ఎన్నికల వేళ ‘ఆట’ మొదలుపెట్టారు

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు క్రీడాకారులపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. తాజాగా జోనల్‌స్థాయి క్రీడాకారుల కోసం ప్రత్యేక పోషకాహార పథకాన్ని ప్రారంభించింది.

Published : 04 Apr 2024 05:26 IST

ఒక్కసారిగా క్రీడాకారులపై ప్రేమ
వ్యూహాత్మకంగా కొత్త పథకం ప్రారంభించిన  ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)కు క్రీడాకారులపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. తాజాగా జోనల్‌స్థాయి క్రీడాకారుల కోసం ప్రత్యేక పోషకాహార పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఏడాదికి రూ.కోటిన్నర కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. సంబంధిత చెక్కును క్రికెట్‌ దిగ్గజాలు సౌరభ్‌ గంగూలీ, రికీ పాంటింగ్‌ చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేసి ఆర్భాటం చేసింది. ఈ పాలకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు క్రీడాకారుల సంక్షేమానికి చేపట్టిన చర్యలు నామమాత్రమే.

మార్చిలోనే ప్రకటన.. తాజాగా అమలు

ఎన్నికల సమయంలో ఏసీఏ ప్రత్యేక పథకం అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ముందెన్నడూ పట్టించుకోకుండా ఇప్పుడు పోషకాహారం కోసమంటూ 400 మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేలు ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి. యువ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంగా దీన్ని తెరపైకి తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాకే చేయడం గమనార్హం. ఇదంతా వ్యూహాత్మకంగా చేశారనే విమర్శలున్నాయి. గతేడాది ఏసీఏ ద్వారా ఇద్దరు మహిళా క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పున సీఎం జగన్‌ చేతుల మీదుగా అందజేశారు. తర్వాత ప్రోత్సాహకాల ఊసే లేదు. శిక్షణ కేంద్రాల నిర్వహణనూ పట్టించుకోలేదు.

ఏసీఏకు రాజకీయ రంగు

ఏసీఏ కార్యవర్గమంతా వైకాపా నేత విజయసాయిరెడ్డి బంధువులు, అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్న విమర్శలున్నాయి. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి దీనికి ఉపాధ్యక్షుడు. రోహిత్‌రెడ్డి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షుడు. కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి సైతం కీలక నేతకు సన్నిహితుడే. వారంతా కలిసి గతేడాది మే నెలలో స్టేడియంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దీన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. క్రికెట్‌ ద్వారా విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన డీవీ సుబ్బారావు విగ్రహాన్ని ఏర్పాటుచేయకపోవడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి.

అనేకసార్లు వివాదాస్పదం

క్రికెట్‌ ప్రపంచకప్‌ సమయంలో బీచ్‌ రోడ్డులో ఏసీఏ ఏర్పాటుచేసిన పెద్ద తెరలపై జగన్‌ చిత్రాలను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. తాజాగా స్టేడియంలో ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ విషయంలో అభిమానుల ఆసక్తిని నిర్వాహకులు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఏసీఏ ప్రతినిధులు కొందరు టికెట్లు బ్లాక్‌ చేశారనే విమర్శలున్నాయి. ఏసీఏ నుంచి వైకాపా కార్యాలయాల ద్వారా జిల్లాలోని పారిశ్రామికవేత్తలకు టికెట్లు చేరవేసినట్లు చర్చ సాగుతోంది. పలువురు వ్యక్తులు స్టేడియం లోపలినుంచి టికెట్లు తీసుకొచ్చి బ్లాక్‌లో విక్రయించారనే ఆరోపణలూ వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని