రూల్స్‌ మార్చు.. సొమ్ము పిండు!

రాష్ట్రంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కళాశాలల ప్రవేశాలు జగన్‌ సర్కారులో వ్యాపారంలా మారాయి. కొందరు వీటిని కాసులు కురిపించే కామధేనువుల్లా వాడుకుంటున్నారు.

Published : 04 Apr 2024 05:27 IST

వైకాపా పాలనలో వ్యాపారంగా మారిన ఉపాధ్యాయ విద్య
స్పాట్‌, కేటగిరి-బీ సీట్ల భర్తీకి పదేపదే నిబంధనల మార్పు
వారంలో రెండుసార్లు మార్చిన ఉన్నత విద్యామండలి
ఏటా రూ. 10 కోట్లు చేతులు  మారుతున్న వైనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కళాశాలల ప్రవేశాలు జగన్‌ సర్కారులో వ్యాపారంలా మారాయి. కొందరు వీటిని కాసులు కురిపించే కామధేనువుల్లా వాడుకుంటున్నారు. ప్రవేశాల సమయంలో కాసులు పిండుకునేందుకు నిబంధనలంటూ హడావుడి చేయడం, ఎంతో కొంత రాగానే వాటికి సడలింపులు ఇవ్వడం పరిపాటిగా మారింది. వైకాపా హయాంలో బీఈడీ కళాశాలల అనుమతుల నుంచి ప్రవేశాల వరకు ఫక్తు వ్యాపారంగా మారింది. జగన్‌ పాలనలో డీఎస్సీలు నిర్వహించకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు బీఈడీలో చేరడం లేదు. ఈ కళాశాలల యాజమాన్యాలు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని చేర్చుకుంటున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న సంబంధిత అధికారులు యాజమాన్యాలపై నిబంధనల కత్తి దూసి, నగదు పిండుకుంటున్నారు. ఏటా బీఈడీ కళాశాలల అనుమతులు, ప్రవేశాల నిర్వహణకు రూ.10 కోట్లకు పైగా మామూళ్లు చేతులు మారుతున్నాయి. నాణ్యమైన ఉపాధ్యాయ విద్య అందించాల్సిన సర్కారు అక్రమాలకు వంతపాడుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో మొదట కళాశాలల యాజమాన్యాలను తనిఖీల పేరుతో ఇబ్బందులు పెట్టి, వసూలు చేసుకోవాలని ఉత్తరాంధ్రకు చెందిన కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం తనిఖీ అధికారాలను ఉన్నత విద్యామండలికి ఇస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. దీనిపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను తనిఖీలకు రంగంలోకి దించారు. కమిటీలు ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించారు. ఇలా ప్రవేశాల్లో తీవ్ర జాప్యం చేశారు. 2023 జులై 14న ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల చేస్తే ఫిబ్రవరిలో ప్రవేశాలు చేపట్టింది. ఎన్నికలకు ముందు ఎంతో కొంత వసూలు చేసుకోవాలని కీలక యాజమాన్యాలపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ వచ్చినా మామూళ్లు దండుకునేందుకు యాజమాన్యాలపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.

తరుచూ మారిపోతున్న ఆదేశాలు..

రాష్ట్రంలో మొత్తం 411 బీఈడీ కళాశాలలు ఉండగా.. 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరం ముగింపునకు వచ్చినా ఇప్పటికీ బీఈడీ ప్రవేశాలు పూర్తి కాలేదు. కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీని ఉన్నత విద్యామండలి భర్తీ చేసింది. ఇందులో మిగిలిపోయిన సీట్లను స్పాట్‌ కింద, యాజమాన్య కోటా (కేటగిరి-బీ) 25% సీట్లను ఈనెల 12 లోపు పూర్తి చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చింది..

  • కళాశాలల్లో 50 నుంచి 150 సీట్లు వరకు ఉన్నాయి. ఇందులో గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్ల సబ్జెక్టు మెథడాలజీలుగా వారీగా సీట్లను భర్తీ చేయాలి. ఉన్నత విద్యామండలి మొదట ఇదే విధానంలో పూర్తి చేయాలంటూ వారం క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు మాత్రమే తప్పనిసరిగా భర్తీ చేయాలని ఆదేశించింది.
  • యాజమాన్యాలు ప్రసన్నం చేసుకోవడంతో వారం తిరగక్కుండానే ఉన్నత విద్యామండలికి యాజమాన్యాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. పాత జీవో ఒకటి గుర్తు కొచ్చింది. వెంటనే ఆ జీవోను పేర్కొంటూ సడలింపులు ఇచ్చేసింది.
  • ఫిబ్రవరి 2008లో ఇచ్చిన జీవో ఎంఎస్‌-31 ప్రకారమంటూ తాజాగా కొత్త ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం సీట్లలో గణితం 25%, భౌతిక, జీవశాస్త్రాలు 30%, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం మెథడాలజీలు 45% చొప్పున సీట్లు భర్తీ చేసుకోవాలని సూచించింది.
  • ఈ జీవో ప్రకారం సైతం కాకుండా మొత్తం సీట్లను అభ్యర్థుల లభ్యతను బట్టి ఇష్టం వచ్చిన మెథడాలజీలో చేర్చుకునేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు ఉన్నత విద్యామండలిని కోరాయి. మెథడాలజీతో సంబంధం లేకుండా సీట్లను భర్తీ చేసుకునేందుకు మామూళ్లు చెల్లించాలంటూ యాజమాన్యాలు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో చాపకింద నీరులా  ఈ తతాంగం నడిచిపోతుంది.
  • జగన్‌ సర్కార్‌లో ఈ అయిదేళ్లలో బీఈడీ కళాశాలలో అసలు తరగతులే కొనసాగలేదు. నాగార్జున వర్సిటీ పరిధిలో ప్రాక్టికల్‌ పరీక్షలనే ఎత్తేశారు. 700 మార్కులకు నిర్వహించాల్సిన ఈ పరీక్షలు లేకుండా చేశారు. ప్రవేశాలను ఆలస్యంగా నిర్వహిస్తుండడంతో రెండేళ్ల బీఈడీ కోర్సును 11 నెలలకే పూర్తి చేసేస్తున్నారు. ఇలా ఈ ఉల్లంఘనలన్నింటికీ ఒక్కో ధర నిర్ణయించి వర్సిటీల నుంచి ఉన్నత విద్యాశాఖ వరకు వసూలు చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని