పింఛను పైసలపై ఓటు మరకలు!

చంద్రబాబు.. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి, ఒత్తిడి తెచ్చి, ఏకంగా వాలంటీరు వ్యవస్థను రద్దు చేయించారు.

Updated : 04 Apr 2024 10:51 IST

ఓట్ల కోసం ఇంత దిగజారుడుతనమా!
అవ్వాతాతలపై వికృత రాజకీయమా?
దిగజారిందెవరు.. రక్తపు రంగులద్దిందెవరు?
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. పచ్చి అబద్ధాలు చెప్పాలా?
ఛార్జీల బాదుడు, పన్నుల మోతపై గొంతు పెగలదా?
పూతల పట్టు సభలో కట్టుకథలల్లిన సీఎం జగన్‌


అబద్ధం 1:

చంద్రబాబు.. తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌ ద్వారా ఎన్నికల సంఘానికి లేఖలు రాయించి, ఒత్తిడి తెచ్చి, ఏకంగా వాలంటీరు వ్యవస్థను రద్దు చేయించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం

  • వాలంటీరు వ్యవస్థను రద్దు చేశారా.. ఎవరు? ఎప్పుడు? అలాంటి ఉత్తర్వులుంటే చూపించగలరా? ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పాలా? ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా? కట్టుకథలల్లుతూ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పాలా? వాలంటీర్లను నగదు పంపిణీకి దూరంగా ఉంచాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.  మీరు మాత్రం దాన్ని వక్రీకరిస్తూ.. ఏకంగా వాలంటీరు వ్యవస్థనే రద్దు చేశారని రాజ్యాంగబద్ధ సంస్థపైనే నెపం వేస్తున్నారా?
  • వాలంటీర్ల ద్వారా వైకాపా ప్రచారం చేయిస్తున్నారని.. వారిని విధులకు దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేశ్‌ ఫిర్యాదు చేశారు. వాస్తవానికి. వాలంటీర్లంతా వైకాపా కార్యకర్తలేనని చెప్పింది మీరు, మీ మంత్రులే కదా? వారితో ఎన్నికల ప్రచారం చేయిస్తున్న మాట నిజం కాదా! దానిపైనే రమేశ్‌ ఫిర్యాదు చేశారు. అందుకే వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి రక్తపు రంగులద్ది.. ప్రతిపక్షం పైకి నెట్టేసే కు‌ట్రకు తెరతీసిందెవరు? అవ్వాతాతలకు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తోంది మీరు కాదా? అంటే ఎన్నికల సంఘం నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నారా?

నడవలేని అవ్వాతాతలపై.. ఇంత శాడిజమా?

అబద్ధం 2:

సెలవైనా.. పండగైనా.. ప్రతి నెలా 1వ తేదీన క్రమం తప్పకుండా వాలంటీరు వచ్చి అవ్వాతాతల చేతుల్లో పింఛను పెట్టేవారు

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

  • అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చేందుకు 1వ తేదీనే ఎందుకు డబ్బు తీయలేదు.. అలా ఇవ్వొద్దని ఎవరూ చెప్పలేదే! అయినా ఎందుకు ఆపేశారు? 3వ తేదీ నుంచి పింఛను ఇస్తామని ప్రకటించింది మీ ప్రభుత్వమే కదా? 2022 సంవత్సరంలో మూడు రోజుల ముందే డబ్బులు డ్రా చేసేవారు. ఆ తెలివి ఇప్పుడేమైంది? అంటే అవ్వాతాతల్ని కావాలనే ఇబ్బంది పెట్టాలనేది మీ ముందస్తు వ్యూహంలో భాగమే. నడవలేని వయసున్న వారిపై ఇంత శాడిజమా?అయినా ప్రజల్ని నమ్మించేందుకు ఎన్నికల సభల్లో అబద్ధాల ప్రచారం చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి? ఇలాంటి మోసం చేసే వ్యక్తికి, అబద్ధాలు చెప్పే వారికి ఓటు వేయడం అవసరమా?
  • మీ వంటింటి గుత్తేదారు సంస్థలకు రూ. వేల కోట్ల చెల్లింపుల కోసం.. మార్చి నెలాఖరునే ఖజానా ఖాళీ చేసింది మీరు కాదా? దాన్ని కప్పిపుచ్చేందుకు.. పింఛను ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబుపై బురదజల్లేందుకు ఇంత అరాచకమా? ఆయనపై నెపం నెట్టేందుకు అవ్వాతాతలనే కనికరం కూడా లేకుండా ఇంత దుర్మార్గంగా వ్యవహరించాలా? మొన్నటికి మొన్న ఖజానాలో డబ్బు లేకుండా చేసిందీ మీరే.. ఇప్పుడు 1వ తేదీ పింఛను ఇవ్వలేదంటూ ప్రచారం చేసేదీ మీరే! ఇంత వికృత రాజకీయమా?

ఈనాడు-అమరావతి : పదే.. పదే అవే అబద్ధాలు.. అడుగడుగునా వంచన.. చేతులు తిప్పి చెప్పండంటూ వైకాపా కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యూహమే జగన్‌ నైజం. చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు కట్టుకథలల్లారు. వాలంటీరు వ్యవస్థను రద్దు చేశారంటూ.. ప్రతిపక్షంపై విషం చిమ్మే ప్రక్రియ ప్రారంభించారు. అవ్వా తాతలనే కనికరం కూడా లేకుండా.. వారితో ఎన్నికల రాజకీయం చేసేది తామే అనే విషయాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఇచ్చిన  హామీలు అమలు చేయని ఆయన విశ్వసనీయత అంటూ ఊసరవెల్లి కబుర్లు చెప్పారు. ఆర్‌బీకేల ద్వారా రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నామంటూ చెప్పిన సీఎం.. కరవుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లోకి జమ చేశామని చెప్పిన ఆయనకు. ‘కరెంటు బిల్లులు, బస్సు ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌ బాదుడెంత? పన్నులు పెంచి పిండేదెంత? నిత్యావసరాలు, వ్యవసాయ ఖర్చుల ధరలెంత పెరిగాయి?’ అనే విషయంలో నోరు మెదపలేదు.

ఎర్రచందనం స్మగ్లర్‌ విజయానందరెడ్డి సౌమ్యుడట!

చిత్తూరు నియోజకవర్గం నుంచి శాసన సభకు పోటీ చేస్తున్న విజయానందరెడ్డి సౌమ్యుడని.. ఆయనపై మీ చల్లని దీవెనలు ఉండాలని జగన్‌ ఓటర్లను అభ్యర్థించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో నిందితుడైన ఆయనపై గతంలో పీడీ చట్టం ప్రయోగించారు. అలాంటి వ్యక్తిని సౌమ్యుడంటూ జగన్‌ చెప్పడంపై అక్కడున్నవారంతా విస్తుపోయారు. మీ పార్టీ వాళ్లంతా ఇలాంటి సౌమ్యులేనా? అని ఎద్దేవా చేయడం కనిపించింది. ఎమ్మెల్యే, ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడైన చంద్రగిరి అభ్యర్థి మోహిత్‌రెడ్డిని  పరిచయం చేస్తూ.. యువకుడు, ఉత్సాహవంతుడని వర్ణించారు. తండ్రి అక్రమాలకు తనయుడూ వారసుడే అని చెప్పలేకపోయారు. ఇటీవల పెద్దఎత్తున పట్టుకున్న తాయిలాలు ఎవరివో చెప్పి ఉంటే బాగుండేది కదా! నగరి ఎమ్మెల్యే రోజమ్మకూ దీవెనలు అందించాలని కోరారు. ఒక్కో మండలాన్ని ఒక్కో తమ్ముడికి కట్టబెట్టి.. సొంత సామ్రాజ్యంలా తయారు చేసినందుకా? మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పిస్తామని తన దగ్గర నగదు తీసుకున్నారని ఆమెపై వైకాపా మహిళా నేత తిరుపతిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పిన విషయం ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదనుకోవాలా? పలమనేరు అభ్యర్థి వెంకటేగౌడను కూడా జగన్‌ ఓటర్లకు పరిచయం చేశారు. సెటిల్‌మెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ కమిషన్లలో తలపండారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయినా వైకాపా అభ్యర్థులంతా సౌమ్యులంటూ జగన్‌ వారికి కితాబులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని