పురందేశ్వరి ఫిర్యాదుపై తక్షణమే నివేదిక పంపండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

Updated : 10 Apr 2024 11:56 IST

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి రఘురామ్‌రెడ్డితో పాటు పలువురిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలి ఫిర్యాదు
నిఘా విభాగాధిపతి పీఎస్సార్‌ ఆంజనేయులు, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డిపైనా..
వాళ్లు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ప్రస్తావన
ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని వినతి

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, విజిలెన్స్‌ విభాగాధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు, పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి పురందేశ్వరి ఈ నెల 1న ఫిర్యాదు చేయగా, 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి.

పురందేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పీఎస్సార్‌ ఆంజనేయులు, ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతిపరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ... ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారేనని, వారి ముగ్గురిదీ ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ‘నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమనేది... ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకం. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించడం లేదు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగింది. పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ.. ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయి.

అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉంది. ఆ సంఘటనలేవీ అనుకోకుండా జరిగినవి కాదు. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలే’ అని పురందేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్‌, డీజీపీలను తక్షణం బదిలీ చేసి.. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు, సీఎస్‌, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్నీ ఆమె జత చేశారు.

వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్న డీజీపీ

ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని వైకాపా ప్రభుత్వమే నియమించింది. ఆయన ఆ పార్టీ  సానుభూతిపరుడు. అంతేకాదు ఆయనదీ ముఖ్యమంత్రి జగన్‌ సామాజికవర్గమే, ఇద్దరిదీ ఒకే జిల్లా. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. డీజీపీ పోస్టుకు అర్హులైన ఆరేడుగురు సీనియర్‌ అధికారుల్ని పక్కనపెట్టి సర్వీసులో వారికంటే జూనియర్‌ అయిన రాజేంద్రనాథరెడ్డిని డీజీపీగా నియమించారు. అందుకాయన కృతజ్ఞత తీర్చుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారు. మైక్‌ సిస్టమ్స్‌ దగ్గర సరైన భద్రత కల్పించలేదు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్నవారిని పోలీసులు అడ్డుకోలేదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని... వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చింది.

  • మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీజీపీ సహకరించలేదు. పైగా అరెస్ట్‌ చేయకుండా నిరోధించారు. రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంతో  సీబీఐ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
  • విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారు.
  • డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారు. వైకాపా చేస్తున్న పలు దురాగతాలకు ఆయనే మార్గదర్శకత్వం వహిస్తున్నారు.  
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గానీ, దానికి కారకులైన వైకాపా నాయకులపైగానీ డీజీపీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దొంగ ఓటర్లపై పత్రికలు, టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా ఆయన స్పందించలేదు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే వ్యవహరించారు.
  • ఆయనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సంపూర్ణ మద్దతుంది.

ఫోన్లు ట్యాప్‌ చేస్తున్న రఘురామ్‌రెడ్డి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు  

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు.. ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారు. ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారు. వాళ్లద్దిర్నీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలి.

వైకాపాకు సొమ్ములు పోగేస్తున్న తితిదే ఈవో ధర్మారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి అధికార వైకాపాకు బహిరంగ మద్దతుదారు. బడా పారిశ్రామికవేత్తలు, దాతల నుంచి వైకాపాకు ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో నియమించారు. పవిత్ర పుణ్యక్షేత్ర కార్యాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. 2006లోనే ధర్మారెడ్డి లక్షకు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. ఆయన వేధింపులు తాళలేక సురేష్‌ అనే తితిదే ఉద్యోగి గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్మారెడ్డిని వెంటనే అక్కణ్నుంచి బదిలీ చేసి,  తటస్థంగా ఉండే అధికారిని నియమించాలి.

మద్యం సరఫరాలో వాసుదేవరెడ్డి పాత్ర

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపా మద్దతుదారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న చీప్‌ లిక్కర్‌ క్రయవిక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడు. రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపటంలో రూ.వేల కోట్ల అవినీతి ఉంది. దానిపై సీబీఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండు చేసింది. అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా..  ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారు. ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి, విచారించాలి.


అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్‌ జవహర్‌రెడ్డి

సమర్థులైన పలువురు సీనియర్‌ అధికారుల్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్‌ జవహర్‌రెడ్డిని నియమించారు. అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తనకు కీలకమైన పోస్ట్‌ కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్‌రెడ్డి బహిరంగంగా వైకాపా ప్రభుత్వానికి సహాయపడుతున్నారు. మెరిట్‌, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా.... ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్‌ కీలక భూమిక నిర్వహించారు. సీఎఫ్‌ఎంఎస్‌ నిబంధనల్ని పక్కనబెట్టి వారికి దొడ్డిదారిన బిల్లులు చెల్లించారు.

  • ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టుపెట్టి తెచ్చిన రుణాల్ని దారి మళ్లించడం సహా ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్థిక లావాదేవీల్ని కాగ్‌ తప్పుబట్టింది. అలా చేయడం తప్పని తెలిసీ సీఎస్‌ ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రోత్సహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధుల్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముఖ్యమంత్రి ఇష్టానుసారం దారి మళ్లించేశారు.
  • గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లిస్తున్నా సీఎస్‌ ప్రేక్షకపాత్ర వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు