అభ్యర్థుల చరిత్ర తెలుగులో ఇవ్వడంపై వివరాలు సమర్పించండి

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాల అఫిడవిట్‌ను(ఫారం-26) తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది.

Published : 04 Apr 2024 05:27 IST

కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తులు, క్రిమినల్‌ కేసులకు సంబంధించిన వివరాల అఫిడవిట్‌ను(ఫారం-26) తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఓటర్లు చాలా తెలివైన వాళ్లని, స్థానిక అభ్యర్థుల గురించి వారికి బాగా తెలుసని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్వ చరిత్ర, క్రిమినల్‌ కేసుల వివరాలు, ఆస్తులకు సంబంధించి సమర్పించే ఫారం 26ని ప్రజలకు తెలుగులో అందుబాటులో ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెలుగు భాషోద్యమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు, మాచవరానికి చెందిన వైద్యుడు సామల రమేశ్‌బాబు హైకోర్టులో పిల్‌ వేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు. ఒకవేళ అభ్యర్థులు ఆంగ్లంలో అఫిడవిట్‌ సమర్పిస్తే ఎన్నికల కమిషన్‌ దానిని తెలుగులోకి అనువదించి పౌరులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 83శాతం మంది ప్రజలు తెలుగును మాత్రమే అర్థం చేసుకోగలరన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో ఫారం 26 అఫిడవిట్‌ను ఆంగ్లం లేదా స్థానిక భాషలో సమర్పించవచ్చని పేర్కొన్నా.. ఏపీలో తెలుగులో ఉంచడం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని