రోడ్లేయని జగన్‌.. ఓ జనహంతక చక్రవర్తి!

ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్‌ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్‌.. ఓ చిరుద్యోగి.

Updated : 18 Apr 2024 16:53 IST

దారులు, రహదారులు, అడ్డదారుల గురించి వినుంటారు... యమదారులు మాత్రం చూసుండరు! గుంతలు పడి... రాళ్లు లేచి... గమ్యం చేరతామో... గగనానికి ఎగురుతామో తెలియక... భయంభయంగా...  ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సాగే ఆంధ్రావని రోడ్లు... జగనన్న అయిదేళ్ల పాలనకు నిలువుటద్దాలు!

ఆడపడుచుల పసుపు కుంకుమలను తుడిచేసేవాడు ‘అన్న’ అవ్వడు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల గురించి పట్టించుకోకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని చెరిపేసిన జగన్‌ ‘అన్న’ ఎలా అవుతారు? పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఆనంద్‌.. ఓ చిరుద్యోగి. బండిపై వెళ్తూ రోడ్డు గుంతలో పడి  చనిపోయాడు. దాంతో ఆనంద్‌ భార్య రామాంజమ్మ, నలుగురు పిల్లల జీవితాలు మోడువారిపోయాయి. కాకినాడ జిల్లా పెద్దిపాలెం వాసి కోన సత్తిబాబు భవన నిర్మాణ కూలి. దార్లో నోరుతెరిచిన గుంత ఒకటి సత్తిబాబును మింగేసి, అతని  భార్యాపిల్లల బతుకుల్లో వెలుగును ఆర్పేసింది. చిత్తూరు జిల్లా గుంటిపల్లి చెరువు దగ్గరి రోడ్డుపై గుంత- కరుణాకర్‌రెడ్డి అనే ద్విచక్ర వాహనదారుణ్ని బలిగొంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గుంతల రోడ్డు 15 రోజుల్లో ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఇలా ఎన్నో అకాల మరణాలు.. అవన్నీ జగన్‌ చేసిన హత్యలే! ఎందుకంటే- సీఎంగా ఆయన కనీసం రోడ్లపై గోతులనైనా పూడ్పించి ఉంటే, ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా ఉండేవి కాబట్టి!

జగన్‌ నవ్వులు.. జనం ఏడుపులు!

అమెరికా సంపన్న రాజ్యం ఎలా అయ్యింది? ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెన్నడీ ఒకసారి దీనికి సమాధానమిచ్చారు. ‘‘మంచి రోడ్లు వేసుకోవడం వల్లే అమెరికా ధనిక దేశం కాగలిగింది’’ అని కెన్నడీ స్పష్టంగా చెప్పారు. వృత్తి వ్యాపారాల వృద్ధికి రోడ్లు తోడ్పడతాయి. తద్వారా సంపదను సృష్టిస్తాయి. జనం బతుకులను బాగుపరుస్తాయి. అలాంటి చక్కటి రహదారులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయా.. లేవు! ఒళ్లు హూనం కాకుండా, వాహనాలు పాడైపోకుండా ఏపీలో ఎటైనా వెళ్లగలమా.. లేదు! గుంతల రోడ్లలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇల్లు చేరితే చాలని దేవుడికి దండం పెట్టుకోని వారెవరైనా ఉన్నారా.. లేరు! జనం ఇంతగా ఆక్రోశిస్తుంటే- సీఎంగా జగన్‌ ఏం చేశారు? ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేసి విషపు నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు.

పిట్టలదొర జగన్‌

మైకు ముందుకు రాగానే పిట్టలదొరగా మారిపోతారు జగన్‌. బడాయి కబుర్లతో జనాన్ని ఏమార్చడానికి తెగ ప్రయత్నిస్తారు. ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులతో మా అయిదేళ్ల పాలన సాగింది’’ అన్న జగన్‌ ఇటీవలి మాటలన్నీ అచ్చంగా పిట్టలదొర డప్పులే! తారు లేచిపోయి రాళ్లుతేలిన రహదారులు, బురద బాటలు, గుంతల మధ్యలో రోడ్డెక్కడ ఉందో వెతుక్కుంటూ చేసే ప్రయాణాలు.. జగన్‌ అనగానే జనానికి గుర్తొచ్చేవి ఇవే! కాబట్టి వైకాపా అధినేత చెప్పిన విప్లవాత్మక మార్పులేవో ఆయన కలలోనే వచ్చి ఉంటాయి తప్ప రాష్ట్రంలో రాలేదు. ఏపీలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 45వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లున్నాయి. వాటిలో 9వేల కి.మీ. మేర నరకలోకపు వాకిళ్లుగా మారిపోయాయి. ఇంకో ఏడున్నర వేల కి.మీ. రహదారులన్నీ గుంతలతో జల్లెడల్లా తయారయ్యాయి. మరో 8.5వేల కి.మీ రోడ్లేమో ఏదో పైపైన అలా ఉన్నాయంటే ఉన్నాయి. ‘‘రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే గుర్తించి.. సత్వర మరమ్మతులు చేపట్టాలి’’ అని 2019 నవంబరులో చెప్పిన జగన్‌- ఆ పనులు చేయించారా? అబ్బో.. రాష్ట్రానికి అంత అదృష్టం కూడానా! ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి రోడ్డు వేశాక అయిదేళ్లకోసారి బీటీ లేయర్‌తో దాన్ని పునురుద్ధరించాలి. ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 9వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు తప్పనిసరి. అవీ చేయించలేదు జగన్‌. ఆయన హయాంలో ఒకే ఒక్కసారి 7.6వేల కి.మీ. మేరకు పునరుద్ధరణ పనులు జరిగాయి. వాటికోసం రూ.2వేల కోట్ల రుణం తీసుకున్నారు. ఆ అప్పు వాయిదాల చెల్లింపుల కోసం పెట్రోల్‌, డీజిల్‌లపై లీటర్‌కు రూపాయి చొప్పున అదనంగా వసూలు చేశారు. అలా నెలకు రూ.50 కోట్లు జనం జేబుల్లోంచి లాక్కున్నారు. జగన్‌ అన్న ‘‘కనీవినీ ఎరగని విప్లవాత్మక మార్పులు’’ అన్నీ ఇదిగో ఇలాగే ప్రజలను పీడించడంలో తెచ్చినవే! 

జగన్‌ పరివారానికి ప్రత్యేక రోడ్లు

హెలికాప్టర్‌లో తిరిగే అరాచక చక్రవర్తి జగన్‌కు జనం బాధలు కనపడవు. ఆయన పొరపాటున రోడ్డు ప్రయాణం చేయాల్సి వస్తే- ఆ రహదారి ఒక్కటే ఆఘమేఘాలపై బాగయ్యేది. తాను, తన కుటుంబ సభ్యులు, తన పార్టీ నేతలు మాత్రమే మనుషులు అన్నట్లుగా ప్రవర్తించడం జగన్‌కే సాధ్యం. ఆయన అంతటి స్వార్థపరుడు కాబట్టే సొంత జిల్లాలోని భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ ముందు మిలమిల మెరిసే రోడ్డేశారు. ఆ చుట్టుపక్కల ఊళ్లలో పాడైపోయిన రహదారులనేమో అలాగే గాలికొదిలేశారు. జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రం కోసమని జనం తిరగని దారిలో రూ.30 లక్షల ఉపాధి నిధులతో ప్రత్యేకంగా తార్రోడ్డు నిర్మించారు. విశాఖపట్నంలో కూడా అలాగే జగన్‌ బంధుమిత్రులు, ఆయన పార్టీ నేతల ఆస్తులున్న కొన్ని ప్రాంతాల్లోనే మంచి రోడ్లు కనపడతాయి. ఇదే మరి జగన్‌ రాజ్యం... జనాన్ని చావగొట్టి అయినవారికి అంతా దోచిపెట్టే రాబందు రాజ్యం!

తాళిబొట్లను తెంచేసిన జగన్‌!

శ్రీకాకుళం-పాలకొండ ప్రధాన రహదారిలోని గుంతల కారణంగా కానిస్టేబుల్‌ సురేష్‌ ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా మనుబోలు భాజపా మండలాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కూడా రోడ్డుపై గుంతను తప్పించబోయి బండి మీద నుంచి జారిపడ్డారు. అక్కడికక్కడే మరణించారు. ఇలా ఒకరా ఇద్దరా.. అయిదేళ్ల జగన్‌ పాలనలో ఎందరో అభాగ్యులను గుంతల రోడ్లు బలితీసుకున్నాయి. చెత్త రహదారుల్లో ప్రయాణాల మూలంగా బండ్ల రిపేర్లూ అధికమయ్యాయి. వాహనాలపై తిరుగుతూ చిరువ్యాపారాలు చేసుకునేవారు, ఆటో కార్మికులు తదితరులకు ఖర్చులు అధికమయ్యాయి. ఈ బాధలన్నీ పడలేమని జనమంతా మొత్తుకున్నా జగన్‌ కొత్త రోడ్లు వేయించలేదు. పాత రోడ్లను బాగు చేయించలేదు. కనీసం రోడ్లపై గుంతలనూ పూడ్పించలేదు. వాటి కారణంగా ఎందరో చనిపోయినా జగన్‌ చలించలేదు. రోడ్లను నాశనం చేసి, వాటిపై నెత్తుటేళ్లు పారించిన జగన్‌ ఒక జనహంతకుడు.. అయిదేళ్లలో ఆంధ్ర రాష్ట్రాన్ని అవసాన దశకు లాక్కుపోయిన ఉన్మత్త పాలకుడు!

నిధులు ఇవ్వలేదు.. పనులు కాలేదు!

ప్రజల కష్టనష్టాలను తీర్చని జగన్‌- పాత ప్రభుత్వం చేపట్టిన మంచి ప్రాజెక్టులనూ పాడుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 6,534 కి.మీ మేర కొత్త రోడ్ల నిర్మాణం, 624 కి.మీ వరకు పాత రోడ్ల బాగుసేతకు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ)తో తెదేపా సర్కారు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రాజెక్టు వ్యయం రూ.4,944 కోట్లలో 70శాతం రుణంగా ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. మిగిలిన సొమ్మును రాష్ట్రం సమకూర్చాలి. తెదేపా హయంలో ప్రారంభమైన ఈ పనులను జగన్‌ ఆపేయించారు. ఆపై ఎప్పటికో మళ్లీ మొదలుపెట్టించినా- ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో దారుణ అలక్ష్యం ప్రదర్శించారు. దాంతో పనుల పురోగతి పడకేసింది. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డీబీ) రుణసాయంతో చేపట్టిన రోడ్ల విస్తరణ ప్రాజెక్టుకూ జగన్‌ సర్కారు గ్రహణం పట్టించింది. 2023 మార్చికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ముప్ఫైశాతం దగ్గరే దేకుతున్నాయంటే కారణం జగనే. రాష్ట్ర వాటా నిధులను ఆయన బిగపట్టేశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రాజెక్టును రద్దుచేస్తామని కేంద్రం, ఎన్‌డీబీ వర్గాలు హెచ్చరించినా జగన్‌ ఖాతరు చేయలేదు. కనీసం కేంద్ర రహదారి మౌలికవసతుల నిధిని సద్వినియోగం చేసుకుని ఉన్నా- ఏపీ రోడ్లు ఎంతోకొంత బాగుపడేవి. గద్దెనెక్కాక గిట్టనివాళ్లను రాచిరంపాన పెట్టారే తప్ప రాష్ట్రానికి పనికొచ్చే పని ఏదీ జగన్‌ చేయలేదు.

పల్లెలకు జగనే ఒక శాపం!

పిల్లికి బిచ్చం వేయనివాడు జనంలోకి వచ్చి ‘నేను దానకర్ణుణ్ని’ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది! జగన్‌ చెప్పుకొనే గొప్పలూ అలాగే రోతగా ఉంటాయి. పూర్తిగా దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మీద ఆర్టీసీ బస్సులు ఒరిగిపోతున్నాయి. పాఠశాల బస్సులు పల్టీకొడుతున్నాయి. బండ్లు అదుపు తప్పుతుండటంతో వాహనదారుల ప్రాణాలే పోతున్నాయి. పది పన్నెండు కి.మీ. ప్రయాణానికీ గంటకు పైగా పట్టేంతగా పల్లె రహదారులు గుంతలు తేలాయి. ఈ నిజాలను దాచిపెట్టి ‘‘గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థితులు మారాయి’’ అంటూ జనం చెవిలో పూలుపెడుతున్నారు జగన్‌. గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో 25వేల కి.మీ. పైగా సిమెంటు రహదారులను వేయించింది. ఉపాధి హామీ నిధులు, పంచాయతీ సొమ్ములతో పల్లె రోడ్లను అందంగా తీర్చిదిద్దింది. జగన్‌ సీఎం అయ్యాక ఉపాధి నిధులను గ్రామ సచివాలయాల వంటివాటి నిర్మాణానికి ఇష్టానుసారం మళ్లించారు తప్ప రోడ్లను పట్టించుకోలేదు. అటు ఆ భవనాలనూ పూర్తి చేయలేదు. పంచాయతీల ఖాతాలనూ జగన్‌ ఊడ్చిపారేశారు. ఫలితంగా గ్రామీణ రహదారుల నిర్వహణ పరమ అధ్వానమైంది.

యథా జగన్‌.. తథా ఎమ్మెల్యేలు!

బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటివి ఒకప్పుడు బీమారు రాష్ట్రాలుగా పరువు మాశాయి. రోడ్లు, మౌలిక వసతులు ఏవీ అక్కడ ఉండేవి కావు. 1990ల్లో బిహార్‌ సీఎంగా లాలుప్రసాద్‌ ఉండేవారు. ‘‘రోడ్లు చాలా ప్రమాదకరమైనవి. మీ గ్రామాలకు రహదారులొస్తే, పోలీసులు చాలా సులువుగా మీ ఇళ్ల దాకా వచ్చేస్తారు’’ అంటూ ఆయన అప్పట్లో జనాన్ని భయపెట్టారు. రోడ్లు వేయట్లేదేంటని నిలదీసిన ప్రజలకు జగన్‌ పార్టీ నేతలూ అడ్డదిడ్డంగా జవాబులిచ్చారు. ‘‘గ్రామాలకు రహదారులు బాగాలేకపోతే నష్టమేమీ లేదు’’ అని నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తేల్చిపడేశారు. ‘‘డబ్బులన్నీ పథకాలకే ఖర్చవుతున్నాయి... రహదారులు నిర్మించలేం’’ అని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు చేతులెత్తేశారు. ‘‘ఒక్క నెల పింఛన్లు ఆపేస్తే, ఆ డబ్బుతో రోడ్లన్నింటినీ అద్దాల్లా చేయవచ్చు’’ అని బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టారు కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. బూతు భాషాప్రవీణ కొడాలి నానీ కూడా రోడ్లు వేయాలంటే పథకాలన్నీ ఆపాల్సి వస్తుందన్నారు. ‘‘రహదారి పనులు ఇప్పట్లో పూర్తిచేయలేం. అంతవరకు కష్టాన్ని భరించాలి’’ అని ప్రజలకు ఉచిత సలహాలిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇలాంటి పనికిరాని మాటలు, చేవచచ్చిన చేతలతోనే జగన్‌, ఆయన అంతేవాసులు రాష్ట్రానికి తెగులు పట్టించారు. ప్రగతి పూలవనం కావాల్సిన ఏపీని వెనకబడిన రాష్ట్రాలకంటే ఘోరంగా తయారుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని