కుమ్మరించేస్తోంది

రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరిన ఒక పార్టీ.. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ఎక్కడంటే అక్కడ, ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది.

Updated : 10 Apr 2024 07:35 IST

వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ
కార్యకర్తలకు రూ.50 వేలు... నాయకులకు రూ.50 లక్షలు
ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు రూ.3,500 కోట్లు
వారు సొంతంగా పెట్టే ఖర్చుకు.. పార్టీ ఇచ్చింది అదనం
ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతుల డంప్‌లు  
మద్యం దుకాణానికి రూ.10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్లో ఆరితేరిన ఒక పార్టీ.. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోంది. ఎక్కడంటే అక్కడ, ఎలా కావాలంటే అలా డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తోంది. సాధారణంగా రేపో, ఎల్లుండో పోలింగ్‌ అనగా ఓటర్లకు డబ్బులు పంచడం చూశాం. కానీ అసాధారణమైన ఆర్థిక, అంగబలాలు సమకూర్చుకున్న ఆ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి మూడు నాలుగు నెలల ముందు నుంచే నాయకులకు, ఓటర్లకు డబ్బులు, బహుమతులూ ఎరవేస్తూ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు నుంచే అసాధారణ రీతిలో డబ్బు వెదజల్లడం ప్రారంభించింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇప్పటికే తొలి విడతలో దాదాపు రూ.3,500 కోట్లు చేరవేసినట్లు ఆ పార్టీవర్గాల సమాచారం. ఆ పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది గత అయిదేళ్లలో విపరీతంగా సంపాదించారు.  ప్రకృతి వనరులను ఎడాపెడా దోచేసి, అంతులేని అవినీతికి పాల్పడి రూ.వందల కోట్లకు పడగలెత్తారు. అయినా ఆ పార్టీ అధినేత మాత్రం వారేదో అమాయకులన్నట్లు బిల్డప్‌లిస్తున్నారు.

‘మా అభ్యర్థులు డబ్బుల విషయంలో అంతంత మాత్రమే’ అంటూ ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా చేతులు తిప్పుతూ, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నారు. అభ్యర్థులకు రూ.కోట్లు ఖర్చు పెట్టగల ఆర్థిక పరిపుష్టి ఉన్నప్పటికీ... పార్టీ నుంచీ వారికి భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఆ పార్టీ అసాధారణమైన ఆర్థిక వనరులున్న ఏ కొద్దిమందికో తప్ప... మిగతా అభ్యర్థులందరికీ ఒక్కొక్కరికి రూ.20-25 కోట్ల చొప్పున ఇప్పటికే చేరవేసిందని సమాచారం. ఉదాహరణకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి శాసనసభకు పోటీ చేస్తున్న ప్రముఖ బిల్డర్‌కు, డెయిరీ వ్యాపారంలో ఉన్న మరో అభ్యర్థికీ తప్ప మిగతా వారందరికీ డబ్బులు పంపినట్టు పార్టీవర్గాల సమాచారం. ఆ పార్టీ ఎక్కడికక్కడ నగదు, బహుమతులతో భారీ డంప్‌లను సిద్ధంగా పెట్టింది. రూ.కోట్లు చెల్లించి నియమించుకున్న కన్సల్టెంట్ల దన్నుతో, ఎత్తులు, జిత్తులకు కొదవలేని ఆ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా డబ్బు పంచుతూ, గిఫ్టులకే రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చేసిన ఖర్చంతా ఒక ఎత్తు... ఈ ఎన్నికల్లో చేస్తోంది ఒక ఎత్తు అన్నట్లుగా డబ్బు వెదజల్లుతోంది.

ఇది అభ్యర్థులు సొంత వనరుల నుంచి పెట్టే ఖర్చుకు ఇది అదనం. ఇన్నాళ్లూ నగదు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమే చూశాం. ఈసారి ఆ పార్టీ కొత్త సంస్కృతికి తెరతీసింది. వివిధ వర్గాలవారికి కుక్కర్లు, ఫ్యాన్లు, కుట్టుమిషన్లు, చీరలు, నగదు, స్వీట్లు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, మెప్మా రిసోర్స్‌ పర్సన్లు, నరేగా సిబ్బంది, పాస్టర్లు, విలేకరులు తదితరులకు డబ్బు, బహుమతులతో ఎరవేస్తోంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తోన్న వాలంటీర్లకు నెలకు రూ.10-15 వేల వరకు జీతమిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఇవి దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు కాబోతున్నాయని, ఉత్తరభారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టే మొత్తం ఖర్చంతా కలిపినా... ఏపీలో పెడుతున్నంత ఉండదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.

రాష్ట్రమంతా పులివెందుల ఫార్ములా..!

ఆ పార్టీ డబ్బు వెదజల్లి నాయకుల్ని, కార్యకర్తల్ని కొనేసే వ్యవహారాన్ని వైయస్‌ఆర్‌ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో కొన్ని నెలల క్రితమే మొదలు పెట్టి... అదే ఫార్ములాను క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది. పులివెందుల, కమలాపురం సహా వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్న కీలకమైన కార్యకర్తలు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు ‘కార్యకర్తలకు భరోసా’ పేరుతో బహిరంగంగా డబ్బులు పంచారు.  దాని కోసం ఒక ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. సాయం కోరుతున్నట్లుగా ఆయా నాయకుల నుంచి దరఖాస్తు తీసుకుని డబ్బులిచ్చారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందు బహిరంగంగా చేసిన ఈ కార్యక్రమాన్ని... ఇప్పుడు తెరచాటున నిర్వహిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు తదితర మండలాల్లో పార్టీ క్షేత్రస్థాయి నాయకులెవరూ సహకరించే పరిస్థితి లేకపోవడంతో వారికి రూ.10-20 లక్షలిచ్చి బుజ్జగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కడప లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మిగతా పార్టీలూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడంతో పోటీ తీవ్రమవడంతో...ఆ పార్టీ ఒక్కో మండలానికి ఒక ఇన్‌ఛార్జిని నియమించి నాయకులు, కార్యకర్తలకు డబ్బులు పంపిణీ కార్యక్రమం వారికి అప్పజెప్పింది.

ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం

ఆ పార్టీ మొదట తమ మండల, గ్రామస్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో పాటు, తటస్థులు, కనీసం 100 మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్నవారినీ, కార్యకర్తలను టార్గెట్‌ చేసింది. వారి స్థాయిని బట్టి డబ్బులు పంచుతోంది. కార్యకర్తలకైతే రూ.50 వేలు, నాయకులకు రూ.50 లక్షల వరకు ఇస్తోంది. చాలా చోట్ల తొలివిడత పంపిణీ కార్యక్రమం పూర్తయిందని, ఎన్నికలు సమీపించేనాటికి రెండో విడత పంపిణీ ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల నుంచి ముఖ్య నాయకులు, బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట వారిని ఓడించేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. ఆ పార్టీ వివిధ వర్గాలవారికీ, ఓటర్లకు పంచేందుకు ఎక్కడికక్కడ డంప్‌లు ఏర్పాటు చేసింది. వాటిలో ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడ్డవి 0.01 శాతం కూడా ఉండవని సమాచారం. ప్రాంతాల వారీగా డబ్బు పంపిణీ, సమన్వయ బాధ్యతను కొందరు ముఖ్య నేతలకు అప్పగించింది.

ఒక్కో నియోజకవర్గంలో బహుమతులకే రూ.5-6 కోట్లు

  • పార్టీ అభ్యర్థుల్లో చాలా మంది చీరలు, ప్యాంట్లు, షర్ట్‌లు, ఇతర బహుమతులు పంచేందుకే రూ.5-6 కోట్ల చొప్పున ఖర్చు పెడుతున్నారు.
  • విశాఖ జిల్లాలో ఓ అభ్యర్థి ఆటోడ్రైవర్లు, వివిధ వృత్తులకు చెందినవారితో సమావేశాలు నిర్వహించి, భోజనాలు పెట్టి రూ.1,500 చొప్పున ఇస్తున్నారు.
  • రాజమహేంద్రవరంలో ఆ పార్టీ అభ్యర్థి మాజీ కార్పొరేటర్లు, పార్టీ కీలక నాయకులు, ఇన్‌ఛార్జులతో సమావేశాలు నిర్వహించి... వారి స్థాయినిబట్టి రూ.5 నుంచి రూ.30 లక్షల వరకు ఇస్తున్నారు. అక్కడ సామాజికవర్గాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించి, వారిని ప్రలోభపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు.
  • కొత్తపేట నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి...గుత్తేదారులతో సమావేశాలు నిర్వహించి పెండింగ్‌ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇసుక మొత్తం దోచేసిన ఆ నాయకుడు... గ్రామాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి మట్టి, ఇసుక ఉచితంగా సరఫరా చేస్తానని హామీలిస్తున్నారు.
  • వేరే జిల్లా నుంచి వచ్చి ప్రకాశం జిల్లాలో లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ నాయకుడు, దాని పరిధిలోని శాసనసభ స్థానాల అభ్యర్థులకు, ఓటర్లను ప్రభావితం చేయగలరనుకున్నవారికి డబ్బుల పంపిణీ మొదలు పెట్టారు. శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులకు పార్టీ ఇచ్చిన డబ్బు కాకుండా, ఆ లోక్‌సభ అభ్యర్థి ఇప్పటికే రూ.కోటి చొప్పున ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగులు, వాలంటీర్లు, గృహసారథులు, బూత్‌ కమిటీల వరకు ప్రభావితం చేసే కార్యక్రమం అక్కడ జోరుగా సాగుతోంది. పార్టీలోని నియోజకవర్గ, మండలస్థాయి నాయకులకు వారు ఎన్ని ఓట్లు వేయించగరన్నది చూసి డబ్బులు ఇస్తున్నారు. గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు ఇస్తున్నారు.
  • కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ప్రచార శైలి విభిన్నంగా ఉంటుంది. ఆయన జనంలోకి వెళ్లినప్పుడు కూడా సంచిలో డబ్బులు పట్టుకుని అనుచరులు అనుసరిస్తారు. డబ్బులు ఇవ్వాలనుకున్న చోట ఆయన సైగ చేస్తే...అప్పటికప్పుడు రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఇస్తారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కార్యక్రమానికి ఆర్థికసాయం అని పేరు పెట్టారు.
  • గుడివాడ నియోజకవర్గంలో అసభ్య పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో ప్రసిద్ధి చెందిన నాయకుడు... ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు హారతులిచ్చినవారికి పళ్లెంలో డబ్బులు వేస్తున్నారు. ఆయనది అదో తరహా పంపిణీ కార్యక్రమం.

మద్యం దుకాణాలతో ముందస్తు ఒప్పందం..

రాష్ట్రంలో చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు మద్యం దుకాణాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి రూ.లక్షల్లో చెల్లించారు. మద్యం పంపిణీ చేయాలనుకున్నవారికి అభ్యర్థులు టోకెన్లు ఇస్తున్నారు. అవి తీసుకుని వెళితే అక్కడ మద్యం సీసాలు అందజేస్తున్నారు. విశాఖలో ఆ పార్టీ అభ్యర్థి ఒకరు దీన్ని వ్యవస్థీకృతం చేసేశారు.


చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు..

  • విశాఖ జిల్లాలో అత్యంత ధనవంతుడైన ఒక అభ్యర్థి... ఇప్పటికే నియోజకవర్గంలో ఇంటింటికీ స్వీట్‌ బాక్సులు, చీరలు పంపిణీ చేశారు. మెప్మా రిసోర్స్‌పర్సన్ల వంటివారితో సమావేశాలు నిర్వహించి భోజనాలు పెడుతున్నారు. సమావేశానికి హాజరైనప్పుడే వారికి టోకెన్లు ఇచ్చేస్తున్నారు. సమావేశం ముగిశాక వాటిని తీసుకెళ్లినవారికి రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు.
  • గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి... అంగన్‌వాడీ కార్యకర్తలు, మెప్మా రిసోర్స్‌ పర్సన్లకు ఇటీవల కవర్లలో రూ.7 వేల చొప్పున పెట్టి పంపించడం సంచలనమైంది.
  • తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందు నుంచే అక్కడ ఓటర్లకు ఎరవేసే కార్యక్రమం మొదలైంది. ఇంటింటికీ కుక్కర్లు, రిస్ట్‌ వాచీలు, గోడ గడియారాల పంపిణీ మొదలు పెట్టారు. వాలంటీర్లతో పాటు వివిధ వర్గాల వారికీ బహుమతులు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని