ఐదేళ్లుగా గుర్రుపెట్టి.. గురుకులాలను వెనక్కి నెట్టి..

జగన్‌ ఐదేళ్ల కాలక్షేపం..  బీసీ పిల్లలకు పెనుశాపమైంది! ‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్‌.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు. తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది. 

Published : 04 Apr 2024 05:31 IST

ఐదేళ్లలో నెలకొల్పింది రెండు విద్యాలయాలే..
బీసీ విద్యార్థులపై ఇదీ జగన్‌ ప్రేమ
తెలంగాణలో పదేళ్లలో నూతనంగా 308 ఏర్పాటు
అక్కడి గురుకులాల్లో 1.87 లక్షల మంది బీసీ విద్యార్థులు
ఏపీలో చదువుతోంది 38,500 మంది మాత్రమే..
నిధులు, భవనాలు ఇవ్వడానికీ వైకాపా సర్కారు విముఖత

జగన్‌ ఐదేళ్ల కాలక్షేపం..  బీసీ పిల్లలకు పెనుశాపమైంది!
‘నా బీసీలు’ అంటూ పదేపదే వల్లెవేసే జగన్‌.. వారి పిల్లలకు గురుకులాల ఏర్పాటులో నయవంచనే చేశారు.
తెలంగాణ మూడొందలకు పైగా బీసీ గురుకులాలతో బిరబిరా పరుగులు తీస్తోంది.
ఏపీలో మాత్రం జగన్‌ రెండంటే రెండే కొత్తగా ఏర్పాటుచేసి
ఆ వర్గం విద్యార్థుల విద్యపై విషం చిమ్మారు!

గురుకులాలు.. నాణ్యమైన విద్యను అందిస్తూ నైపుణ్యమున్న ఉపాధ్యాయులతో పిల్లల విద్యాభివృద్ధికి బాటలువేసే కేంద్రాలు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో వీటి పాత్ర అపారం. పేద, వెనకబడిన విద్యార్థులకు ఇవి వరం లాంటివి. వీటిలో సీటు దక్కితే విద్యార్థుల దశ తిరిగినట్లే అని అందరూ భావిస్తారు. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు పెద్దపీట వేసింది. రాష్ట్ర విభజన నాటికి(2014) ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 35 బీసీ గురుకులాలు ఉండగా.. 2019 నాటికి 106కు పెంచింది. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో.. అంటే 71 గురుకులాలను కొత్తగా మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో పదేళ్లలో నూతనంగా 308 గురుకుల విద్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చి బీసీ విద్యార్థులకు అగ్రతాంబూలం ఇచ్చింది. ఇది కదా.. ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవడం అంటే..


తెలంగాణ బీసీ గురుకులాలు నం.1

 • తెలంగాణలో అత్యధిక విద్యాలయాలతో బీసీ గురుకుల సొసైటీ నం.1 స్థాయిలో ఉంది. సంఖ్యలోనే కాదు.. ఫలితాల్లోనూ నం.1గా   కొనసాగుతోంది.
 • తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆ ప్రాంతంలో 19 బీసీ పాఠశాలలు/జూనియర్‌ కళాశాలలు ఉండగా.. ఒక్క బీసీ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాష్ట్ర విభజన అనంతరం అక్కడి ప్రభుత్వం కొత్తగా 275 పాఠశాలలు/జూనియర్‌ కళాశాలలు, 33 డిగ్రీ కళాశాలలను నెలకొల్పింది. అంటే పదేళ్లలో 308 గురుకులాలను ప్రారంభించింది.
 • తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్లలోనే 238 బీసీ గురుకులాలను నెలకొల్పిందంటే బీసీ విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. వీటి ఏర్పాటులో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది కూడా.
 • మొదట 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైన ఈ పాఠశాలలు ఇంటర్మీడియట్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయ్యాయి.
 • బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 బీసీ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. వాటిలో పురుషుల కళాశాలలు 16, మహిళల కళాశాలలు 17.
 • డిగ్రీ కళాశాలల్లో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. కృత్రిమమేధ, ఎం.ఎల్‌., ఎనలిటిక్స్‌ తదితర ప్రధాన కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
 • బీసీ మహిళల కోసం ప్రత్యేకంగా రెండు వ్యవసాయ విద్య కళాశాలలు కొనసాగుతున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన వ్యవసాయ భూములను ప్రభుత్వం సొసైటీ పేరిట మార్చింది.
 • విభజన నాటికి తెలంగాణలోని బీసీ గురుకులాల్లో 10,640 మంది విద్యార్థులు చదువుతుంటే... ఇప్పుడు ఆ సంఖ్య 1,87,320కి చేరింది.

వైకాపా పాలనలో అధమస్థానం

 • ఏపీలో వైకాపా పాలనలో బీసీ గురుకులాలు అధమస్థానంలో నిలిచాయి. నాణ్యమైన విద్య అందించడంలో జగన్‌ సర్కారు విఫలమైంది.
 • రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 35 బీసీ గురుకులాలు ఉండేవి. తర్వాత అప్పటి తెదేపా ప్రభుత్వం అదనంగా 71 కొత్త గురుకులాలను మంజూరు చేసింది. వీటితో రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య 106కు చేరింది.
 • వైకాపా సర్కారు 2 గురుకులాలను మాత్రమే మంజూరు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్‌లో ఒకటి, దాని సమీప ప్రాంతమైన బేతంచెర్లలో మరొకటి ఏర్పాటుచేసి చేతులుదులుపుకొంది.
 • వైకాపా సర్కారు కొత్త గురుకులాలను మంజూరు చేయడం దేవుడెరుగు. అప్పటి తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన వాటిలో ఫిరంగిపురం, పిఠాపురం, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని బీసీ గురుకులాలను ఇప్పటికీ ప్రారంభించలేదు ఘనత వహించిన జగన్‌ సర్కారు. కారణం అడిగితే వాటి ఏర్పాటుకు భవనాలు దొరకడం లేదంటోంది!
 • గత తెదేపా ప్రభుత్వం 14 బీసీ గురుకుల పాఠశాలలను ఇంటర్మీడియట్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసింది. జగన్‌ సర్కారు కేవలం ఐదింటిని మాత్రమే ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు ఉన్నతీకరించింది. ఇంటర్మీడియట్‌ స్థాయి కళాశాలలను డిగ్రీకి అప్‌గ్రేడ్‌ చేసే అవకాశమున్నా పట్టించుకోవడంలేదు.
 • బీసీ గురుకులాల్లో కృత్రిమమేధ, ఎం.ఎల్‌., ఎనలిటిక్స్‌ తరహా ప్రత్యేక కోర్సుల ఊసే లేదు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే జగన్‌.. బీసీ పిల్లలకు వ్యవసాయ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న కనీస స్పృహను కోల్పోయారు.
 • విభజన నాటికి ఏపీలోని బీసీ గురుకులాల్లో 18 వేల మంది విద్యార్థులు చదువుతుండేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 గురుకులాల్లో 38,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. తెలంగాణలోని బీసీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న 1.87 లక్షల విద్యార్థులతో పోల్చితే ఏపీలో చదువుతున్న బీసీ విద్యార్థుల సంఖ్య ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.


వెన్నువిరిచారు..

‘నా బీసీలు’ అంటూ తరచూ బీసీ జపం చేసే ముఖ్యమంత్రి జగన్‌.. ఆ వర్గ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఏం చేశారో తెలుసా? తన ఐదేళ్ల పాలనలో కొత్తగా మంజూరు చేసింది రెండు గురుకులాలు మాత్రమే. బీసీలంటే ‘బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ కాదు... బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఆయన వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వెన్నువిరిచారు. గత తెదేపా ప్రభుత్వం ఆ వర్గం విద్యార్థులకు బాసటగా నిలిస్తే.. జగన్‌ ప్రభుత్వం మాత్రం వారికి గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురాకుండా పచ్చిమోసం చేసింది.


‘అద్దె’సరు భవనాలు

బీసీ విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడం నచ్చనట్లుంది. అందుకే నిధుల కేటాయింపునకు జగన్‌కు చేతులురాలేదు. రాష్ట్రంలోని 65కి పైగా గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి సొంత భవనాలు సమకూర్చేందుకు రూ.2 వేల కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించారు. జగన్‌ వాటిని అటకెక్కించారేగానీ నిధులను విదల్చలేదు.


వినతులు బుట్టదాఖలు

బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రంలోని వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. కానీ వాటి మంజూరుకు జగన్‌కు మనసు రాలేదు. ప్రధానంగా జగన్‌ ప్రాతినిధ్యం వహించే రాయలసీమ ప్రాంతానికి చెందిన వెనకబడిన జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచే గడిచిన ఐదేళ్లలో అధికసంఖ్యలో వినతులు వచ్చాయి. ఆ దరఖాస్తులన్నీ బుట్టదాఖలాలయ్యాయి.


బిల్లులు చెల్లించకుండా..

గత తెదేపా ప్రభుత్వం గుండుమల, గుడిబండ, గోనెబావి, నసన్నకోట, అంపోలులో కొత్త గురుకుల భవనాల నిర్మాణాలు చేపట్టింది. ఒక్కో భవనానికి రూ.25 కోట్ల చొప్పున కేటాయించింది. వాటిలో నసన్నకోట, అంపోలులో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. మిగిలిన మూడు చోట్ల అసంపూర్తిగా మారాయి. కేవలం తెదేపా ప్రభుత్వం చేపట్టిందనే అక్కసుతోనే వైకాపా సర్కారు.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా పనులను అడ్డుకుంటోంది. ప్రస్తుతం అంచనా వ్యయం పెరిగిన దృష్ట్యా ఒక్కో భవనం పూర్తికి రూ.5-6 కోట్ల వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా వైకాపా బేతంచెర్ల, డోన్‌, తొండూరు, కమలాపురం, చోడవరం ప్రాంతాల్లో గురుకుల భవనాల నిర్మాణాలను చేపట్టింది. వీటికైనా నిధులు కేటాయించి పూర్తి చేసిందా..? అంటే అదీ లేదు. సీఎం జగన్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నియోజకవర్గమైన డోన్‌లోని భవనాలకు మాత్రమే నిధులు కేటాయించారు. మిగిలిన వాటికి మొండిచేయి చూపారు. ఇది చాలు.. బీసీ విద్యార్థులపై జగన్‌ ఎంత విషం కక్కుతున్నారో చెప్పడానికి..!


ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని