ఓటుతోనే తలరాతలు మారతాయి

‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం.

Published : 11 Apr 2024 04:00 IST

పిడుగురాళ్ల ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌
జాబు రావాలంటే జగన్‌ కావాలంటూ జనంతో చెప్పించి ఆనందం
చంద్రబాబు హయాంలో ఉద్యోగాలివ్వలేదని ఆరోపణ

ఈనాడు అమరావతి, న్యూస్‌టుడే-పిడుగురాళ్ల: ‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం. జగన్‌కు ఓటేస్తే ఇప్పుడు జరిగే ప్రతి మంచీ కొనసాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. పేదలంతా మోసపోతారు’ అని సీఎం జగన్‌ ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రముఖిగా మారతారని ఆరోపించారు. బాబుది బోగస్‌ రిపోర్టు అని, తమది ప్రోగ్రెస్‌ రిపోర్టు అంటూ వైకాపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ఏకరువు పెట్టారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ‘జాబు కావాలంటే బాబు రావాలని భ్రమ కల్పిస్తారు. 2014లోనూ ఇలాగే చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. నేను సీఎం అయ్యాక సచివాలయాలు తీసుకొచ్చి, 1.35 లక్షల ఉద్యోగాలిచ్చాను. మరి జాబ్‌ రావాలంటే ఎవరు కావాలి? ఫ్యాన్‌ కావాలా? తుప్పుపట్టిన సైకిల్‌ కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. తెదేపా నినాదమైన జాబు కావాలంటే బాబు రావాలనే నినాదాన్ని అనుకరిస్తూ ‘జాబు కావాలంటే.. జగన్‌ రావాలి’ అని వారిచేత చెప్పించి ఆనందించారు.

వాలంటీర్లపై మోసపూరిత మాటలు

వాలంటీర్లకు తాను ఏం చేస్తారో మాటమాత్రంగానైనా ప్రస్తావించని జగన్‌.. అదే వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తానన్న చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘వాలంటీర్లపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రూ.10 వేలు ఇస్తానంటున్నారు. అంటే నా పాలనను పరోక్షంగా మెచ్చుకున్నట్లే. ఎన్డీయే కూటమి నేతలు వాలంటీర్‌ వ్యవస్థపై భయంకరమైన ద్వేషం వెళ్లగక్కారు. ఇప్పుడు మోసపూరిత మాటలు చెబుతున్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తారు. వారినే వాలంటీర్లను చేసి, దోచుకొమ్మని చెబుతారు. అదనంగా వారికే రూ.పది వేలు ఇస్తార’ని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు పాలనతో తన పాలనను పోల్చుతూ ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు 30 ఏళ్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వివిధ వర్గాలకు తాను అమలుచేసిన సంక్షేమ పథకాలను వల్లె వేస్తూ, చంద్రబాబు ఏమి చేయలేదని వివరిస్తూ ప్రజలు ఆమోదం తెలపాలని కోరారు. సభలో ముందున్న వారినుంచి మాత్రమే స్పందన రాగా, పలుమార్లు ‘ఇలా ఇలా..’ అని చేయి చూపిస్తూ చేతులు ఊపాలని కోరారు.

ప్రసంగంలో పల్నాడు ప్రస్తావనేది?

ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌.. ఈ ప్రాంతానికి ఏం చేస్తారో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. జిల్లాకు ఏమైనా హామీలు ఇస్తారేమోనని ఆశించి వచ్చిన ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ప్రసంగించిన 3 నిమిషాల సమయంలోనే ఆపాలంటూ ఓసారి అనిల్‌కుమార్‌యాదవ్‌, మరోసారి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్‌ పంపించారు. ‘ఇక ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తారు’ అని మహేశ్‌రెడ్డి చెబుతుండగానే అతని నుంచి మైక్‌ లాక్కొన్నారు. ఉదయం శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సుయాత్ర సంతమాగులూరు అడ్డరోడ్డు, రొంపిచర్ల, నకరికల్లు మీదుగా దేవరంపాడు చేరుకుని మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నారు. దారిలో పెద్దగా జనం లేకపోయినా యాత్ర నెమ్మదిగా సాగింది. మధ్యాహ్నం బస స్థలి నుంచి కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్‌ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభ ముగిశాక కొండమోడు, అనుపాలెం, రాజుపాలెం మీదుగా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.

డబ్బులిచ్చినా, మద్యం పంచినా.. ఖాళీగా బస్సులు

పిడుగురాళ్ల ‘మేమంతా సిద్ధం’ సభకు పల్నాడు జిల్లావ్యాప్తంగా జనాన్ని తరలించేందుకు 1,100 బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ.. చాలా గ్రామాల నుంచి ఖాళీగా వచ్చాయి. నాయకులకు జన సమీకరణపై లక్ష్యం నిర్దేశించగా, వారు మద్యం, నగదు పంచినప్పటికీ ప్రజలను కదిలించలేకపోయారు. కొన్ని పల్లెల్లో కూలీ సొమ్ము ఇస్తామని చెప్పడంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా బస్సులెక్కించారు. ఒక్కో బస్సుకు నియోజకవర్గ స్థాయి నేతలు మద్యం క్వార్టర్లు ఉన్న బాక్సు ఒకటి, భోజనానికి రూ.5 వేల నగదు సమకూర్చారు. మండల, గ్రామస్థాయి నేతలు వీటికి అదనంగా ఖర్చు పెట్టుకున్నారు. బస్సుల్లో, సభా ప్రాంగణంలో కార్యకర్తలు మద్యం తాగుతూ కన్పించారు. సభికులతో పలుమార్లు జెండాలు ఊపిస్తూ సభలో ఖాళీ కన్పించకుండా జాగ్రత్తపడ్డారు. సభా ప్రాంగణంలో ఉచితంగా టాటూలు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని