను పంపిణీలో అడుగడుగునా వైఫల్యం

పింఛనుదారులకు సకాలంలో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది.

Updated : 04 Apr 2024 08:10 IST

వైకాపా కుట్రకు అనుగుణంగా వ్యవహారం
డబ్బు సకాలంలో జమ చేయని వైనం
గంటల తరబడి పింఛనుదారుల పడిగాపులు
మంచినీళ్లు, టెంట్లు కూడా ఏర్పాటుచేయని దుర్మార్గం
ఎవరైనా చనిపోతే చాలు.. శవరాజకీయానికి సిద్ధం!

ఈనాడు, అమరావతి: పింఛనుదారులకు సకాలంలో పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది. ఎండలు ఠారెత్తిస్తున్నా చాలాచోట్ల తాగునీరు, టెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల పింఛనుదారుల్ని కిలోమీటర్ల మేర నడిపించారు. గిరిజనుల్ని ఇబ్బందులపాలు చేశారు. లబ్ధిదారులు సొమ్మసిల్లే పరిస్థితులు తలెత్తేలా చేసి.. ఆ తర్వాత తీరిగ్గా నగదు బ్యాంకుల్లో జమ చేశారు. కొన్నిచోట్ల అరకొరగానే అందింది. కొన్నిచోట్ల రాత్రి 7 గంటల వరకు కూడా నగదు జమ కాలేదు. రోజంతా వేచి చూసిన కొంతమందికి నగదు లేదని చెప్పి చాలాచోట్ల వెనక్కి పంపారు. ఇదంతా వైకాపా కుట్రకు అనుగుణంగానే సాగింది. లబ్ధిదారుల్లో ఆందోళన రెకెత్తించేలా చేసి అక్కడ గొడవలు, తోపులాటలు జరిగేలా చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 8 గంటల వరకు 40 శాతమే పింఛన్ల పంపిణీ జరిగింది.

నగదు సకాలంలో ఎందుకు జమ చేయలేదు?

2022 ఏడాదిలో ఏప్రిల్‌ 1వ తేదీనే పింఛను పంపిణీ చేశారు. ఇప్పుడు జాప్యం చేయడం ఉద్దేశపూర్వకం కాదా? ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా రూ. 13 వేల కోట్ల బిల్లుల్ని చెల్లించారే.. అప్పుడైనా అవ్వాతాతలు గుర్తుకురాలేదా? పోనీ 3వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని నాలుగు రోజుల ముందే ప్రకటించారు కదా? 2వ తేదీ నాటికైనా నగదును సమీకరించాలి కదా? ఆ పని కూడా ఎందుకు చేయలేదు? తీరా మధ్యాహ్నం తర్వాత నగదు జమ అయ్యేలా చేశారంటే ఇది కుట్ర కాక మరేంటి? బాపట్ల జిల్లాలోని ఒక సచివాలయంలో పింఛను పంపిణీకిగాను రూ. 14.50 లక్షలు నగదు అవసరమైతే.. మధ్యాహ్నం తర్వాత రూ. 20 వేలు మాత్రమే బ్యాంకులో జమ అయింది. సచివాలయం వద్ద చూస్తే భారీ సంఖ్యలో లబ్ధిదారులు వేచి ఉన్నారు. ఆ సొమ్మును పంచాలి? ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురుకావా? నగదు తక్కువ అందిందని లబ్ధిదారులకు తెలిసి ఎవరికివారు కంగారుపడితే తోపులాటలు జరగవా? ఇది జవహర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, మురళీధర్‌రెడ్డికి తెలియదా? అయినా ఇలా చేయడమంటే కుట్రపూరిత ఆలోచన కాదా? కొన్ని వందల సచివాలయాల్లో ఉదయం నుంచి పడిగాపులు కాచిన పింఛనుదారుల్ని సిబ్బంది డబ్బుల్లేవంటూ సాయంత్రం ఇళ్లకు పంపించేశారు. ఎండలో చాలాచోట్ల లబ్ధిదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వైకాపా తీరు ఎలా ఉందంటే, ఎవరైనా చనిపోతే చాలు వారి మృతదేహాలను అడ్డం పెట్టుకుని శవరాజకీయాలకు పాల్పడదామని చూస్తున్నట్లు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. ఇదే అదనుగా వైకాపా అభ్యర్థి జోగి రమేష్‌ శవ రాజకీయం మొదలుపెట్టారు. ఆమె బంధువులు, స్థానికులు ఎదురుతిరగడంతో ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది.

  • బాపట్ల జిల్లా జిల్లాలో 477 సచివాలయాల పరిధిలో సాయంత్రం 4 గంటల వరకు నగదు అందలేదు. బాపట్లలో 20 సచివాలయాలకు సాయంత్రానికి 50 శాతమే అందింది.
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తి సచివాలయానికి రూ.16 లక్షలకు గాను రూ.6 లక్షలు జమైంది. కడియంలో రూ. 3.62 కోట్లకుగాను మధ్యాహ్నానికి 30 శాతమే జమైంది. పెద్దాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి.
  • ఉమ్మడి కృష్ణా జిల్లా కైకలూరులో నగదు రాలేదని చెప్పి పింఛనుదారుల్ని వెనక్కి పంపించారు.
  • తిరుపతి జిల్లాలోనూ కొన్నిచోట్ల ఇదే పరిస్థితి కనిపించింది.
  • అనేక జిల్లాల్లో  చాలాచోట్ల డబ్బు జమ కాలేదని లబ్ధిదారులను వెనక్కి పంపారు.
  • శ్రీకాకుళం జిల్లాలో చాలా మండలాల్లో  నామమాత్రంగా అందించారు.
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలాచోట్ల పింఛన్లు తీసుకోవడానికి తెల్లవారుజాము నుంచే సచివాలయాల వద్ద బారులు తీరారు. రాత్రి 7 గంటల వరకు నగదు జమ కాలేదు.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో సాయంత్రానికి రూ. 50 లక్షలు నిధులే వచ్చాయి.

సచివాలయాలకు తాళాలే తెరవలేదు....

ప్రభుత్వం పింఛను పంపిణీపై పెట్టిన శ్రద్ధ ఎలా ఉందో పల్నాడు జిల్లా వినుకొండలోని నరగాయపాలెం సచివాలయాన్ని చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ 12 గంటలకు కూడా సచివాలయం మూత వేసి ఉంది. పింఛను కోసం ఉదయాన్నే వచ్చిన వారు చూసి చూసి ఇక వెనుదిగిరిపోయారు. ఇక్కడ ఒక్కటే కాదు....పల్నాడు జిల్లాలో చాలా సచివాలయాల్లో బుధవారం ఇదే పరిస్థితి కనిపించింది. ఇది కూడా వ్యూహాత్మకంగానే జరిగింది.

వీడియోల చిత్రీకరణ...

నరసరావుపేట పరిసర ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద వేచిచూస్తున్న వృద్ధులతో వైకాపా నాయకులు కొన్ని వీడియోలు చిత్రీకరించారు. వారితో వైకాపాకు అనుకూలమైన ప్రచారాన్ని చేయించారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలిసినా.. అక్కడున్న ఏ అధికారిగానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పామర్రు మండలంలోని కొన్ని సచివాలయాల పరిధిలో ఉద్యోగులు ఎన్నికల శిక్షణ నిమిత్తం వెళ్లారని బుధవారం పింఛను పంపిణీ చేయలేదు.
  • కర్నూలు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఫొటోలు, వీడియోలు తీయకూడదని పలుచోట్ల ఆంక్షలు విధించారు.
  • నంద్యాల 26వ వార్డులో కౌన్సిలర్‌ చంద్ర పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాగునీరు కూడా ఏర్పాటు ఇవ్వలేరా?

పింఛను పంపిణీ సవరణ మార్గదర్శకాలను వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు 24 గంటలు కసరత్తు చేసిన అధికారులు.. సచివాలయాల వద్ద కనీస వసతులు కల్పించాలనే దానిపై మాత్రం దృష్టిపెట్టలేదు. జగన్‌ భజన కార్యక్రమాలకైతే పకడ్బందీగా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు.. మరి అవ్వాతాతలంటే ఎందుకు అంత చులకన భావన! వసతుల కల్పనపై మూడో రోజుల ముందే సచివాలయాలకు ఆదేశాలిచ్చారు కదా? అక్కడ ఏ రకంగా అవి ఉన్నాయో పరిశీలించాల్సిన బాధ్యత లేదా? చాలాచోట్ల పింఛనుదారులు నిలువ నీడ లేక ఎండలో తీవ్ర ఇబ్బందిపడ్డారు.

  • ప్రకాశం జిల్లా మార్కాపురం, త్రిపురాంతకంలో సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోనూ చాలాచోట్ల ఇదే పరిస్థితి.
  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట సచివాలయంలో పింఛనుదారులు ఎండలో మెట్ల మీదనే వేచి ఉన్నారు. బుట్టాయగూడెం మండలంలో సాయంత్రం 5 వరకు పంపిణీ ప్రారంభించలేదు.
  • కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వృద్ధులకు తాగేందుకు మంచినీళ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి
  • గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు ప్రాంతంలో వార్డు సచివాలయం వద్ద వృద్ధులకు టెంటు ఏర్పాటు చేస్తుండగా కర్ర జారిపోయి అక్కడే ఉన్న రమా అనే వృద్ధురాలి తలపై పడింది. తల మీద గాయం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండల కేంద్రం సచివాలయం-3 పరిధిలో పింఛనుకు వెళుతూ.. పొన్నా సుబ్బారావు (70) అనే వృద్ధుడు ఎండకు స్పృహతప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు.

తెదేపానే అడ్డుకుందని దుష్ప్రచారం..

  • ఇళ్ల వద్ద పింఛను అందివ్వకుండా తెదేపానే అడ్డుకుందని ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలోని 5వ సచివాలయం వద్ద కొందరు వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారు. పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన వృద్ధులకు నీరు అందించే వచ్చి వైకాపాకు అనుకూల ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళి అమలు అధికారి అమృతరాజు అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.
  • తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే అంబేడ్కర్‌నగర్‌లోని సచివాలయానికి వెళ్లి జగన్‌ వస్తేనే పింఛన్లు ఇంటివద్దకు వస్తాయంటూ ప్రచారం చేశారు.
  • విశాఖ జిల్లా వడ్లపూడి పరిధిలోని గణేష్‌నగర్‌ సచివాలయం వద్దకు వాలంటీర్‌ రూసీమేరి వచ్చి అక్కడున్న లబ్ధిదారులతో మాట్లాడడం వివాదాస్పదమైంది. వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని