జగన్‌ పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం

రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్‌ నిర్వీర్యం చేశారని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు ఆరోపించారు.

Published : 04 Apr 2024 05:29 IST

రానున్న ఎన్నికల్లో వైకాపాకు గుణపాఠం తప్పదు
రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు స్పష్టీకరణ

విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్‌ నిర్వీర్యం చేశారని రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు ఆరోపించారు. బుధవారం విశాఖపట్నంలోని ఆటోనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రోస్టర్‌ విధానం ద్వారా డీలర్లును నియమించి ఆహార భద్రత నియమాల ప్రకారం ప్రజలకు సరకుల సరఫరా జరిగేది అన్నారు. జగన్‌ సీఎం అయ్యాక నూతన విధానం తీసుకొచ్చి  రాష్ట్రంలో సుమారు 29వేల మంది డీలర్ల పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్వింటాలుకు రూ.100 కమిషన్‌ చెల్లించేవారని .. డీలర్‌ చనిపోతే దహన ఖర్చుల కింద రూ.15 వేలు ఇచ్చేవారన్నారు. సంక్రాంతి, రంజాన్‌ తోఫా పంపిణీతో డీలర్లుకు ఆదాయం లభించేదన్నారు. ఇలాంటి ప్రయోజనాలు దక్కకుండా చేసిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. డీలర్లకు గౌరవ వేతనం కింద గ్రామాల్లో రూ.7500, పట్టణాల్లో రూ.10 వేలు ఇచ్చి, క్వింటాలుకు రూ.150 కమీషన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గంగాధర్‌ గౌడ్‌, సభ్యుడు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని