మూడు ముక్కలాటతో ఏపీకి రాని ఆర్బీఐ!

మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రభుత్వం సృష్టించిన గందరగోళంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలూ రాష్ట్రానికి రావడం లేదు.

Updated : 11 Apr 2024 07:16 IST

రాజధాని ఏదో తెలియక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేకపోయామని వెల్లడి
ఏఐపీపీ జాతీయ ఉపాధ్యక్షుడి లేఖకు సమాధానమిచ్చిన ఆర్బీఐ జీఎం

ఈనాడు, అమరావతి: మూడు రాజధానుల పేరుతో జగన్‌ ప్రభుత్వం సృష్టించిన గందరగోళంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలూ రాష్ట్రానికి రావడం లేదు. తెదేపా హయాంలో అమరావతిలో వాటికి భూములు కేటాయించినా.. రాజధాని విషయంలో వైకాపా సర్కారు ఆడుతున్న జగన్నాటకంతో ఇప్పటికీ ఆ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం లేదు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోని కారణంగా అమరావతిలో తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేకపోతున్నామని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తాజాగా స్పష్టం చేయడమే ఇందుకు నిదర్శనం. అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (ఏఐపీపీ) జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులుకి బుధవారం పంపిన లేఖలో ఈ విషయాన్ని ఆర్బీఐ స్పష్టం చేసింది. జగన్‌ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రానికి ఇప్పటికే భారీగా నష్టం జరిగింది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌ సంస్థలు ముందుకు రావడం లేదు. ఉన్నవి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలూ తమ కార్యాలయాల ఏర్పాటు చేయడానికి వెనుకడుగు వేస్తున్నాయంటే ఇక్కడి దుస్థితి అర్థం చేసుకోవచ్చు.

తెదేపా హయాంలో 11 ఎకరాల కేటాయింపు

అమరావతిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు గత తెదేపా ప్రభుత్వం 2016 డిసెంబరు 1న 11 ఎకరాల భూమి 99 ఏళ్ల లీజుకు ఆర్బీఐకి కేటాయించినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో రాష్ట్రానికి చెందిన బ్యాంకులు హైదరాబాద్‌లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి నగదు తెప్పించి అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఇది వ్యయ ప్రయాసల కోర్చిన వ్యవహారం కావడంతో బ్యాంకర్లలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాస్తి వీరాంజనేయులు ఈ ఏడాది జనవరి 12న దిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో స్వయంగా లేఖ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆ కార్యాలయం ఇందుకు సంబంధించిన వివరాలు పంపాలని ఆర్బీఐని ఆదేశించింది. లేఖ ఇచ్చిన వీరాంజనేయులుకూ.. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటులో జాప్యానికి కారణాలు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ఏఐపీపీ ఉపాధ్యక్షుడికి ఆర్బీఐ జనరల్‌ మేనేజర్‌(జీఎం) సుమేట్‌ జావాడే రాసిన సమాధాన లేఖలో.. ఏపీ రాజధాని విషయంలో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోని కారణంగా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేకపోయామని స్పష్టంగా పేర్కొన్నారు. జగన్నాటకంలో ఇదొకటే కాదు.. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అమరావతిలో భూములు తీసుకుని ఇప్పటికీ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ‘కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అమరావతిలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’ అని వీరాంజనేయులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని