వైకాపా కోడ్‌ నడుస్తోంది

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా.. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే నడుస్తోంది. దేశమంతటా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తుంటే.. మన రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీ సేవలోనే తరించిపోతున్నారు.

Published : 11 Apr 2024 06:15 IST

రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా అధికార పార్టీ సేవలోనే కొందరు పోలీసు అధికారులు
వైకాపా రౌడీమూక అరాచకాలకు వెన్నుదన్ను
అధికార పార్టీ కార్యకర్తల్లా ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు
ఎన్ని దారుణాలు చేస్తున్నా చర్యలు శూన్యం
అందుకే పేట్రేగిపోతున్న వైకాపా ఖాకీలు

రేయ్‌ కాల్చిపడేస్తా.. రౌడీషీట్‌ తెరిచి లాకప్‌లో వేస్తా’ అంటూ తెదేపా శ్రేణుల్ని హెచ్చరించిన కారంపూడి సీఐపై చర్యలేవి?

కర్నూలులో తెదేపా నేత శేషగిరిశెట్టిని చితకబాదిన ఇన్‌స్పెక్టర్‌ ఆదినారాయణరెడ్డిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?

ఈనాడు - అమరావతి

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి 24 రోజులవుతున్నా.. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే నడుస్తోంది. దేశమంతటా అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తుంటే.. మన రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికీ అధికార పార్టీ సేవలోనే తరించిపోతున్నారు. వైకాపా రౌడీమూకల అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్న వైకాపా కార్యకర్తలను ఉక్కుపాదంతో అణచేయాల్సింది పోయి బాధితులపైనే రివర్స్‌ కేసులు పెడుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులే అధికార పార్టీ కండువాలు కప్పుకొన్న కార్యకర్తల్లా ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. అలాంటి వారిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోకపోతుండటంతో మరింతగా పేట్రేగిపోతున్నారు. ‘రేయ్‌ కాల్చి పడేస్తా.. ఏమనుకుంటున్నావో.. రౌడీషీట్‌ తెరిచి లాకప్‌లో వేస్తా’ అంటూ మాచర్ల నియోజకవర్గం కారంపూడి సీఐ చిన్నమల్లయ్య  తెదేపా శ్రేణులను ఇటీవల తుపాకీతో బెదిరించారు. ఆయనపై ఇప్పటికీ ఏ చర్యా లేదు. కనీసం సంజాయిషీ అడగలేదు. కర్నూలులో తెదేపా నాయకుడు శేషగిరిశెట్టిని 2రోజుల కిందట స్పెషల్‌ పార్టీ సీఐ ఆదినారాయణరెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్‌ అని పిలిచి చితకబాదారు. ఈ ఘటనపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. హింసను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాంటి అధికారులందరికీ తీవ్రమైన హెచ్చరిక పంపించేలా కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? క్షేత్రస్థాయిలో ఇలాంటి అధికారులు కొనసాగుతుంటే నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది?

బాధితులపైనే రివర్స్‌ కేసులు

3 రాజధానుల విధానంపై నిలదీసినందుకు.. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ అనుచరులు తెదేపా కార్యకర్తలు కిషోర్‌, నరసింహరావులపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పోలీసులు వైకాపా నాయకుల ఫిర్యాదు ఆధారంగా తిరిగి బాధితులపైనే రివర్స్‌ కేసు పెట్టారు. దాడికి పాల్పడ్డవారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి కొమ్ముకాశారు.

  • పల్నాడు జిల్లా క్రోసూరులో తెదేపా కార్యాలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అక్కడ చంద్రబాబు ప్రజాగళం సభ జరిగిన మరుసటిరోజే ఈ దారుణం చోటుచేసుకుంది. సభ విజయవంతమవటాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని తెదేపా ఆరోపించింది. పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి సత్తిరాజు గంగాధర్‌రెడ్డి, నంబూరు కల్యాణ్‌ చక్రవర్తి, బొంతు రవీంద్రనాథ్‌ చౌదరి, వడ్డే కృష్ణారెడ్డిలే ఈ ఘటనకు కారణమంటూ ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ పోలీసులు వారెవరిపైనా చర్యలు తీసుకోలేదు.
  • అడ్డదారుల్లోనైనా సరే గెలిచేందుకు కర్నూలు జిల్లాలో వైకాపా నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయా ఘటనలపై ప్రతిపక్షాల అభ్యర్థులు ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులిస్తున్నా వైకాపా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.
  • కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా నాయకుల ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన తెదేపా నాయకురాలు మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడితే.. పోలీసులు నిందితులకే వత్తాసు పలికారు.

ఎస్పీని మారిస్తే సరిపోతుందా?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గాన్ని వైకాపా నాయకులు అరాచకానికి కేంద్రంగా మార్చేశారు. అయిదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హింసకు పాల్పడుతూ నియోజకవర్గాన్ని మరో చంబల్‌లోయగా తయారుచేశారు. ఇక్కడ పోలీసులే వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ జిల్లా ఎస్పీని బదిలీ చేసింది.. కానీ క్షేత్రస్థాయిలో ఇంకా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న సిబ్బందిపై చర్యల్లేవు.

తెదేపా శ్రేణులపై వరుస దాడులు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ హింసాత్మక ఘటనలేవీ జరగకూడదని, అలా జరిగితే ఆ జిల్లా ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పదే పదే చెబుతున్నా కొందరు పోలీసులు అవేవీ లెక్క చేయట్లేదు.

  • మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిగూడేనికి చెందిన తెదేపా నాయకులు తులసీనాయక్‌, రవినాయక్‌, శ్రీనునాయక్‌లపై వైకాపా శ్రేణులు కర్రలు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. వెల్దుర్తి మండల వైకాపా జడ్పీటీసీ అనుచరులు తెదేపా వర్గీయుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేశారు.
  • గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బేతాళ రవి, ఈశ్వర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.

కఠిన హెచ్చరికలు పంపిస్తేనే..

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, హింసకు పాల్పడుతూ వైకాపా నాయకులు పేట్రేగిపోతున్నారు. హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాల్సిన పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులే దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటివారిని ఉపేక్షిస్తే ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ హింసాత్మక ఘటనలు మరింత పెరుగుతాయి. ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగకుండా ఎన్నికల నిర్వహించాలనే ఈసీ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల హింసాత్మక ఘటనలకు బాధ్యులైన ఎస్పీలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో అరాచకంగా వ్యవహరిస్తున్న వారిని కూడా గుర్తించి, చర్యలు తీసుకోవాలి.


ప్రతిపక్ష పార్టీలకు జైకొట్టడమూ నేరమేనా?

అయిదేళ్లుగా విపక్ష నాయకులు అడుగు తీసి అడుగేస్తే కేసు అన్నట్లుగా వేధించిన పోలీసులు.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడూ వైకాపాపై స్వామి భక్తి ప్రదర్శించడం మానలేదు. ప్రతిపక్ష పార్టీలకు జై కొట్టడం కూడా నేరమేనన్నట్లు జనాన్ని వేధిస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం కిష్కింధపాలెంలో తెదేపా కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించిన పంచాయతీ సిబ్బంది వైకాపా నాయకుల ఇళ్లపై పార్టీ జెండాలను మాత్రం తీయలేదు. దీనిపై ప్రశ్నించిన తెదేపా నాయకులపై వైకాపా వారు దాడి చేయగా... పోలీసులు తిరిగి బాధితులపైనే కేసు పెట్టారు.

  • అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో తెదేపా మద్దతుదారు దుకాణంలో పనిచేస్తున్న కూలీపై ఎస్సై నాగశివరెడ్డి దాడికి పాల్పడ్డారు. దుకాణ యజమానిని వైకాపాలో చేరేలా ఒత్తిడి చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదులున్నాయి.
  • బల్లికురవ మండలంలో వైకాపాకు 3 వేలకు పైగా మెజారిటీ తెప్పిస్తానని ఓ పోలీసు అధికారి బహిరంగంగానే శపథం చేస్తున్నారు.
  • ‘జై తెలుగుదేశం, జై గొట్టిపాటి’ అని నినాదాలు చేసినందుకు అద్దంకి నియోజకవర్గం వేమవరం తండావాసులపై వైకాపా నాయకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
  • అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలపై కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు బనాయించారు.

అరాచకాలకు కొమ్ముకాస్తూనే ఉన్నారు..

  • కాకినాడలో శివాలయంలో అర్చకులపై వైకాపా నేత, మాజీ కార్పొరేటర్‌ సిరియాల చంద్రరావు దాడికి పాల్పడ్డారు. కాలితో తన్ని, చెంపపై కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఈ కేసులో రాజీ కుదిర్చి, నీరుగార్చే ప్రయత్నం చేశారు. చివరికి మొక్కుబడి సెక్షన్‌తో సరిపెట్టేశారు.
  • గుడివాడలో వైకాపా అండదండలతో పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్‌ ఓ ఇంటర్మీడియట్‌ అమ్మాయిని వేధించింది. దీనిపై బాధితురాలి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగటంతో బాధితురాలు తండ్రి దిశ యాప్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అక్రమంగా గంజాయి కేసు బనాయించేందుకు ఇన్‌స్పెక్టర్లు ప్రయత్నించారు.

- ఎన్నికల కోడ్‌ ఉన్నా.. క్షేత్రస్థాయిలో పోలీసులు వైకాపా నాయకులు ఎంతలా కొమ్ముకాస్తున్నారో చెప్పేందుకు ఈ రెండు ఘటనలు తాజా నిదర్శనాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు